నగ్నంగా ఫొటో పెడితే చెప్పుకునే దిక్కు లేదు!

 

 

 

సోషల్ మీడియాలో ఆకతాయిల వేధింపులు సర్వసాధారణం. ఆ వేధింపులని పంటిబిగువున సహించడమో, సోషల్ మీడియాలో ఉన్న అకౌంట్లని మూసేసుకుని అజ్ఞాతంగా గడిపేయడమో తప్ప అమ్మాయిలకు మరో మార్గం కనిపించదు. ఒకవేళ ధైర్యంగా అడుగు ముందుకు వేసి పోలీస్స్టేషన్లోకి ప్రవేశించారే అనుకోండి.... ఏం జరిగిందో మీరే చూడండి.

ఏప్రిల్ 7న రాజస్థాన్కి చెందిన సలేహా అనే జర్నలిస్టు తన ఫేస్బుక్లో రాసుకొచ్చిన సంఘటన సంచలనం సృష్టించింది. ఇందులో తన 17 ఏళ్ల చెల్లెలు ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించారు సలేహా. సలేహా చెల్లెలికి ఒక రోజు ఇన్స్టాగ్రాంలో ఓ మెసేజ్ వచ్చిందట. అందులో నగ్నంగా ఉన్న తన ఫొటో చూసి ఆమెకి నోట మాట రాలేదు. ఎవరో ఆమె మొహానికి ఓ నగ్న చిత్రాన్ని జోడించి పంపాడు. అంతేకాదు... తను చెప్పిన ప్రకారం నడుచుకోకపోతే, ఆ ఫొటోని సోషల్ మీడియా అంతా ప్రచారం చేస్తానని హెచ్చరికలు పంపాడు. ఆ మెసేజ్ చూసి భయపడిపోయిన సలేహా చెల్లెలు, జరిగిన విషయాన్ని ఇంట్లో పెద్దవారికి చెప్పింది.

 

 

సలేహా తండ్రి వెంటనే తన చిన్న కూతురిని తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సైబర్ నేరాలని నమోదు చేయాలంటే వేరే పోలీస్ స్టేషన్కి వెళ్లాలని చెప్పి అక్కడి నుంచి వారిని పంపేశారు. సైబర్ సెల్కు చేరుకుంటేనేమో ‘మా దగ్గర ATMకు సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే స్వీకరిస్తామని’ చెప్పి ఆ తండ్రీకూతుళ్లని వెనక్కి పంపారు. దాంతో తిరిగి స్థానిక పోలీస్ స్టేషనుకే చేరుకోవాల్సి వచ్చింది. అక్కడ ఆ తండ్రీ కూతుళ్లని కూర్చోపెట్టి పోలీసుబాబులు సుదీర్ఘమైన క్లాసు పీకారు- ‘మీ బొహ్రా జాతివాళ్లు పిల్లలకి మరీ ఎక్కువగా స్వేచ్ఛని ఇచ్చేస్తుంటారు. అసలు సోషల్ మీడియాలో మీ ఫొటోలు ఎందుకు అందుబాటులో ఉంచాలి. మీలాంటివారి వల్లే ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. వెంటనే మీ సోషల్ మీడియా అకౌంట్లన్నీ తీసిపారేయండి,’ అంటూ ఊదరగొట్టేశారు. అంతేకాదు పిల్లలకి సెల్ఫోన్లు ఇవ్వవద్దనీ, వారిని సోషల్ మీడియాలో ఉండనివ్వద్దనీ సలేహా తండ్రికి ఉచితంగా సలహాలు ఇచ్చారు.

సలేహా కుటుంబం పట్ల పోలీసులు వ్యవహారం ఇదే తీరున కొనసాగింది. ఎంత అడిగినా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయలేదు. ఫిర్యాదుకి సంబంధించిన కాపీ ఇచ్చేందుకు కూడా పోలీసులు నిరాకరించారు. ఉన్నత పోలీసు అధికారుల దగ్గరకు వెళ్లినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. చాలామంది పోలీసులకి సోషల్ మీడియా గురించి అవగాహన లేదనీ... వారి నుంచి ఏమీ ఆశించవద్దనీ మరికొన్ని సలహాలు సదరు ఉన్నతాధికారుల నుంచి వినిపించాయి.

సలేహా ఒక జర్నలిస్టు కాబట్టి జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు తన ఫేస్బుక్ ద్వారా పంచుకున్నారు. అంతేకాదు! ట్విట్టర్ ద్వారా కేంద్ర మహిళా, శిశుసంరక్షణ శాఖ మంత్రి మేనకా గాంధితో కూడా తన బాధను పంచుకున్నారు. దానికి వెంటనే స్పందించిన మేనకా గాంధి కేసుని వేగంగా దర్యాప్తు చేయమంటూ సంబంధిత పోలీసు అధికారులని ఆదేశించారు. బహుశా సలేహా కుటుంబానికి న్యాయం దక్కవచ్చునేమో! కానీ మామూలు వ్యక్తుల పరిస్థితి ఏమిటి?

- నిర్జర.