అహంకారంతో, పొగరుతో విర్రవీగిపోయి పాతస్నేహితులనూ, పరిచితులనూ మరిచిపోయి, వారిని చేతకానివారుగా, అసమర్ధులుగా చిత్రిస్తూ అవమానపరిచేలా మాట్లాడినవారూ వున్నారు.
    
    అహంకారం, పొగరూ మితిమీరిపోయి, రెచ్చిపోయి, అతితెలివితో ఏవేవో ప్రయోగాలు చేసి తిరిగి మామూలు స్థితికి చేరుకున్నవారూ వుంటారు.
    
    కొంతమంది ఉంటారు. వారెప్పుడూ ఏవో ప్రయత్నాలు, పథకాలూ, ప్రయోగాలు చేస్తూనే వుంటారు. వారి ప్రయత్నాలు కొన్ని హేతుబద్దంగానే వుంటాయి. కొన్ని కొండకు దారంవేసి లాగినట్టుగా వుంటాయి.
    
    వారెప్పుడూ పైకి రారు. జీవితాంతం ప్లానులతోనే గడిచిపోతూ వుంటుంది. ఇక్కడ కొంచెం డీవియేట్ అయి ఒకటి రెండు విషయాలు ప్రస్తావిస్తాను. డీవియేషన్ ఎందుకంటే మళ్ళీ మరచిపోతానన్న భయం!
    
    "మేమంత మంచివాళ్ళమైనా, తెలివిగలవాళ్ళమైనా అదృష్టం కలిసిరాక పైకి రావటం లేదు" ఈ బలమైన భావన చాలామందిలో వుంటుంది.
    
    అది నిజమే కావచ్చు. అదృష్టం కొందరిని కృషితోపాటు, కొందరిని సునాయాసం గానూ ఎందుకు వరిస్తూ వుంటుందో, కొందరిని అన్ని అర్హతలూ వున్నా, వున్నట్లు కనిపిస్తూన్నా ఎందుకు వరించదో నాకే కాదు, ఎవరికీ అర్ధంకాదు!
    
    ఈ భావన కొంతవరకూ ముందుకు వెడితే...
    
    "అలాంటి వెధవపనులు చేసి, అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించాలంటే నిముషం పట్టదు. నాకలాంటి పద్దతులు ఇష్టంలేక కానీ..."
    
    తాము నిజాయితీపరులైనట్లూ, అతీతులైనట్లూ, తలుచుకోవటం లేదు కాబట్టి (లోకంమీద దయ తలిచి) ఇలా వుండిపోతున్నామనీ బడాయిలు చెప్పుకునేవారు చాలామంది కనిపిస్తారు.
    
    ఇందులో చాలా తక్కువ శాతం నిజముంటుంది.
    
    వెధవపనులూ, అడ్డదారులూ...వీటి మీద వ్యతిరేక భావనమేమీ లేదు. అలాంటి ఉద్దేశాలు కలగటం, చాలాసార్లు ప్రయత్నాలు చేసి విఫలమవ్వటం, మానసికంగా అలాంటి ఊహల్లోనే తేలిపోతూ వుండటం.... ఎన్నోసార్లు జరిగే వుంటాయి.
    
    ఒకవిధంగా అసమర్ధత అంటే కోపమొస్తుంది.
    
    ఈ నిజాన్ని ఒప్పుకునే ధైర్యం వాళ్ళకు లేదు.
    
    మళ్ళీ కొంచెం డీవియేట్ అవుతున్నాను.
    
    ఆ మధ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా గుర్తింపులేని స్థితిలో వున్న ఓ రచయిత రోజు రోజుకూ ప్రఖ్యాతుడైపోతూ, దేశాన్ని తినేస్తున్న ఓ మెగా పాపులర్ రచయితను ఉద్దేశిస్తూ...
    
    "అతను రాసేవన్నీ ఇంగ్లీషు రచనల కాపీ అండీ నాకు చేతగాకనా? నేను అలా కాపీ కొడితే, అంతకన్నా పాపులర్ అయిపోయేవాడ్ని" అన్నాడు.
    
    "ఏదీ, కాపీ కొట్టి పాపులర్ అవ్వండి. ఒక సంవత్సరం కాదు. పది సంవత్సరాలు టైమిస్తున్నాను" అన్నాను.
    
    అతను ముఖం మాడ్చుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.
    
    డబ్బు సంపాదించటం వేరు దాన్ని మెయిన్ టెయిన్ చేసి కాపాడుకోవటం వేరు. 'డబ్బు'ను మెయిన్ టెయిన్ చెయ్యటం ఒక కళ.
    
    చాలీచాలని జీతాలతో వుండి జీవితాంతం ఆర్ధికబాధలతో గడిపే కుటుంబాలు కొన్ని వుంటాయి. అది ఒకరకం.
    
    కొన్ని కుటుంబాలుంటాయి. వాళ్ళు తమ సంపాదన ఎంతో తెలుసుకుని అతి జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు. అలా అని పీవిస్ట్ గా వుండరు.
    
    అవసరమొచ్చినప్పుడు చాలామందికంటే హుందాగానే ఖర్చుపెడతారు. అయితే వాళ్ళు ఖర్చుపెట్టడంలో ఓ పద్దతి కనిపిస్తూ వుంటుంది.
    
