"మనం అలా ఒక్కడ్నీ వదిలి పెట్టకుండా వుండాల్సింది" అన్నాడు రాజు.    
    "ఏం ఫరవాలేదు, మనకేమీ కీడు జరగదు! దైవం కృప పుష్కలంగా వుంది" అన్నాడు శ్రీహరిరావు.    
    'ఛత్రపూర్'లో 'పండిట్' అనే మహానుభావుడి దర్శన భాగ్యం లభించింది.    
    పండిట్ ఒక నిరుపేద రైతు. అతని కుటుంబంలోని వారంతా జైలు కెళ్ళొచ్చిన వారే! వీరి బృందం సంగతులు అతను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వున్నాడట. అందర్నీ నిస్సంకోచంగా తన పూరిగుడిసె వంటి ఇంటికి హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. అతనింట్లో తల్లీ, తండ్రీ, అక్కగారూ 'భార్యా' పిల్లలూ వున్నారు. మొత్తం బృందానికి 'ఛా' యివ్వడానికి కూడా తమకు శక్తి లేదని అతని తల్లి విచారం వ్యక్తం చేసింది.    
    "ఏమీ ఫరవాలేదని" ఆమెని అనునయించింది రమణ.    
    "మీ ఆప్యాయతే మాకు పంచభక్ష పరమాన్నాలూ" అన్నాడు శ్రీహరిరావు.    
    పండిట్ ఇంట్లో లేడా సమయాన. ఎక్కడికో సంచీ పట్టుకుని వెళ్ళడం రాజూ, కోటయయా గమనించారు.
     "అనవసరంగా అతన్ని ఇబ్బంది పెడ్తున్నా మేమో!" అన్నారు. దానికి శ్రీహరిరావు "దైవ నిర్ణయం ఎలా వుందో మనకి తెలియదు కదా! అతన్ని చిన్నబుచ్చి మరో వసతి ఏర్పాటు చేసుకుంటే మరీ బాధపడతాడు" అన్నారు.    
    ఇంతలో పండిట్ రానే వచ్చాడు. "చూడండి! ఏమేమి తెచ్చానో" అంటూ సంచీలోంచి పొట్లాలు తీసి నేలమీద పరవసాగాడు. వాటిల్లో పింగోడాలూ, పూరీ, కళాఖండ్, కోవా మున్నగు ఫలహారాలున్నాయి. "ఇవన్నీ కొనడానికి ఎంత ఖర్చు పెట్టారు?" అనడిగాడు శ్రీహరిరావు.    
    "లేదు మిత్రమా! నేను ఈ సంచీ తీసుకుని, ప్రతి దుకాణదారు దగ్గరికీ వెళ్ళి, మన సాటి సోదరులు కొంతమంది స్వాతంత్ర్యసమరోద్యమంలో పాల్గొంటూ, కాంగ్రెస్ మహాసభల కెళుతున్నారు. వారెన్నో ప్రయాసలకోర్చి ఈ ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఈ పూటకి ఆతిథ్యం ఇవ్వడం మన ధర్మంగా భావిస్తున్నాను. సహాయం చెయ్యదలుచుకుంటే చెయ్యండి అన్నాను. అంతే! అందరూ సంతోషంగా ఇవన్నీ ఇచ్చారు" అంటూ పరమానందంగా చెప్పాడు.    
    ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్ళూ చెమర్చాయి. ప్రతి ఒక్కరి హృదయం ద్రవించింది. ఆ రోజు ఆ విందు అతని కుటుంబంతో కలిసి పంచుకుని తినడం ఆ బృందంలోని వారందరికి అద్వితీయమైన అనుభవంగా మిగిలిపోయుంటుంది.    
    ఆ రాత్రికక్కడే గడిపేసారు. మర్నాడు ప్రొద్దుటే శర్మ అనే పంజాబీ అతను ఉపాధ్యాయుడు వచ్చి అందర్నీ తన యింటికి ఆహ్వానించాడు. పండిట్ దగ్గర శలవు తీసుకుని, అతన్ని హృదయానికి హత్తుకుని, "నిన్నెప్పటికీ మరిచిపోలేను మిత్రమా!" అన్నారు శ్రీహరిరావుగారు. అతను నవ్వాడు. కళ్ళు తుడుచుకుని వారి మజిలీలలో ఎంతోమంది ఘనమైన ఆతిధ్యాలిచ్చారు కానీ, ఇంతగా మనసుకు హత్తుకున్నదిది వొక్కటే!    
