మిగతా ఇద్దరూ అనకపోయినా అదేస్థాయి అభినందనల్ని తమ కళ్ళద్వారా వ్యక్తపర్చారు.

 

    గత నాలుగు దశాబ్దాలుగా ఆటోమోబైల్ బిజినెస్ లో వున్న నాగమ్మకు కూడా తెలీని కొన్ని ముఖ్యమయిన వివరాలు సామంత్ నోటెంట దొర్లడంతో కూడా ఆసక్తిగా వింటోంది.

 

    నాయకి పరిస్థితి కూడా దాదాపు అలాగే వుంది.

 

    ఏ పరిస్థితిలో వున్నారో... చివరకు ఏ స్థితి దాపురిస్తుందో తెలీని అయోమయంలో పడ్డారు అర్జునరావు, పీటర్ లు.


                                  *    *    *    *


    జగద్గురు శంకరాచార్య మఠం ఏరియాలో దాదాపు మూడుగంటలు పట్టుదలగా తిరిగిన తదుపరి తనకు కావల్సిన ఇంటిని పట్టుకోగలిగాడు కనకారావు.

 

    లోలోన ఎంతో టెన్షన్ గా ఫీలవుతూ ఆ ఇంటి తలుపు తట్టాడు. రెస్పాన్స్ లేకపోవడంతో కొద్దిక్షణాలాగి మరోమారు తట్టబోతుండగా తలుపులు తెరుచుకున్నాయి.

 

    ఎదురుగా ఒక నడివయస్కుడు నించుని, తలుపు రెక్కల్ని పట్టుకొని ఏమిటన్నట్లు కనకారావుని కళ్ళతోనే ప్రశ్నించాడు.

 

    "సామంత్..." కనకారావు ఆ వ్యక్తి కళ్ళలో కనిపిస్తున్న ఎరుపుజీరను చూసి ఆపైన మాట్లాడలేకపోయాడు.

 

    "వూ... సామంత్..." అతను మామూలుగానే అన్నా ఉరిమినట్లని పించింది కనకారావుకి.

 

    ముందు కంగారుపడ్డా కొద్దిక్షణాలకు తేరుకొని-

 

    "సామంత్ మీ అబ్బాయే కదా?" అన్నాడు.

 

    "వూ... అయితే...?"

 

    ఇతనికి పొడి మాటలు తప్ప తెలుగులో వాక్యాలేమీ రావా అని తనలో తానే అనుకొని "మీ అబ్బాయి రేపు మిమ్మల్నోసారి తీసుకురమ్మన్నారు. అది చెప్పటానికే వచ్చాను" అన్నాడు కనకారావు నెమ్మదిగా...

 

    "రెండు నెలల నుంచి మాకు వాడు కనిపించటం లేదు. మీరేనా వాడ్ని పనిమీద తీసుకెళ్ళింది? మాకు ఫుడ్ ఎలా గడుస్తుందనుకున్నారు...? నీకసలు బుద్ధుందా? నువ్వు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? గాడిదా... అడ్డగాడిదా... నిలువుగాడిదా..." అతను మండిపడ్డాడు కనకారావుమీద.

 

    పొడిమాటలే బాగున్నాయనుకున్నాడప్పుడు కనకారావు.

 

    "కావల్సినంత డబ్బు సంపాదించుకున్నాడు. మీకింతవరకు పైసా కూడా పంపించకపోవడం చాలా అన్యాయం" అన్నాడు కనకారావు అతన్ని మంచి చేసుకొనే ప్రయత్నంలో భాగంగా.

 

    "పైసా లెవడికి కావాలిరా... కుయ్యా... రూపాయలు కావాలి. బాగా సంపాదించాడని చూసినట్లు చెబుతున్నావు. తల్లిదండ్రులకు పంపించాలని చెప్పి చావచ్చుగా? అరకాలు వెధవా?"

 

    బిత్తరపోయాడు కనకారావు.

 

    "రెండు నెలల నుంచి చూస్తున్నాను. కనీసం పాతికవేలయినా పంపించలేదు. చార్మినార్ ఏరియాలో చాకులకు సానబట్టే కొంకిరి కాణా. నువ్వెందుకు చెప్పి చావలేదు?"

 

    కొత్త కొత్త తిట్లు వరద ప్రవాహంలా వచ్చిపడుతుంటే బిక్కచచ్చిపోయాడు కనకారావు. తన వృత్తి ఇతనికెలా తెలిసిందని విస్తుపోయాడు. ఇది ఆ సామంత్ పనే అయుంటుంది. అని పళ్ళు నూరాడు.

