"ఏమిటండీ డాక్టరుగారూ? పిశాచాలతో మీరు స్వయంగా సహవాసం చేస్తున్నట్టే చెప్పేస్తున్నారు?" అన్నాను.

 

    "అవును! వారికి సైకిక్ పవర్స్ ఉన్నయ్ ! ఆత్మలు ఆయనకు కన్పిస్తాయి. వాటి బాధలూ, భావాలూ, అనుభూతులూ వారికి బాగా తెలుసు" అన్నాడు రఘుపతి.

 

    "సైకిక్ పవర్స్!" అంటూ అదోలా నవ్వాను. నా నవ్వు నాకే ఎంతో వ్యంగ్యంగా ఉన్నట్టు తోచింది.

 

    డాక్టర్ నా ముఖంలోకి చూశాడు. కొద్దిక్షణాలు చూస్తూనే ఉండిపోయాడు.

 

    ఆ చూపులు నాకు అదోలా అన్పించి గుండె ఝల్లుమన్నట్టుగా అయింది.

 

    "మీలాంటి నాస్తికులు ఆత్మలను నమ్మరు. చనిపోయాక జీవితం లేదని వాదిస్తారు. వారు అజ్ఞానానికి నాకు జాలివేస్తుంది."

 

    నేను చివ్వున తలెత్తి చూశాను.

 

    "నన్ను చూస్తే మీకు జాలివేస్తుందా?" తీవ్రంగా అడిగాను.

 

    "అవునుబాబూ ! చిన్నవాడివి. నీకు తెలియని విషయాలు గురించి తెలుసుకోవాలి. పైగా రచయితవు. ఈ పుస్తకాలు తీసుకెళ్ళి చదువు. ఎందరో పెద్దలు పరిశోధనలు చేసి రాసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నీలాంటివాళ్ళు చదివి అర్థం చేసుకొని, రచనల ద్వారా పదిమందికి చెబితే ప్రజలకు ఎంతో సేవచేసినవాడివి అవుతావు."

 

    'హతోస్మి' అనుకున్నాను.

 

    "ఆ పుస్తకాలు చాలావరకు నేనూ చదివానండీ! అన్నీ వాళ్లవాళ్ల అనుభవాలే! అంతేగాని ఇది-ఇది-అంటూ ఎదుటివాడికి నిరూపించి చూపించగల వాస్తవాలు కావు అవి. అబ్రహాం కోవూర్ ను చదవండి. అవన్నీ మానసిక అనారోగ్యంలో నుంచి పుట్టుకొచ్చిన భ్రమలని మీకే అర్థం అవుతుంది" అన్నాను.

 

    "అవి భ్రమలు కావు, వాస్తవాలు!" ఆవేశంగా అన్నాడు డాక్టర్ రాజేంద్ర.

 

    "అదేలెండి, ఎవరి భ్రమలు వారి అనుభవాలేగా? వాటినే వాస్తవాలుగా చిత్రించి లోకం మీదకు విసిరేస్తున్నారు. కొందరికి ఎవరో తిడుతున్నట్టుగా అన్పిస్తుంది. కళ్ళముందు ఏవేవో దృశ్యాలు కన్పిస్తాయి..."

 

    "అవి పిశాచాల చేష్టలే ! అదేగదబాబూ నేనూ చెప్తున్నది" అన్నాడు మధ్యలోనే నా మాటల్ని అందుకొని డాక్టర్.

 

    "అవి పిశాచాల చేష్టలు కావు."

 

    "మరి?"

 

    "అవి మనస్థిమితం లేనివారికి కలిగే హెల్యూసినేషన్స్ ! ఆడిటరీ హెల్యూసిషన్స్ అండ్ విజ్యుల్ హెల్యూసినేషన్స్. సైకియాట్రిస్టులు ఇలాంటి జబ్బుల్ని చాలావరకు నయం చేస్తున్నారు. మీకు తెలియందేముంది? మీరు డాక్టరు. ఇలాంటివాటినే అమాయకులు దయ్యపుచేష్టలుగా భావిస్తారు."

 

    కృష్ణకుమార్ నా చేతిని గట్టిగా నొక్కాడు.

