"ఏమిటి నీ ఉద్దేశం శేషుబాబు?" అని వేదిత వెనక్కి జరుగుతోంది.

 

    "ఉద్దేశమా? నిన్ను యింత శ్రమపడి ఇక్కడకు తీసుకువచ్చింది ఉద్ధేశ్యాలు వ్యక్తీకరించటాని కనుకున్నావా వేదితా? ఆచరణలో పెట్టటానికి. నే నిప్పుడు జంతువును. నా వళ్ళంతా సెగలు చిమ్ముతోంది. ఈ రాత్రి నాది. నువ్వు నాదానివి. అలా వెనక్కి వెనక్కి పోకు నువ్వు. ఎంత దూరం పోయినా నిన్ను వెంటాడి వెంటాడి నాదాన్ని చేసుకుంటాను."

 

    అతను ఒక్క ఉదుటున ముందుకు దూకి ఆమెను రెండు చేతుల్తో పొదివి పట్టుకున్నాడు. గాఢంగా తన హృదయానికి అదుముకోబోయాడు. ఆ సమయంలో అతనికి అర్థంకాని, ఊహకందని నిశ్చలత్వంతో ఆమె పెట్టిన కేక అతని శ్రవణ కుహరాల్లోకి దూరి, తృళ్ళిపడి ఆమె వంక చూశాడు. కళ్ళు మూసుకుని, అతని చేతులతో అచేతనంగా నిలబడి ఉంది ఆమె. ఆమె ఏమని కేకవేసింది? ఎవర్ని పిలిచింది? అతని కర్థముకాలేదు. అతని చేతిక్రింద ఆమె స్పర్శ విచిత్రంగా తోచింది. ఆ స్పర్శకు అతను నిర్వచనం చెప్పుకోలేకపోయాడు. ఆ సమయంలో అలా నిశ్చలంగా, ప్రతిమలా నిలబడి ఉన్న ఆమెను చూస్తే అతనికి ఒక రకమైన భయం కలిగింది. కాని అది క్షణంసేపే. ఆమె ముఖంలో ముఖం పెట్టి చూశాడు. అతని అహంభావం, అభిజాత్యం మళ్ళీ తలయెత్తి ముందుకు సాగమని ప్రోత్సహించాయి. కోరిక వేయి పడగలు విప్పుకుని బుసలుకొట్టింది. తిరిగి తన రెండు చేతులూ ఆమె చుట్టూ బిగించి తన వైపు అదుముకోబోయాడు.

 

    గుండెలో ఏదో కళుక్కుమంది. కళ్లు చీకట్లు క్రమ్మినట్టయింది. భరింపలేని నొప్పి.... గుండెలో. 'అబ్బా!' అని ఛాతీమీద చెయ్యివేసుకుని నొక్కుకుంటూ వెనక్కి తూలి మంచంమీద పడిపోయాడు. వళ్ళంతా చెమటలు క్రమ్మివేసి సంతతధారగా ప్రవహిస్తున్నాయి.  

 

    వేదిత కళ్ళు తెరిచేసరికి మంచంమీద గుండె చేత్తో పట్టుకుని 'అబ్బా, అమ్మా!, అని మూలుగుతూ పొర్లుతున్నాడు. వెంటనే ఏదో అజ్ఞాతశక్తి నడిపించినట్లు గిరుక్కున వెనక్కి తిరిగి పాకలోంచి బయటకు వచ్చి చీకట్లో ఏరుదాటి దేవాలయానికి అభిముఖంగా పోసాగింది.

 

    అయిదు నిమిషాలు గడిచేటప్పటికి శాయి కొంచం తేరుకున్నాడు. రెండు మూడు క్షణాలు అతనికేం జరిగిందీ బోధపడలేదు. తర్వాత అంతా జ్ఞప్తికి వచ్చినట్లయింది. తనకింత గుండెలో పోటు ఎలా వచ్చింది? భరించలేని పోటుతో తను గింగరాలు తిరిగిపోయాడు. దేవాలయంలో వెనక వేదితను తన కౌగిలిలోని తీసుకున్నప్పుడు యిదే విధమైన పోటు వచ్చింది. కాని అప్పుడింత ఉధృతంగా రాలేదు. అసలా నొప్పిగురించి తాను ఆలోచించలేదు.