    రెండు మూడుగదుల ఇళ్ళలోనే కాపురం చేస్తూ ఆ ఇంటినే పరిశుభ్రంగా, కంటికింపుగా సర్దుకుంటూ, అందులోనే అన్నీ సరిపెట్టుకుంటూ, క్రమశిక్షణతో తెలివిగా డబ్బు పెంచుతూ....ఇంకో పదేళ్ళకి రిటైరయ్యే టైం వుండగానే సొంతఇల్లు ఏర్పరచుకోవటం పిల్లలకి మంచి ఉద్యోగాలు, ఆడపిల్లలకు మంచి సంబంధాలు.
    
    వాళ్ళ జీవితాల్లో నిర్దుష్టమైన ప్లాన్ కనిపిస్తుంది.
    
    వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది.
    
    కొంతమంది మొదటిదశలో బాగా సంపాదిస్తారు. అవి మెయిన్ టెయిన్ చేయటంలో నిర్దుష్టమైన ప్రణాళిక లేక కొంచెం హెచ్చులు, ఆడంబరం, చిన్న అహం, నిర్లక్ష్యం, ఈ సంపదనే శాశ్వతమానుకునే మితిమీరిన ఆత్మవిశ్వాసం....ఎక్కడో అక్కడ బోల్తా పడిపోతారు.
    
    అలా బోల్తాపడి, ఆర్ధిక సంక్షోభమనే ఊబిలో ఇరుక్కుపోయాక, కొంతమంది తప్పు తెలుసుకుని, తిరిగి పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తారు.
    
    ఒకసారి ఊబిలోకి ఇరుక్కుపోయాక చక్కదిద్దుకోవటం చాలా కష్టం. చాలా కష్టమనుకుంటే మనం ముందుకు సాగలేక అక్కడే చతికిలబడిపోతాం. అకుంఠితదీక్షతో శ్రమించి తిరిగిజారిపోయిన జీవితాన్ని చేజిక్కించుకున్న వారున్నారు. బయటపడలేక అలా పెనుగులాడుతూ చివరిదాకా గడిపేసినవారే బహుశా ఎక్కువమంది ఇంకో ముఖ్యమైన తరగతి - నిర్లక్ష్యం వల్లనో, అహంకారం వల్లనో బోల్తాపడి, ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నా, తప్పు తెలుసుకోలేక ఇంకా అహంకారంతోనే ప్రవర్తిస్తూ జీవితాల్ని ఇంకా ఇంకా దుర్భరం చేసుకునేవారు.
    
    మనకెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. అందరకూ తెలిసిన రంగంకాబట్టి సినిమా రంగం గురించి ప్రస్తావిస్తాను. చాలా తక్కువకాలంలో ఎంతో పైకి వస్తారు, గొప్ప జీవితం వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. వారిలో వున్న అన్వేషణా భావం, జిజ్ఞాస, అధోగతికి వెళ్ళిపోయి, ఆత్మహత్యలు చేసుకున్నవారు మనకి తెలుసు.
    
    అలా కాకుండా చిక్కిన సక్సెస్ ను ఆకళింపు చేసుకుని, ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ, చక్కని ప్లానింగ్ తో వ్యవహరించి డబ్బుని కాపాడుకుంటూ విజయవంతమైన జీవితాలు గడుపుతున్నవారూ చాలామంది వున్నారు.
    
    అలా జాగ్రత్తపడి తమని వరించిన సంపదను కాపాడుకున్నవారూ, పెంచుకున్న వారూ చాలా రంగాల్లో వ్యాపారంరంగంలో, క్రీడారంగాల్లో, వృత్తుల్లో, ఉద్యోగాల్లో.....చక్కని అవగాహనతో అభివృద్ధిని నిలుపుకున్నవారు...ఎంతోమంది వున్నారు.
    
    ప్రయోగాలు చెయ్యటం తప్పా?
    
    అలా ప్రయోగాలు చెయ్యకపోతే ఎంత విజయమైనా ఓ దశలో ఆగిపోదా? విజయంతో పరాకాష్టను చేరుకోవటమెలా?
    
    ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు.
    
    ప్రయోగం అన్నది ఓ జూదంలా వుండకూడదు.
    
    ఆ ప్రయోగం అన్నది ఓ ఉన్మాదంలా వుండకూడదు. తాము చేపడుతూన్న రంగాన్ని అన్ని కోణాలనుంచీ అధ్యయనంచేసి, చాలా తెలివిగా ఆలోచించి, ఆయా రంగాలకు చెందిన నిష్ణాతులతో చర్చించి అడుగుపెట్టాలి.
    
    ఒకవేళ పరాజయం ఎదురైతే? దానికి ముందుగానే సిద్దపడి.... అటువంటి విషమ పరిస్థితి తమను పూర్తిగా కబళించేసేలా కాకుండా, తమని తాము పూర్తిగా పోగొట్టుకోకుండా తట్టుకుని నిలబడేలా.... అంటే పరాజయం పరిధిని అంచనా వేసుకోగలగాలి.
    
    ఒక ముఖ్యవిషయం గమనించాలి. ఇది నెగెటివ్ దృక్పథం కాదు, ముందు జాగ్రత్త. ఇంకో సత్యం అర్ధం చేసుకోవాలి. విలాసవంతమైన జీవితంమీద ఆకర్షణ వుండటం తప్పుకాదు. కాని ఇది అందరికీ సాధ్యంకాదు. ఎందుకు సాధ్యంకాదంటే...అంతే. మన కుటుంబపరిస్థితులు, కుటుంబసభ్యుల్లో, ఆప్తుల్లో, స్నేహితుల్లో ఒకరికొకరు ఇచ్చుకునే పరిస్థితులు, నేర్చుకునే విద్య, పరిస్థితులు.....వీటన్నిటి మీదా ఈ సాధ్యం, అసాధ్యం ఆధారపడి ఉంటాయి.