 

    నేను ఆవేశంలోనుంచి బయటపడ్డాను.

 

    డాక్టర్ రాజేంద్ర ముఖం ఎర్రగా అయింది. ముఖంలో, చూపుల్లో ఏదో మార్పు. నాకు కొంచెం భయంగా అన్పించింది అతన్ని చూస్తుంటే. ఆ ముఖంలో, ఆ చూపుల్లో పిచ్చితనం కన్పించింది.

 

    రఘుపతి బాధపడి పోతున్నాడు నా మాటలకు.

 

    "ప్రతివాడు సైక్రియాట్రీ గురించి మాట్లాడేవాడే ! దయ్యాల్లేవూ, భూతాలులేవూ, ఆత్మలు లేవూ, అంతా భ్రమ, అంతా పిచ్చి అని మాట్లాడటం ఈ మధ్య ఫాషన్ అయిపోయింది." ఆవేశంగా అన్నాడు డాక్టర్.

 

    "సైకియాట్రీ ఒక శాస్త్రం-మానసిక శాస్త్రం-సైన్సు..." కృష్ణకుమార్ నా చెయ్యి నొక్కడంతో నా మాటల్ని మధ్యలోనే ఆపాను.

 

    "మా ప్రసాద్ మాటల్ని పట్టించుకోకండి. మీరు చెప్పండి డాక్టరు గారూ!" కృష్ణ అతను చెప్పేదంతా నమ్ముతున్నట్టే అన్నాడు.

 

    అతను సాధారణంగా కాన్ ట్రవర్సీలోకి దిగడు. అన్నీ వింటాడు. అయితే ఆలోచించకుండా ఎవరి మాటల ప్రభావానికీ లొంగిపోడు. ఆవేశం తక్కువ, ఆలోచన ఎక్కువ. అతను నాకు స్నేహితుడే కాదు కొన్ని విషయాల్లో గురువు కూడా. స్నేహితుడిగా అతని దగ్గర నాకు చనువు ఉంది. అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది.

 

    "ఆఁ ఏం చెబుతున్నానూ? ఆత్మలను గురించి గదూ?" అన్నాడు ఉత్సాహంగా.

 

    "అవును ! ఆ విషయాలు చాలా చెప్పారు. మీరు స్పిరిట్సును ఆహ్వానిస్తారట..."

 

    "అవును ! ఆయన పిలవడమే తరువాయి అవి పలుకుతాయి." కృష్ణమాటల్ని మధ్యలోనే అందుకొని రఘుపతి అన్నాడు.

 

    ఆ కాంప్లిమెంటుకు డాక్టర్ చిద్విలాసంగా నవ్వాడు.

 

    నేను అతన్ని చూస్తూ జాలిగా నవ్వాను.

 

    ఒకనాటి మేధావి, ప్రముఖ సర్జనేనా ఇతను?

 

    అతను తన భార్యకేసి చూశాడు.

 

    ఆమె లేచింది. లోపల కెళ్ళింది.

 

    ఊజా బోర్డునూ, గాజు గ్లాసునూ తీసుకొని తిరిగి వచ్చింది.

 

    డాక్టర్ మంచం దిగాడు.

 

    అతి కష్టం మీద నేలమీద కూర్చుని, బోర్డు మీద గ్లాసు పెట్టి రఘుపతి కేసి చూశాడు.

 

    రఘుపతి కూడా కుర్చీనుంచి లేచి అతనికి ఎదురుగా కూర్చున్నాడు.

 

    కృష్ణకుమార్, నేనూ కూడా కింద కూర్చున్నాం.

 

    "ఎవర్ని పిలుస్తారూ?" అతని భార్య అడిగింది.

 

    "సుశీలను!"    

 

    "సుశీల ఎవరూ?" నేను కుతూహలంగా అడిగాను.