 

    "నాకేమో పక్షవాతం... వాళ్ళమ్మకేమో సర్వరోగాలు. పెళ్ళీడు కొచ్చిన చెల్లెలు - చదువుకుంటున్న తమ్ముడు పడి ఇంట్లో వున్నారని నీకయినా జ్ఞానం లేకుండా పోయిందేమిరా ఇడిత్తల వెధవా?"

 

    "కొంకిరికాణా... ఇడిత్తల వెధవా... కుయ్యా... అరకాలు వెధవా... ఓరి నాయనో... ఇన్ని తిట్లా...? అసలిన్ని రకాల తిట్లనెలా సేకరించావయ్యా మహానుభావా?" కనకారావు తల పట్టుకుంటూ అన్నాడు.

 

    "మనమధ్యలో నీ బాబెందుకు...? అసలు వాడికి బుద్ధిలేదు. లేదంటే నీలాంటి పిక్కరి బాలిగాడ్ని కని దేశం మీద వదులుతాడా?"

 

    కనకారావు ఉలిక్కిపడ్డాడు.

 

    "మన మధ్యలోకి నా బాబెప్పుడొచ్చాడయ్యా మార్తాండతేజ?" దీనంగా ముఖం పెట్టి అడిగాడు కనకారావు.

 

    "ఇప్పుడేగదరా... ఓరి నాయనో అన్నావు"

 

    "తండ్రికి తగ్గ కొడుకు- కొడుక్కి తగ్గ తండ్రి. ఇద్దరూ ఇద్దరే జనాల మెదళ్ళను చితకబాదటానికి. పిక్కిరి బాలిగాడేమిటి...? అదేమయినా నీచమయినా తిట్టా...? ఎందుకయ్యా నువ్వూ నన్ను వేపుకు తింటున్నావు?" ఏడుపు మొఖంతో అన్నాడు కనకారావు.

 

    "అబద్ధాలాడతావేమిటిరా ఉక్కరికుంకా?"

 

    "అబద్ధాలా? నేనా?"

 

    "అవును నువ్వే"

 

    "ఎప్పుడు?"

 

    "ఇప్పుడేగా ఎందుకయ్యా నన్ను వేపుకు తింటున్నావని నీ కబేళా నోరు తెరిచి అన్నావు. నువ్వేమన్నా వేరుశెనక్కాయవా! మిరపకాయ బజ్జీవా?"

 

    "ఓరి నాయనో..." అని పెద్దగా అంటూ అక్కడే గడపలో కూలబడిపోయాడు కనకారావు.

 

    కొద్ది క్షణాలకు తేరుకుంటూ "ఇక సందేహపడక్కర్లేదు. వీడు ఆ సామంత్ గాడికి తండ్రే" అని స్వగతంలో అనుకుంటూ తల పైకెత్తి అతనివేపు దీనంగా చూశాడు.

 

    తన కాళ్ళ దగ్గర మోకరిల్లిన పార్ధుడికి విశ్వరూపంలో గీతోపదేశం చేసిన కృష్ణుడిలా కనకారావుకేసి చిద్విలాసంగా చూసాడా వ్యక్తి.

 

    "మీ నోట్లోంచి ఊడిపడ్డాడు మీ కొడుకు" కసిగా అన్నాడు కనకారావు లేచేందుకు ప్రయత్నిస్తూ.

 

    "తండ్రి నోట్లోంచి కొడుకులెలా వూడిపడతార్రా పిదప వెధవా! తల్లి గర్భంలోంచి భూమ్మీద పడతారు"

 

    "మీరు భలే జోకులేస్తారండి" రాబోతున్న ఏడుపును లోలోపలే దిగమ్రింగుకుంటూ అన్నాడు కనకారావు.

 

    "జోకులతో బాతాఖానీ కొట్టే అరబ్రెయిన్ వెధవలా కనబడుతున్నానా నీకు? నేను పోసుకోలు జోకులు చెప్పే పిచ్చివాడ్ని కాదు. సీరియస్ గానే చెబుతున్నాను. పిల్లలు తండ్రి నోట్లోంచి రారు"

 

    "మా గొప్ప సత్యాన్ని సెలవిచ్చారండి"

 

    "ఇలాంటివి చాలా సెలవిస్తాను. నా దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటావేమిటి?"