400 కుక్కలకు ఆసరాగా... ఓ పేదరాలు!

 


ఆమె తన జీవితంలో అనేక కష్టాలని ఎదుర్కొంది. కాచుకుని ఉండాల్సిన అత్తవారింట కఠినత్వాన్ని చవిచూసింది. చివరికి ఆ బాధలు భరించలేక ఇంటి నుంచి పారిపోయి నానా అగచాట్లూ పడింది. ప్రస్తుతానికి చెత్త ఏరుకుంటూ జీవనోపాధిని సాగిస్తోంది. మనిషి మనసులో ఇంతటి చీకటిని, జీవితంలో అంతటి అగాధాలనీ చూసి తరువాత ఆమెకు మనుషులంటేనే విరక్తి పుట్టిందేమో... వందలాది కుక్కలకు ఆసరాగా నిలుస్తూ, వాటిలో ప్రేమని వెతుక్కుంటోంది. ఆమే- ప్రతిమాదేవి!

 

ఆది నుంచీ కష్టాలే

ప్రతిమాదేవిది పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్‌ చెందిన ఓ పేద కుటుంబం. ఇంటికి భారంగా ఉందనో ఏమో, ప్రతిమకు ఏడేళ్ల వయసులోనే పెళ్లిచేసిపారేశారు. ప్రతిమ తన అత్తవారింట నానా అగచాట్లూ పడింది. భర్త పచ్చి తాగుబోతు. రోజూ తాగడం, తాగాక తన ప్రతాపాన్నంతా భార్య మీద చూపించడం... ఇదే అతని దినచర్య! ప్రతిమకు 14 ఏళ్లు వచ్చేసరికి ఓ బిడ్డ కూడా పుట్టాడు. అయినా భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో... ఇక అతని నుంచి విడిపోయి నాలుగిళ్లలో పాచిపని చేసుకోవడం మొదలుపెట్టింది.

 

 

దిల్లీకి ప్రయాణం

ప్రతిమ పెద్దకొడుకు పని వెతుక్కుంటూ దిల్లీ చేరుకోవడంతో, ప్రతిమ కూడా మిగిలిన ఇద్దరు కొడుకులతో కలిసి దిల్లీ చేరుకుంది. ప్రస్తుతం తెలుగులో కూడా పెద్ద విలన్‌గా చెలామణీ అవుతున్న రాహుల్‌ దేవ్‌ ఇంట్లో పనిమనిషిగా కుదురుకుంది. ఆ తరువాత దక్షిణ దిల్లీలోని సాకేత్ అనే నివాసప్రాంతంలో ఓ టీకొట్టుని నడపసాగింది. ఆ టీకొట్టు పక్కనే తన నివాసాన్నీ ఏర్పరుచుకొంది. ఆ సమయంలోనే కుక్కలను దగ్గరకు తీసే అలవాటు మొదలైంది.

 

తగలబెట్టేశారు

ఊరకుక్కల పట్ల ప్రతిమ చూపే కరుణ సహజంగానే చుట్టుపక్కలవారికి కంటగింపుగా మారింది. దగ్గరలో ఉండే ఒక షాపు యజమాని ఆమె టీకొట్టునీ, ఇంటినీ తగలబెట్టించాడు. ఆ మంటలకి ప్రతిమ తీవ్రంగా గాయపడింది కూడా. అయినా కుక్కలని చేరదీయడం మానలేదు. చెత్తాచెదారం ఏరుకోగా వచ్చిన డబ్బుతో ఆమె వందలాది కుక్కలకు రోజూ ఆహారం పెడుతూ ఉంటుంది. పది లీటర్ల పాలు, 12 కిలోల బియ్యం, ఐదు కిలోల మాంసం... ఇలా ప్రతిమాదేవి పెట్టే ఆహారంతో సాకేత్ చుట్టుపక్కల ఉండే దాదాపు 400 కుక్కల ఆకలి తీరుతుంటుంది. వాటిలో ఓ 200 కుక్కలైతే నిరంతరం ప్రతిమాదేవి ఇంటి దగ్గరే ఉంటాయి. వాటన్నింటికీ రేబిస్‌ టీకాలు వేయించడంతో, వాటి వల్ల ఇతరులకు ఏమాత్రం ప్రమాదం లేదంటారు ప్రతిమ.

 

 

కొడుకులను సైతం కాదని

ప్రతిమాదేవి ఆ మధ్య ఓ ఇంటిని తీసుకున్నారు. అయితే కుక్కలతో సహా ఆ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేందుకు కొడుకులు ఒప్పుకోలేదు. ‘నేను లేకపోతే ఈ కుక్కలను ఎవరు చూసుకుంటారు?’ అన్నది ప్రతిమ అనుమానం. అందుకనే కొత్త ఇంటిని పిల్లలకే వదిలిపెట్టేసి, తన పాత రేకులషెడ్డులోనే జీవనాన్ని సాగిస్తున్నారు. కుక్కల పట్ల ఆమెకు ఉన్న అనురక్తిని గమనించిన జనం కూడా ప్రతిమకు చేతనైనంత సాయం చేయడం మొదలుపెట్టారు. ప్రతిమలోని కరుణ పట్ల సమాజానికి నమ్మకం కుదిరినట్లే ఉంది. కానీ సమాజం పట్ల ప్రతిమ కోల్పోయిన విశ్వాసం మళ్లీ పాదుకుంటుందా! అన్నదే ప్రశ్న. అప్పటి వరకూ ఆమెకు కుక్కలు చూపే విశ్వాసంలోనే సాంత్వన లభిస్తుందేమో!

 

- నిర్జర.