"చాయ చురుగ్గా చూస్తూ అంది- "నా పేరూ, ఎడ్రెస్, మొత్తం బయోడేటా ఇస్తే కానీ పూజలు మీ భగవంతుడికి చేరవా? సర్వాంతర్యామి, అన్నీ తెలుసు అంటారుగా! మళ్ళీ ఎందుకీ ప్రశ్నలు? అడిగారు కాబట్టి చెపుతున్నాను వినండి.....నాకు పేరు మాత్రమే వుంది. దాని ముందూ, వెనుకా ఏమీ లేవు. నాది ఏ వంశమో, ఏ గోత్రమో ఎవరికి పుట్టానో నాకు తెలీదు. ఆయనకి తెలిస్తే చెప్పమనండి" అని సంధ్యవైపు తిరిగి అంది.
    
                                         * * *
    
    "నిన్నూ డాడీని అడగకుండా ఈ నిర్ణయం తీసుకోవడం మిమ్మల్ని అగౌరవపరచడం కాదు.....మీరు నా నిర్ణయాన్ని హర్షిస్తారనే నమ్మకంతో" అంది సంధ్య.    
    
    కాంచన కూతురివైపు చిరునవ్వుతో చూసింది.
    
    "తప్పు చేశావా!" సంధ్య గోముగా అడుగుతూ తల్లి దగ్గరికి వచ్చి భుజంమీద తల ఆన్చింది.
    
    "మంచి మనసు అనేది లోకంలో చాలా అరుదు. అటువంటి మంచి మనసు నీకిచ్చిన భగవంతుడు నీకు మేలే చేస్తాడని నా నమ్మకం తల్లీ" కూతురి తలని నిమురుతూ అంది కాంచన.
        
    "చాయ పాపం మంచిపిల్ల!" సంధ్య మాట పూర్తికాకుండానే క్రిందనుండి జూలీ అరుపు వినిపించింది.
    
    "తన కాళ్ళమీద తను నిలబడేవరకూ ఇక్కడే వుండనిద్దాం....ఏం?" అంది సంధ్య.
    
    "మనకు చాతనైన సాయం చెయ్యడం ధర్మమే! ఈ ఇంట్లో ఇంకో మనిషి బరువుకాదు. నీతోబాటే తనూ నాన్నగారు కూడా ఏమీ అనరనే అనుకుంటున్నాను" అంది కాంచన.
    
    "థాంక్యూ మమ్మీ!" సంధ్య కాంచన బుగ్గమీద ముద్దుపెట్టుకుని "త్వరగా ఈ శారీ కట్టుకో....డాడీ వచ్చేస్తారు" అని తొందర పెట్టింది.
    
    "సంధ్యా.....ఎందుకమ్మా?" కాంచన కొద్దిగా సిగ్గుగా అంది.
    
    "ఈరోజు చాలా స్పెషల్.....ప్రొద్దుట గుడికెళ్ళి మీ పేరుమీద అర్చన కూడా చేయించాను. ఏమ్మా....ఈరోజు నీ జీవితంలో మరపురాని రోజు అవునా కాదా?" నవ్వుతూ అడిగింది సంధ్య.
    
    "అవును! ఈరోజు నీకు అద్బుతమయిన జీవితాన్ని ప్రసాదించిన రోజు! మీ డాడీలాంటి భర్త, నీలాంటి కూతురూ, అదృష్టంకాక మరేమిటి?" సంధ్య చేతిలోంచి చీర ప్యాకెట్ అందుకుంటూ అంది కాంచన.
    
                                              * * *
    
    చాయకి ముచ్చెమటలు పోశాయి.
    
    "ఛీ....ఛీ....పో.....పో...." అని అదిలించింది.
    
    జూలీ ఇంకా వేగంగా ముందుకు పరుగెత్తుకువచ్చి చాయ కొంగు అందుకుంది. "హే.....హెల్ప్....హెల్ప్..." అని అరుస్తూ వుండగానే ఆమె ఓణి మొత్తం దాని నోటితో లాగేసింది జూలీ.
    
    చాయ గజగజా వణుకుతూ హాలు గుమ్మంవైపు పరిగెత్తింది.
    
