ప్రపంచంలో ఎన్నెన్నో దేశాలున్నాయి. తమ దేశం అంటే ఆయా దేశాల వారికి సహజంగానే భక్తి వుంటుంది. మరి భారతీయుల దేశభక్తిలోని ప్రత్యేకతేంటి? మన ప్రత్యేకత భరతమాత! అవును, భారతదేశం అన్ని దేశాల్లాంటి దేశమే. కాని, భరత మాత మాత్రం అలా కాదు. భరతమాత లాగా పాకిస్తాన్ మాత, బంగ్లాదేశ్ మాత, అమెరికా మాత, చైనా మాత అంటూ మనం ఎప్పుడూ ఎక్కడా వినం. కేవలం భరతమాత మాత్రమే ప్రపంచంలో రూపు దాల్చి సమున్నతంగా, సగర్వంగా నిల్చుంటుంది! ఇది నిజంగా సలక్షణమైన విశేషమే...

భరతమాత ఆవిర్భావం స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనే జరిగింది. ముఖ్యంగా, దుర్గా దేవిని భక్తిగా ఆరాధించే బెంగాల్ లో మొదలైంది. ఆసేతు హిమాచలం వ్యాపించిన భరత భూమిని కేవలం ఒక ప్రాంతంలా కాకుండా ఒకానొక శక్తిగా, కారుణ్యం స్రవించే స్త్రీ మూర్తిగా, మాతృ మూర్తిగా దర్శించటం బెంగాలీ కవులు, రచయితలు, కళకారులు, స్వతంత్ర సమరయోధులు ప్రారంభించారు. వందేమాతర గీతం అప్పట్లో బెంగాల్లీలో మార్మోగిపోయింది. తల్లి వందనం అన్న ఆ గీతమే భరతమాత రూపకల్పనకి ప్రేరణనిచ్చింది. అలా మెల్లమెల్లగా వందేమాతరం గీతంలో కీర్తించిన అమ్మనే భరతమాతగా కవులు వర్ణిస్తూ వచ్చారు. పెయింటర్లు బొమ్మలు గీస్తూ వచ్చారు.

తొలినాటి భరతమాత రూపాన్ని ఎంతో లోతైన ఆధ్యాత్మిక భావాలతో దర్శించారు ఆనాటి వారు. కాషాయ రంగు చీరలో అమ్మ నాలుగు చేతులతో వెలిగిపోతున్నట్టు ధ్యానించారు. ఆ నాలుగు చేతుల్లో జపమాల, వరి మొక్కలు, తాళ పత్ర గ్రంథాలు, తెల్లటి వస్త్రం పట్టుకుని వుండేది భరతమాత. వీటి అర్థం శిక్ష, దీక్ష, అన్నం, వస్త్రం అని. ఈ నాలుగు ప్రధానమైన జీవిత అవసరాలు తీర్చేది కాబట్టే భరత భూమి మనకు భరతమాత అయింది! తరువాతి కాలంలో భరతమాత వాహనంగా సింహం చేర్చారు. కొన్ని చోట్ల నాలుగు చేతుల బదులు రెండు మాత్రమే వుంచి త్రివర్ణ పతాకాన్ని జత చేశారు.

ప్రస్తుతం దేశంలోని నాలుగు చోట్ల ప్రసిద్ధ భరతమాత విగ్రహాలున్నాయి. మహా పవిత్ర క్షేత్రం వారణాసిలో మహాత్మ గాంధీ చేత ప్రారంభోత్సవం జరుపుకున్న భరతమాత ఆలయం వుంది. అలాగే, హరిద్వార్ లో ఇందిరా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన భరతమాత ఆలయం వుంది. కోల్ కతాలో 2015లో ఒక భరతమాత ఆలయం ప్రారంభింపబడింది. ఈ మూడు ఆలయాలే కాక కన్యాకుమారిలో కూడా ప్రసిద్ధమైన భరతమాత విగ్రహం దర్శనమిస్తుంది!

మొత్తం ప్రపంచలోనే స్త్రీని దేవతగా ఆరాధించే సంప్రదాయం ఒక్క భారతదేశంలోనే మిగిలి వుంది. ఇక దేశాన్ని కూడా తల్లిగా, దేవతగా పూజించే సంస్కృతి అయితే ఎక్కడా కనిపించదు. ఇది భారతీయ సమాజంలో స్త్రీ స్థానాన్ని చెప్పకనే చెబుతుంది...