మరుసటిరోజు ఉదయమే ఖలీల్ సైన్ బసంత్ కోర్టు దగ్గర కారు దిగి మెట్లెక్కుతుండగా, ఓ వ్యక్తి భుజానికి పెద్ద బ్యాగ్ ని తగిలించుకొని క్రిందకు దిగుతూ కనిపించాడు. మామూలుగా అయితే ఆ వ్యక్తి ఎవరన్న అనుమానం ఖలీల్ కి వచ్చేదికాదు. జోహ్రా ఉంటున్న ఫోర్త్ ఫ్లోర్ నుంచి వస్తూ ఆ వ్యక్తి ఎదురు పడ్డాడు.
    
    ఖలీల్ ఇ-6 అపార్టుమెంట్ ముందు నించుని కాలింగ్ బెల్ నొక్కాడు.
    
    దాదాపు నిమిషం వెయిట్ చేసినా తలుపు తెరుచుకోకపోయేసరికి జోహ్రా లేడని నిర్దారించుకొని బయటకు వచ్చేసాడు ఖలీల్.
    
    తను ఎదురుపడ్డా, ఖలీల్ గుర్తించలేనంతగా మేకప్ చేసుకున్న జోహ్రా ఖలీల్ క్రిందకు వచ్చేసరికే టాక్సీ ఎక్కి విక్రోలి అన్నాడు.
    
    అరగంట ప్రయాణించాక ఆటో లార్సెన్ అండ్ టూబ్రో ఫ్యాక్టరీ ముందు ఆగింది. జోహ్రా గేట్ మేన్ దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడి అతని చేతిలో ఐదు వందలుంచాడు.
    
    గేట్ మెన్ స్వయంగా జోహ్రాని లోపలకు తీసుకెళ్ళి లిఫ్ట్ ఎక్కించాడు.
    
    క్షణాల్లో లిఫ్ట్ ఆరవ అంతస్థుకి చేరుకుంది.
    
    జోహ్రా బ్యాగ్ ని సర్దుకుంటూ ఆ ఫోర్లోనుంచి మెట్లమీదుగా టెర్రస్ మీదకి చేరుకున్నాడు.
    
    చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరని నిర్ధరణ చేసుకోగానే ముందు తన భుజానికున్న బ్యాగ్ లోంచి బైనాక్యులర్ బయటకు తీశాడు. దూరంగా విక్రోలి కొండపై మాస్టర్ బంగ్లా కనిపిస్తోంది. బైనాక్యులర్ ని కళ్ళు ముందుకు తెచ్చుకుని మాస్టర్ బంగ్లాని క్షుణ్ణంగా పరిశీలించాడు.
    
    వైట్ హౌస్ రేంజ్ సెక్యూరిటీ?
    
    షాట్ గన్స్ తో పెట్రోలింగ్ చేస్తున్న సెక్యూరిటీ గార్డ్సు! గోడలపై ఎలక్ట్రిక్ వైర్ ఫెన్సింగ్! అసాధ్యం... మాస్టర్ ని అతని బంగ్లా ముందు చంపటం చాలాకష్టం. అని మనస్సులో అనుకుంటూ కెమెరాని బయటకు తీసి దానికి టెలీస్కోపిక్ లెన్స్ అమర్చి వీలైనన్ని ఫోటోలు, వివిధ కోణాల్లో తీసుకొని తిరిగి బయలుదేరాడు జోహ్రా.
    
                                                 *    *    *    *    *
    
    నలుగురూ తాజ్ ఇంటర్ కాంటినెంటల్ సూట్ లో కూర్చుని టీకి ఆర్డర్ ఇచ్చారు.
    
    అప్పుడు సమయం సాయంత్రం ఆరున్నర గంటలు.
    
    "నాకు భయంగానూ, కంగారుగానూ ఉంది. అసలు ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగిందా....?" ప్రణవ సిగరెట్టు వెలిగిస్తూ అన్నాడు. మిల్లర్ ని తలుచుకుంటుంటే అతనికి ఒళ్ళంతా చల్లబడి పోతోంది.
    
    "నెపోలియన్ అచ్చం తనలా ఉన్న ఒక వ్యక్తిని చేరదీసి, తనలా తయారుచేసి రాజకీయ డ్రామా ఆడేవాడు. అతని పేరు రోబెయిడ్ (EUGENE ROBEAUD) రెండవ ప్రపంచ యుద్దంలో బ్రిటీష్ మిలటరీ జనరల్ సర్ బెర్నాడ్ మాంటెగ్ మరీ తనలాగే ఉన్న క్లిష్టన్ జేమ్స్ అనే వ్యక్తికి తనకు డబుల్ గా వాడుకున్నాడు. అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్ వెల్డ్ కూడా తనలాగే ఉన్న వయతిని వెతికి పట్టుకొని తనకి డబుల్ గా వాడుకున్నాడు యూనో-హిట్లర్ కి నలుగురు డబుల్స్ ఉండేవారట. హిట్లర్ చనిపోవటానికి ముందునుంచి ఉన్మాదిగా ప్రవర్తించేవాడు- అయినా ఇంతలా కాదని కొందరు బాగా అనుమానించారు. హిట్లర్ వెనుకదాగిన మిస్టరీ ఇప్పటికీ విడివడలేదు.
    