    జూలీ కూడా మధ్యనున్న టీపాయ్ మీద నుంచి జంప్ చేసి మరీ ఆమె వెంటపడింది.
    
    స్పీడుగా పరిగెత్తుకుని బయటికి పోబోయిన చాయ ముఖానికి ఏదో అవరోధం ఎదురవడంతో ఠక్కున ఆగిపోయింది. ఆమెకి భయంవలన కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించాయి.
    
    "జూలీ.....స్టాప్! జూలీ.....ఈడియెట్.....వాట్ ఈజ్ దిస్?" జయచంద్ర అరుపునకు చాయ తెప్పరిల్లి కళ్ళు తెరిచింది.
    
    ఆమె అతని చేతుల్లో ఇమిడి వుంది. వెంటనే మళ్ళీ కళ్ళు మూసేసుకుంది.
    
                                             * * *
    
    జయచంద్ర కళ్ళు కోపంగా జూలీని చూస్తున్నాయి.
    
    జూలీ నెమ్మదిగా మొరవడం ఆపి తల వంచుకుంది.
    
    చాయ తన వంక చూసుకుంది. ఓణీ లేకుండా లంగా-బ్లౌజుతో అతని చేతుల్లో వాలిపోయి వుంది.
    
    "భయంలేదు.....కళ్ళు తెరవండి" అన్నాడతను.
    
    ఆమె కళ్ళు తెరవడానికి బదులు మరింతగా అతన్ని హత్తుకుపోయి కళ్ళు మూసుకుంది.
    
    "చాయా....చాయా" అతను కంగారుగా పిలిచాడు.
    
    ఆమెలో చలనం లేదు.
    
    అతను ఆమెను అతి జాగ్రత్తగా సోఫాలో పడుకోబెట్టి క్రిందపడిన ఓణీ తీసి ఆమెమీద కప్పి "రత్నం.....సంధ్యా! ఎక్కడున్నారు?" అని కేకలు పెట్టాడు.
    
    అతని కేకలకి లోపలినుండి రత్నం, క్రిందనుండి సంధ్య ఒకేసారి పరిగెత్తుకొచ్చారు.
    
    "ఇక్కడంత హడావుడి జరుగుతుంటే లోపలేం చేస్తున్నారు?" కోపంగా అడిగాడు.
    
    సంధ్య తండ్రి కోపాన్ని విచిత్రంగా చూసింది.
    
    "ఏం....ఏం జరిగింది బాబూ?" భయఅప్డుతూనే అడిగింది రత్నం.
    
    "ఏం జరిగిందా? చూడు....." సోఫాలో అపస్మారకంగా పడివున్న చాయను చూపించాడు.
    
    "ఏమైందీ?" సంధ్య దగ్గరకొస్తూ అడిగింది.
    
    "దీనివల్లే....దీన్ని తీసుకెళ్ళి కట్టెయ్. రెండురోజులు అన్నం, నీళ్ళు ఇవ్వకు" జూలీవైపు చూపిస్తూ అరిచాడు.
    
    జూలీ సన్నగా మూలుగుతూ అతని పాదాలు నాకబోయింది.
    
    "గెట్ లాస్ట్" జయచంద్ర అంత గట్టిగా అరవడం ఆ ఇంట్లోవాళ్ళు ఎప్పుడూ చూడలేదు.
    
    కాంచన కూడా గది బయటకి వచ్చి చూసింది.
    
    "నేను ఈ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకెళతాను. పట్టుకుని కారు వరకు తీసుకురా" రత్నంతో చెప్పాడు.
    
    "జూలీ ఇలా ఎందుకు చేసిందో? ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదే?" బాధగా అంది సంధ్య.
    
    "తిండి ఎక్కువై చేసుంటుంది" కోపంగా అని రత్నం సాయంతో చాయను తీసుకుని బైటకు వెళ్ళాడు.
    
    అతను చాయ మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకోగానే జూలీ మళ్ళీ మొరగడం ప్రారంభించింది.
    
    సంధ్య వెంటనే దాన్ని ఎత్తుకుని భయంగా "జూలీ.....జూలీ....ప్లీజ్ ఆపేయమ్మా" అని బ్రతిమాలింది.
    
    జూలీ ఆపలేదు.