పిల్లలతో మాట్లాడటం నేర్చుకోండి!

 

 

పిల్లలతో మాట్లాడటం ఒక కళే. అది తెలియకపోవడం వల్లే పేరెంట్స్ కీ, పిల్లలకీ మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వస్తోంది అంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. పిల్లలు మానసిక రుగ్మతలకు గురవ్వడం, ఆత్మహత్యలకు పాల్పడటం వెనుక ప్రధాన కారణం అదేనని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి పిల్లలతో మాట్లాడటం నేర్చుకుని తీరాలి. ఇంతకీ ఎలా మాట్లాడాలి? - చాలామంది పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ మాట్లాడరు. అది చాలా తప్పు. అస్తమానం మాట్లాడక్కర్లేదు. కానీ ఏదో ఒక సమయంలో వాళ్లతో కాసేపు కబుర్లు చెప్పాలి. రకరకాల విషయాలు షేర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్లకు కూడా మీతో విషయాలు షేర్ చేసుకోవడం అలవాటవుతుంది.

- పిల్లలు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లమీదే దృష్టి పెట్టండి. వేరే పని చేసుకుంటూ వాళ్లతో సంభాషించకండి. దానివల్ల వాళ్లు చెప్పేది వినే ఆసక్తి మీకు లేదని వాళ్లు అనుకుంటారు. ఆపైన మీకు చెప్పాలన్న ఆసక్తి వాళ్లకీ

- తప్పు చేస్తే అరవకండి. ఎందుకిలా చేశావ్ అని సౌమ్యంగా అడగండి. ఎప్పుడైతే అరిచారో భయం పెరుగుతుంది. నిజం చెప్పే ధైర్యం సన్నగిల్లిపోతుంది.

- పిల్లలతో వాదనకు దిగకండి. లేదంటే వాదించే లక్షణం వాళ్లకి కూడా అలవడుతుంది.

- కొందరు పిల్లలు చెప్పేది పూర్తిగా వినరు. ఏదైనా చెప్పబోతే ఇంకేం మాట్లాడకు, నోర్మూసుకో అంటూ అరిచేస్తుంటారు. మీకు ఆ అలవాటుంటే వెంటనే మానేయండి. లేదంటే వాళ్ల మాట మీరు వినరన్న భావం ఏర్పడి విషయాలు చెప్పడమే మానేస్తారు.

 

 

- అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడకండి. పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ నీకేం తెలుసు, నేను చెప్పేది విను అనకండి. కొన్నిసార్లు మనకు తెలియని విషయాలు పిల్లలకు తెలుస్తాయి. అందుకే వాళ్లు చెప్పేది వినండి. చాలా బాగా చెప్పావు నాన్నా అని మెచ్చుకుని, అందులో ఉండే తప్పొప్పులు సాధ్యాసాధ్యాల్ని చర్చించండి.

- అన్నిటినీ ఆదేశిస్తున్నట్టు చెప్పకండి. ఇది చెయ్యి అని సౌమ్యంగా చెప్పండి. అవసరమైనప్పుడు రిక్వెస్టింగ్ గా కూడా చెప్పండి. వాళ్లు చేయడానికి ఇష్టపడకపోతే ఎందుకు చేయమంటున్నారో, చేయడం వల్ల ఉపయోగం ఏంటో, చేస్తే మీరెంత ఆనందపడతారో తెలిసేలా చేయండి. చేయకుండా ఉండరు.

- మాటతీరును విమర్శించకండి. గట్టిగా మాట్లాడతావెందుకు, మెల్లగా నసుగుతావెందుకు అని వంకలు పెట్టకండి. వాళ్లలో ఏదో లోపం ఉందనుకుంటారు. ఇలా మాట్లాడితే ఇంకా బావుంటుంది అంటూ నేర్పించండి.

- Sameera