    హిట్లర్ రెండు సంవత్సరాల క్రితమే చనిపోయాడని, అది శత్రు వర్గానికి తెలిస్తే తాము అన్ని రకాల బలహీన పడతామని, శత్రువులు ఆత్మ స్థయిర్యాన్ని పెంచుకుంటారని, హిట్లర్ కి ఆప్తులైన మిలటరీ జనరల్స్ ఒరిజనల్ హిట్లర్ చావుని దాచి, ఫేక్ హిట్లర్ నే అసలు హిట్లర్ గా భ్రమింపజేసారని ఇప్పటికీ ఒక వదంతి ఉంది. అందుకే హిట్లర్ చనిపోవటానికి ముందు రెండు సంవత్సరాలు అతని ప్రవర్తనలో హద్దులు మీరిన అసహనం, ఉన్మాదం, సైకిక్ బిహేవియర్ స్పష్టంగా కనిపించాయని ఆ వాదనని బలహీనపర్చేవారు అంటుంటారు.
    
    బ్రిటన్ నుంచి వచ్చే 'టిట్ బిట్స్' అనే వారపత్రికలో ఒక ఆర్టికల్ ప్రచురించబడింది" అంటూ బ్రహ్మ మహేశ్వర్ కేసి చూశాడు.
    
    అతను బ్రీఫ్ లోంచి ఆ పత్రికను తీసి బ్రహ్మకు అందించాడు.
    
    బ్రహ్మ ఒకేలా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఫోటోలు ప్రచురించిన పేజీని తెరచి ప్రణవకి అందించాడు.
    
    ప్రణవ ఆశ్చర్యపోయి చూస్తుండగా బ్రహ్మ తిరిగి చెప్పటం ప్రారంభించాడు.
    
    "బ్రిటన్ టెలివిజన్ నెట్ వర్క్ లో 'పంచ్ లైన్స్' అనే ప్రోగ్రామ్ లో నటించే నలభై ఒక్క ఏళ్ళ హాస్యనటుడు లెన్నీ బెన్నెట్ లాగే ముఫ్ఫై రెండేళ్ళ పీట్ వాల్ వున్నాడు. ఆ ఇద్దరిలో నీకేమయినా తేడాలు కనిపిస్తున్నాయా?"
    
    "లేదు."
    
    "మరదే విచిత్రం....ఆ ఇద్దరి మధ్య రక్తసంబంధం లేదు. బంధుత్వమైనా లేదు. ఒక వంశానికి చెందిన వారు కూడా కాదు. హిందీలో ఒక సినిమా వచ్చింది. చాలాకాలం క్రితం అందులో అచ్చం అమితాబ్ లా, ధర్మేంద్రలా, రాజ్ కుమార్ లా, దేవానంద్ లా ఉన్న మనుష్యులతో ఒక సినిమా తీశారు. సడన్ గా చూస్తే వాళ్ళను నిజమనుకోవటం ఖాయం. అంతదాకా ఎందుకు....మీ తెలుగు గడ్డపై రికార్డింగ్ డాన్స్ లు చేసే ఫేక్ ఐడెంటిటీల విషయం ఏమిటి? ఒక మనిషిలా మరో మనిషి మాట్లాడటం మనిషి నేర్చుకునే విద్య దానికి ఉదాహరణ నేరెళ్ళ వేణుమాధవ్ జాలి లివర్. ఒక మనిషిలా మరో మనిషి బిహేవ్ చేయటం కూడా సాధన ద్వారా మనిషి సాధించే విజయం. రక్తసంబంధం లేకుండా ఒక మనిషిలో మరో మనిషి వుండటం ప్రకృతిపరంగా జరిగే అద్భుతం సో..... ఇలాంటి స్మఘతనాలు గతంలో చాలా జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. మనమే కొత్తగా చేస్తున్నామని నువ్వేం ఆందోళన చెందనక్కరలేదు. ముందు ధైర్యాన్ని ప్రోది చేసుకో" అన్నాడు బ్రహ్మ ఇంకా ఆ వారపత్రికలోకే చూస్తున్న ప్రణవకేసి చూస్తూ.
    
                                                          *    *    *    *    *
    
    కళ్ళలో ఎరుపుజీర...
    
    ఎత్తు ఐదడుగుల పదంగుళాలు...
    
    ఆరోగ్యంగా బలిష్టంగా ఉంటాడు...