 

    "సుశీల మా అమ్మాయికి ఆడబిడ్డ- భర్త పెట్టే బాధ, అత్తగారు పెట్టే యాతనలూ భరించలేక కాల్చుకొని చచ్చిపోయింది. కొందరయితే కిరసనాయిల్ గుమ్మరించి వాళ్ళే చంపారంటారు. పోలీసుకేసు అయింది. అది ఆత్మహత్యగానే నిర్ణయించారు. కాని అది ఆత్మహత్య కాదు!" అన్నాడు డాక్టర్ రాజేంద్ర.

 

    "ఆ సంగతి మీకెలా తెలుసూ?" అన్నాను కుతూహలంగా.

 

    "ఆమె చెప్పింది." ఠక్కున డాక్టర్ గారి భార్య అన్నది.

 

    "ఆమె చెప్పిందా? అంటే చచ్చిపోకముందే ఆమెకు వాళ్ళు తనను కిరసనాయిల్ పోసి చంపబోతున్నారని తెలుసా?" విస్మయంగా అడిగాను.

 

    డాక్టర్ బోర్డు మీద నుంచి తలెత్తి నా ముఖంలోకి చూశాడు.

 

    అదోలా చూశాడు. వేదాంతి ఒక పసివాడి ప్రశ్న విని చూసినట్టుగా చూశాడు.

 

    "రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని నీలాంటి వాడే అడిగాడట!"

 

    నేను తెల్లబోయాను.

 

    "అదేమిటండీ? ఆమె గురించి నాకు వివరాలెం తెలియవే?" అన్నాను.

 

    "ఆమె స్పిరిట్ చెప్పింది."

 

    "ఏమని?" కృష్ణ ప్రశ్న.

 

    "తను ఆత్మహత్య చేసుకోలేదనీ, తనను భర్తా, అత్తా కలిసి హత్య చేశారనీను."

 

    "పోలీసు రిపోర్టు ఇవ్వకపోయారూ?" అన్నాను వళ్ళుమండి.

 

    "ఎలా? వాళ్లు నమ్మొద్దూ?"

 

    "వాళ్ళ ముందే స్పిరిట్ ను పిలిచి చెప్పించవచ్చుగా?" నాకు వళ్ళు మండిపోతున్నది.

 

    "చెయ్యగలను. వాళ్ళను నమ్మించగలను. కాని 'లా' ఒప్పుకోవాలిగా?"

 

    " 'లా' నే మార్పిస్తే సరి! ప్రభుత్వాలకు ఖర్చుకు ఖర్చూ తగ్గుతుంది. అసలైన అపరాధిని శ్రమ లేకుండా పట్టుకోవచ్చు." వ్యంగ్యంగా అన్నాను.

 

    నా కంఠంలో వ్యంగ్యాన్ని గ్రహించలేని ఆ పిచ్చి మహారాజు "మీ వంటి రచయితలూ, కృష్ణకుమార్ గారి వంటి విద్యావేత్తలూ కృషి చెయ్యాలి" అన్నాడు.

 

    "వట్టి కృషి చాలదండీ, ఉద్యమాలు లేవదియ్యాలి" అన్నాను వళ్ళుమండి.

 

    "డాక్టర్ గారూ, ముందు ఆ ఊజా బోర్డు మీదకు స్పిరిట్స్ ను రప్పించండి" అన్నాడు కృష్ణ కుతూహలంగా.

 

    నేను అతడి ముఖంవంక చూశాను.

 

    నన్ను మాట్లాడవద్దని కళ్ళతోనే హెచ్చరించాడు కృష్ణ.

 

    డాక్టర్ కళ్ళు మూసుకొన్నాడు.

 

    రెండు వేళ్ళను గ్లాసుమీద ఉంచాడు.

 

    "సుశీలా, రా ! రా తల్లీ రా! వస్తున్నావు గదూ ? నేను నీకు కావల్సిన వాడినే! నిజం చెప్పు! వచ్చావా?" అని గ్లాసు బోర్లించి ఊజా బోర్డు మధ్యలో పెట్టాడు.

 

    రఘుపతీ, రాజేంద్రా, ఇద్దరూ చెరొకవైపు నుంచి రెండు కుడిచేతి వేళ్లను (చూపుడు వేలూ, మధ్యవేలూ) బోర్లించిన గ్లాసుమీద ఉంచారు.