    శర్మ భార్య 14 ఏళ్ల చిన్నపిల్ల భర్త ఒక్కసారిగా ఇంతమంది అతిధుల్ని తీసుకొచ్చేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత కంగారు పడసాగింది. శర్మ నవ్వి, "బాబీ! ణ అభార్యకి వంటదీ పెద్దగా చాతకాదు. మీ యిల్లే అనుకుని వంట చేసుకోండి. ఏ మేం కావాలో చెప్తే తెప్పిస్తాను" అన్నాడు రమణ వంట చేస్తోంది అని తెలియగానే రాజూ, నాగేశ్వరరావు, కోటయ్యా గొడవ చేశారు.    
    "రమణమ్మగారూ! రొట్టెలొద్దు. అన్నమే కావాలి!" అని అప్పటికి చాలారోజులయింది వాళ్ళు అన్నం మొహం చూసి.    
    ఆ రాత్రి అన్నం, పప్పు, ఆలుగడ్డల కూర, చారూ మొదలగునవి చేసి అందరికీ తృప్తిగా భోజనం పెట్టింది రమణ ఒక పనిపిల్లవాడి సహాయంతోటి.    
    ఆ మర్నాడే మరో మజిలీ.    
    'బిలాస్ పూర్' లోయలగుండా ప్రయాణిస్తుండగా, రమణకి నడిచే సత్తువ లేకపోయింది. ఆయాసంతో మధ్య మధ్యలో ఆగిపోసాగింది. ఏదైనా బండి దొరుకుతుందేమో చూస్తుండగా, దూరంగా నల్ల జీడిగింజల బస్తాలేసుకుని ఓ బండి వెళుతూ కనిపించింది. దాన్ని అడ్డంపడి ఆపారు కుర్రాళ్ళు. ఆ బండివాడు మొదట ఒప్పుకోలేదు బేరానికి, కానీ, పసిపిల్లా, ఆడమనిషీ నడవలేకుండా వున్నారని బ్ర్తతిమాలాడంతోటి ఒప్పుకున్నాడు.    
    బండిలో పిల్లని పెట్టుకుని ఆమె కూర్చుంది. బండి వెనకాల ఆయన రెండు చేతులతో బండిని అటూ యిటూ పట్టుకుని నడవసాగారు. చంటిదాని అల్లరిని చూసుకుని ఆ దంపతులు మురిసిపోసాగారు. ఆ లోయల్లో పచ్చని చెట్లనీ, నల్లని కొండల్నీ, వాటిమీదనుంచి దూకే తెల్లని జలధారల్నీ, ఎర్రటి అగ్గిపూలనీ చూస్తూ ప్రపంచమంతా రంగులమయం కదా! ఎన్నో రంగులు కలగలిపి ఈ సుందర దృశ్యాన్ని చిత్రించిన చిత్ర కారుడా భగవంతుడేకదా! అని భావుకత్వంతో మనసు వూయల లూగుతుండగా, హఠాత్తుగా ఆమె జబ్బని పట్టుకుని ఎవరో గుంజేసిన అనుభూతి. కళ్ళు తెరిచి చూసేసరికి ఒకచేత్తో పిల్లనీ, రెండో చేత్తో తననీ బండిలోంచి లాగేసి గుండెకి దగ్గరగా తీసుకున్న భర్త కనిపించాడు. జరిగినదేమిటో ఆమెకి అర్ధం కావడానికి ఒక్క నిమిషం పట్టింది. ఆపాటికే బండి రెండు పల్టీలుకొట్టి లోయలో పడిపోయింది. బండివాడు కూడా దూకేసి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఇరుసు విరిగిన బండిని లోయలోనే వుంచి, బండివాడు పైకొచ్చాడు.    
    "ఏం చేద్దాం?" అడిగారు వాడిని.   
    "ఇక్కడ దగ్గరలోనే మా అత్తవారి వూరు వుంది. నేనక్కడి కెళ్ళి ప్రొద్దుటే వచ్చి ఎవరి సహాయంతోనయినా బండి బాగు చేయించుకుంటాను" అని చెప్పి వాడు పరుగులాంటి నడకతో మాయమయ్యాడు.    
    శ్రీహరిరావుగారు భార్యనీ, పిల్లనీ, గుప్తానీ, నాగేశ్వరరావునీ తీసుకుని "ముందేమయినా సహాయం దొరుకుతుందేమో చూస్తాను" అని నడవసాగారు. రాజు, కోటయ్య, వెంకటరత్నం, సుబ్రహ్మణ్యం ఆ బండి దగ్గరే చతికిలబడ్డారు.    
    "పంతులూ! అటే పోత పోక, మమ్మల్ని కాస్త గుర్తుంచుకోండి" అని అరిచారు వెనకనుంచి.