"నువ్వు తప్ప నాకెవరున్నారు మామయ్యా? తప్పక చూపిస్తాను. త్వరలోనే" అన్నాడు కిరణ్.
    
    అతని మనసు చాయని కలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. ఎందరున్నా ఒంటరిగా అనిపించడం, కోరుకున్నవారి సమక్షంలో తప్ప ఆనందం పొందలేక పోవడమే ప్రేమంటే!
    
    దయామణి చాయకి కబురు చేస్తానంది.
    
    కిరణ్ అద్దం ముందు నిలబడి మరోసారి తనని నిశితంగా చూసుకున్నాడు. తన కళ్ళకి తనే చాలా హేండ్సమ్ గా కనిపించాడు. అతని పక్కన చాయ నిలబడి మునివేళ్ళమీద నిలబడి అతని పెదవులు అందుకున్నట్లుగా భ్రాంతి కలిగించింది.
    
    "చాయా.....యూ ఆర్ కిల్లింగ్ మీ ఇంకెన్ని రోజుల్లే" అనుకుని నవ్వుకున్నాడు.
    
    'ప్రేమకన్నను ఎక్కువేముందిరా.....?? పదవులకన్నా ప్రేమే ఎక్కువరా' అన్న కవుల సూక్తి ఆ యువకుడి ముఖంలో దరహాసచంద్రికై వెలిసింది.
    
    'చాయ ఇప్పుడు తప్పకుండా పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఇప్పుడు తనకి డబ్బుకి లోటులేదు. ఆమె కోరిన ప్రకారం కొత్త ఇల్లు కూడా సిద్దమైంది. ఇంకా ఏ శక్తీ మమ్మల్ని విడదీయలేదు' అనుకున్నాడు నమ్మకంగా.
    
    చాయ నాలుగు గంటలకి నేషనల్ పార్క్ దగ్గరికి వస్తానందని దయామణి ఫోన్ చేసి చెప్పింది.
    
    కిరణ్ విసుగ్గా వాచ్ వైపు చూసుకున్నాడు. ఇంకా రెండే అయింది. గబగబా గడియారపు ముళ్ళని ముందుకి తిప్పేద్దామా అన్నంతకోపం వచ్చింది.
    
    కాలం క్షణాలలో చేసిన ఒక కంఠాభరణం.....అందులో ప్రతిక్షణం ఓ విలువైన రత్నం వంటిదే.
    
    ఇంకా మనస్సుని పట్టి బంధించే శక్తిలేక బయటకి నడిచాడు.
    
                                                                    * * *
    
    లూసీ కళ్ళు పెద్దవిగాచేసి ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూస్తూ వుండిపోయింది జయచంద్రవేపు.
    
    "ఎస్....లూసీ! కిరణ్ సంధ్యకి తగిన వరుడు. ఇది నా నిర్ణయం మాత్రమే కాదు. వారి నిర్ణయం కూడా వీళ్ళిద్దరూ ఒకర్నొకరు అమితంగా ఇష్టపడుతున్నారు" తృప్తిగా అన్నాడు జయచంద్ర.
    
    లూసీకి కిరణ్ మాటలు, అతని ప్రేయసిని అతను ప్రేమించే తీరు గుర్తొచ్చాయి.
    
    "సంధ్యా....సంధ్యనా కిరణ్ ప్రేమిస్తున్నది?" లూసీ విస్మయంగా అడిగింది.
    
    జయచంద్ర హుందాగా నవ్వాడు.
    
    "ఓ గాడ్! లూసీ కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్ళు నిండాయి. "ఎంతగా అడిగినా ఎవరో చెప్పడు ఇందుకా? నాకు ఎంత ఆనందంగా వుందో చెప్పలేను" అంది.
    
    జయచంద్ర నవ్వేస్తూ "సంధ్య పెళ్ళి త్వరగా జరిపించెయ్యాలి. వాళ్ళ అంకుల్ కి తెలియచేయండి" అంది లూసీ.
    
    "జయచంద్ర నుదురు కొట్టుకుని "లూసీ! యూ ఆర్ జీనియస్ చూశావా! ఈ ఆనందంలో పడి  నేనా సంగతే పట్టించుకోలేదు. భగవంతరావుగారికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. కాదు.....కాదు..... ఆడపిల్లని ఇచ్చుకునేవాడిని కదా నేనే స్వయంగా వెళతాను" అన్నాడు.
    
    లూసీ అతని కంగారుచూసి ముచ్చటగా నవ్వింది.
    
    వ్యక్తిత్వం పెరిగేది అస్తమానం తన గొప్పదనం నలుగురికీ గుర్తుచేస్తూ వుండటంవల్ల కాదు. తను మరచిపోయినా నలుగురూ తన హోదాని గుర్తు చేయడం వల్ల. నిరాడంబరత ఎప్పుడూ గొప్పగానే వుంటుంది.
    
