నిర్భయ పాత్రగా కామిక్‌ పుస్తకం

 

2012 డిసెంబరు 16. ఆ రోజు దిల్లీలో జరిగిన ఘాతుకం, ప్రపంచం ముందు మన దేశం తలదించుకునేలా చేసింది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే’ అని శ్లోకాలలో చెప్పిన నీతిసూక్తులు, స్త్రీల శోకాన్ని నివారించలేకపోయాయని తేల్చిపడేసింది. ఆనాడు నిర్భయ అనే మహిళ మీద సామూహిక అత్యాచారం, హత్య జరిగిన తీరుతో భారతీయ సమాజం ఉలిక్కిపడింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న యువత ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చింది. ఫలితం! స్త్రీల మీద ముఖ్యంగా భారతీయ స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాల గురించిన చర్చ మొదలైంది. ఎలాగైనా సరే వీటిని అడ్డుకోవాలనీ, ఇలాంటి సంఘటనలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలనే స్వరాలు పెరిగాయి.

 

నిర్భయ ఉదంతం ‘రామ్‌ దేవినేని’ అనే చిత్ర నిర్మాతని కూడా కదిలించింది. నిర్భయకాండకు వ్యతిరేకంగా జరిగిన ఒక ప్రదర్శనలో రామ్‌ మిత్రుడు ఒకరు పాల్గొన్నారు. ఆ మిత్రుడు అక్కడ ఉన్న ఓ పోలీసుని- ‘నిర్భయ ఉదంతం మీద మీ అభిప్రాయం ఏంటి?’ అని అడిగాడు. దానికి ఆ పోలీసు చాలామందిలాగే- అంత రాత్రివేళ తిరగడం ఎందుకు? అన్నట్లుగా మాట్లాడాడు. నిర్భయ వంటి ఉదంతాల పట్ల సమాజం చూపించే ఇలాంటి ధోరణిలో మార్పు తీసుకురావాలనుకున్నాడు రామ్‌. ఆడవారు బయట తిరగడం, ఆధునిక దుస్తులు ధరించడం... ఆఖరికి నవ్వడం కూడా వారిని అత్యాచారం చేసేందుకు కవ్విస్తున్నాయి అని భావించే అహంకారమే అసలు నేరం అని రామ్‌కు తోచింది.

 

తన మనసులోని అవేశానికి ఒక రూపాన్నిచ్చే ముందు రామ్‌, చాలామంది అత్యాచార బాధితులను కలిశాడు. అత్యాచారానికి గురైన తరువాత వారి జీవితాలు మరింత దుర్భరంగా మారిపోతున్నాయని గ్రహించాడు. అత్యాచార బాధితులు న్యాయం సాధించాలంటే ఒక యుద్ధమే సాగించాలి. ఆ యుద్ధంలో ఎవ్వరూ తోడురారు సరికదా, కుటుంబం కూడా వారిని వెలివేసేందుకే సిద్ధపడుతుంది. ఈ పరిస్థితిని ప్రతిబించేందుకు రామ్ ఒక కామిక్‌ పాత్రను సృష్టించాలనుకున్నాడు. ‘డాన్‌ గోల్డ్‌మన్‌’ అనే చిత్రకారునితో కలిసి ప్రియ అనే పాత్రను సృష్టించాడు. ఈమె కూడా నిర్భయలాగానే సామూహిక అత్యాచారానికి గురవుతుంది. ఆ తరువాత నలువైపుల నుంచీ తనే నిందలు పడటంతో పార్వతీదేవిని ధ్యానిస్తుంది. పార్వతీదేవిలోని శక్తి ప్రియని ఆవహించడంతో దుష్టలను ఎదుర్కోగలుగుతుంది. తనకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా వెల్లడించగలుగుతుంది. ప్రజల్లోని అజ్ఞానాన్ని రూపుమాపేందుకు పోరాడి జయిస్తుంది.

 

రెండు సంవత్సరాల క్రితం ‘Priya’s Shakti’ పేరుతో వచ్చిన ఈ కామిక్‌ సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాంకు, ఫోర్డ్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థలు సైతం ఈ ప్రాజెక్టుకి సాయం చేసేందుకు ముందుకువచ్చాయి. పలు అంతర్జాతీయ అవార్డులూ లభించాయి. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన విజేత అంటూ ఐక్యరాజ్యసమితి కితాబునిచ్చింది. లక్షలాదిమంది ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ పుస్తకం ఆధారంగా రూపొందిన యాప్‌ సైతం ప్రజాదరణ పొందింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు రామ్‌ బృందం 'Priya's Mirror’ అనే మరో కామిక్‌ పుస్తకాన్ని రూపొందించింది. ఇందులో అహంకారం అనే రాక్షసుని చెరలోంచి యాసిడ్‌ బాధితులను కాపాడే శక్తిగా ప్రియ కనిపిస్తుంది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 6 వరకు జరిగే న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు.

 

ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మందికి పైగా స్త్రీలు ఏదో ఒకరకమైన హింసను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెబుతోంది. సిగ్గుచేతనో, భయం వల్లనో... చాలామంది తాము ఎదుర్కొన్న దౌర్జన్యాన్ని తమలోనే దాచుకుని కుమిలిపోతుంటారు. నిత్యం నరకాన్ని అనుభవిస్తుంటారు. ఇలాంటి Gender-based sexual violence (GBV)ని ఎదుర్కొనేందుకు రామ్ రూపొందించిన ప్రియ పాత్ర ఎంతోకొంత ప్రేరణని అందిస్తుందని ఆశిద్దాం.

(ప్రియ పాత్రగా వచ్చిన రెండు పుస్తకాలను చదివేందుకు, ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేందుకు www.priyashakti.com ని చూడగలరు)

- నిర్జర.