 

    వేదిత ఏమయింది? వెళ్లిపోయిందా? వీల్లేదు. ఆమె వెళ్ళిపోవటానికి వీల్లేదు. అని ఆతృతపడుతూ ఒక్క ఉదుటున లేచి నిల్చున్నాడు కంగారుగా ముందుకు పరిగెత్తాడు. అలా పరిగెత్తటంలో ముక్కాలి పీటకు అతని కాలు విసురుగా తగిలి, అది అవతలకు జరిగి దాని మీద నున్న దీపం క్రిందపడింది. ఆ పడటం పడటం సరిగా పాక అంచుకుపడి భగ్గుమని నిప్పంటుకుంది. వేసవి ఎండలకు పగలంతా కాలి కాలి ఉన్న తాటాకులు, చూస్తుండగానే మంటలు పెద్దవై, ఉవ్వెత్తుగా లేచి, నలువైపులకు ప్రాకాయి. ఈ హఠాత్ పరిణామానికి విభ్రాతుడై ఏం చేయాలో కూడా తోచక నిలబడిపోయాడు శాయి. అతనికి మతిభ్రమించినట్లయింది. కళ్ళప్పగించి చూస్తున్నాడు. పైకి ఎగసే మంటలు అతని మీదకు దూకు తున్నాయి. ఆ సమయంలో అతనికి బయటకు పరిగెత్తాలని కూడా తెలియలేదు. విగ్రహంలా అలాగే నిలబడ్డాడు.

 

    ఇంతలో ప్రక్కన ఏదో అలికిడై ఒక బలమైన చెయ్యి అతని జబ్బ పుచ్చుకుని విసురుగా బయటకు లాగేస్తోంది. అతనికి అప్పటికీ తెలియలేదు. అతన్నెవరో బయటకు యీడ్చుకుపోతున్నాడు. కాసేపటికి అతను తెప్పరిల్లి చూసేసరికి ఆ మంటల వెలుగులో తనకెదురుగా గంగరాజు నిలుచుని ఉన్నాడు. తనని దుర్మరణంనుండి గంగరాజు రక్షించాడు. "గంగరాజూ! నువ్వు-" అని పిలిచాడు శాయి. ఏదో చెప్పబోతూ మాటమధ్యలోనే ఆపి అవాక్కయి నిలబడి పోయాడు. గంగరాజు ముఖం నల్లగా మసి బూసినట్లు అయిపోయి వుంది. అతని నోట్లోంచి నురుగువస్తోంది. "దొరా!" అని ఏదో బాధగా చెప్పబోయి గభాలున క్రిందపడి బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు.  

 

    "గంగరాజు!" అని అరుస్తూ శాయి ముందుకు పరుగెత్తి అతని ప్రక్కన కూర్చున్నాడు. "ఏం జరిగింది నీకు? ఎందుకిట్లా అయిపోయావు?" అని ఆతృతగా అడుగుతూ అతని ముఖంలోకి వొంగాడు.

 

    గంగరాజు చప్పున ముఖం ప్రక్కకి త్రిప్పుకుని భళ్ళుమని ఇంత రక్తం కక్కుకున్నాడు. చెలరేగే జ్వాలల వెలుగులో నల్లటి ముఖంతో ఎర్రటి రక్తం కక్కుకూంటున్న గంగరాజును చూసి శాయికి కళ్ళు తిరిగిపోయాయి. అతని గొంతు తడారిపోయింది.

 

    గంగరాజు నీళ్ళు కారుతూన్న కళ్ళతో దీనంగా శాయి ముఖం కేసి చూశాడు. అతని ముఖంలో జీవకళ నశించిపోతోంది. మృత్యుఛాయలు ఆవరిస్తున్నాయి.

 

    అతి కష్టంమీద గొంతు స్వాధీనం చేసుకుని అన్నాడు. "దొరా!..... నా పాపానికి... ప్రాయశ్చిత్తం...! నన్ను రక్తపింజరిపాము కాటేసింది. ఈ విషానికి ... తిరుగులేదు... మిమ్మల్ని రక్షించు...కున్నాను... దొరా... మంచిగా... బతకండి..."

 

    అతని కళ్ళలోంచి ఎడతెగకుండా కన్నీళ్లు కారుతున్నాయి. మూసుకుపోతూన్న కళ్ళను అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ శాయి ముఖంకేసి చూస్తూన్నాడు. ముఖం... నల్లగా మరింత నల్లగా అయిపోతోంది. బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. కళ్ళు మూతలు పడుతున్నాయి. మూతలు పడిపోయాయి.

 

    గాలికి మంటలు ఉవ్వెత్తుగా రేగుతున్నాయి.

 

    గంగరాజులోని గాలి ఆ గాలిలో కలిసిపోయింది. అతన్లోని మంట ఆరిపోయింది.

 

    "గంగరాజూ!" అన్నాడు శాయి డగ్గుత్తికతో. అతని చెంపల మీదగా నీళ్ళు జాలువారుతున్నాయి.

 

                                                 * * *