'బుట్ట'లో పడాల్సిందే!

 

 

* కొత్తొక వింత పాతొక రోత అంటుంటారు. ఈ సామెతని మార్చే టైమొచ్చింది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రపంచం ఈ మాటని కొట్టి పారేస్తోంది. ఎందుకంటే అక్కడ పాత కొత్తని డామినేట్ చేస్తోంది. 

 

 

* ఎప్పుడో ఫాలో అయ్యి, తర్వాత ఔట్ డేటెడ్ అయిపోయిన ఎన్నో స్టైల్స్ మళ్లీ కొత్తగా మార్కెట్లోకి వచ్చి కూర్చుంటున్నాయి. కళ్లు చెదరగొట్టేస్తున్నాయి. మతులు పోగొట్టేస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో బుట్ట చేతులు ఒకటి. మనకి ఇవి బుట్ట చేతులు. కానీ ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం కాస్త స్టయిల్ గా పఫ్డ్ స్లీవ్స్ అని పలకాలి.

 

 

* ఒకప్పుడు చిన్నపిల్లల గౌన్లంటే బుట్ట చేతులు ఉండాల్సిందే. అలాగే పరికిణీల మీదకి కుట్టే జాకెట్లకి కూడా బుట్ట చేతులు పెట్టేవారు. ఆ తర్వాత మెల్లగా బుట్ట చేతులు బై బై చెప్పేశాయి. త్రీ ఫోర్త్, ఫుల్ స్లీవ్స్ వచ్చేశాయి. 

 

 

* అవి ప్లెయిన్ గా ఉండేవే తప్ప ఎక్కడా బుట్ట కనిపించేది కాదు. అయితే ఎప్పుడో బుట్టలో పెట్టేసిన ఆ ఫ్యాషన్ ఇప్పుడు మళ్లీ మొదలైంది. అయితే ఈసారి పిల్లల గౌన్లకీ, పరికిణీ జాకెట్లకే కాదు... జీన్స్ మీద వేసే షర్టులకి కూడా బుట్టలు పెట్టడం మొదలైంది.

* లాంగ్ ఫ్రాక్...  టీషర్ట్స్.. ఫార్మల్ షర్ట్.. శారీ బ్లౌజ్... ఒక్కటి కాదు, దేనికి బుట్ట చేతులు పెట్టినా దాని అందమే వేరు అన్నట్టుగా ఉందిప్పుడు. చూస్తున్నారు కదా ఫొటోలు! మరి మీరు కూడా బుట్ట చేతులు పెట్టించండి. బుట్టబొమ్మలా తయారై అందర్నీ బుట్టలో పడేయండి!

-Sameera