                                                                      * * *
    
    "సంధ్యా..... సంధ్యా" కాంచన బలహీనంగా పిలిచింది.
    
    ఆమె పిలుపు వినిపించుకునేవాళ్ళు ఎవ్వరూ అక్కడలేరు.
    
    నాయర్, పనిమనిషీ టీవీ ముందు కూర్చుని సరసాలాడుకుంటూ ఏదో హిందీ సినిమా చూస్తున్నారు.
    
    కాంచన లేచి టేబుల్ మీదున్న మాత్ర అందుకోవాలని విఫల ప్రయత్నం చేస్తోంది. ఆమెకి లేచే శక్తిలేదు. గుండెల్లో పలుగుపెట్టి పొడుస్తున్నంత నొప్పిగా వుంది. ముఖం నీలంగా మారిపోతోంది. ఉచ్చ్వాస నిశ్వాసాలు కష్టంగా మారాయి. నాలుక దాహంతో పిడచకట్టుకుపోతోంది. పెదవులు కదులుతున్నాయి కానీ శబ్దం బయటికి రావడంలేదు.
    
    "సంధ్యా" అని పిలవడానికి ఆమె శక్తిని కూడగట్టుకుంటూ వుండగా గుమ్మంలో అలికిడైంది.
    
    మూసుకుపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరుస్తూ ఆమె ఆ దెస చూసింది.
    
    లీలగా సంధ్య ఆకారం కనిపించింది.
    
    ఆమె ఆనందంగా, ఆశగా "సంధ్యా" అని పిలవబోయింది. ఆ ఆకారం ముందుకి కదలలేదు.
    
    మంచినీళ్ళు కావాలంటూ కాంచన సైగ చేసింది.
    
    ఆ ఆకారం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
    
    కాంచన బాధ ఎక్కువైంది. ఆమె నొప్పి ఓర్చుకోలేక మెలికలు తిరుగుతూ అటువైపు కళ్ళెత్తి చూడడానికి ప్రయత్నించింది.
    
    ఆకుపచ్చ ఓణీలో అక్కడ నిలబడింది సంధ్య కాదు, చాయ!
    
    కాంచన మరణవేదనను ఏదో తమాషా చూస్తున్నట్లుగా చూస్తూ నిలబడివుంది.
    
    "దాహం.....దాహం" కాంచన ఆశగా సైగచేస్తూ అడిగింది.
    
    చాయలో కదలిక లేదు.
    
    కాంచన కళ్ళల్లో భయం తారట్లాడింది.
    
    ఆమె భయం మృత్యువు తనను కబళించివేస్తోందని కాదు, ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించాల్సిన మానవత్వం కనిపించనందుకు.
    
    ఓ నిండుప్రాణం కళ్ళముందే పోతూ వుంటే కనీసం స్పందనైనా లేకుండా మరమనిషిలా చూస్తూ నిలబడ్డందుకు.
    
    కాంచనకి జూలీ మరణం గుర్తొచ్చింది. ఆమె కళ్ళల్లో ప్రశ్నకి చాయ పెదవులమీద పొడచూపిన వంకరనవ్వు సమాధానం చెపుతున్నట్లనిపించింది.
    
    "ఆ అమ్మాయి పాలల్లో ఏదో కలిపిందని నా అనుమానం" అని రత్నం, రామయ్యతో గుసగుసలాడటం గుర్తొచ్చింది.
    
    సంధ్య లాకెట్ దొంగతనం రత్నంమీద వేయడానికి....ఆపైన ఆలోచించే శక్తి కాంచనకి లేదు. "అమ్మా" అనరిచింది.
    
    "నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో? డాక్టర్ కి ఫోన్ చేయకుండా కనీసం మందు అందివ్వకుండా వుండడానికి దీని మనసెలా వప్పిందో అని కదూ" చాయ పకపకా నవ్వింది. "నాకు అసలు మనసేలేదు. మీరు కళ్ళు లేనివాళ్ళనీ.....కాళ్ళు లేనివాళ్ళని, చేతులు లేనివాళ్ళనీ చూసి వుంటారు, కానీ మనసు లేనివాళ్ళని చూసి వుండరు. ఇప్పుడు చూడండి. నాకు మనసులేదు. మనసే కాదు, జాలీ, దయా, బాధ కూడా లేవు. ఎందుకుండాలి? పుట్టగానే పసిగుడ్డు అని లేకుండా చెత్తకుండీలో కుక్కలకి ఆహారంగా వేసిన నా తల్లికి లేని మనసు నాకు ఎక్కడ్నుంచి వస్తుంది? అమ్మ వారి జ్వరంతో వళ్ళు తెలీకుండా పడివున్న నన్ను ధర్మాసుపత్రికి తీసుకెళితే ఎవరూ చూడకుండా నన్ను రేప్ చేయబోయిన వార్డ్ బోయ్ కి లేని దయా నాకెందుకు?