కరీనాకపూర్‌ని అనుకరించవద్దు

 

 

సెలబ్రెటీలు జీవితాలు వేరు. వారికి ఉండే సౌలభ్యాలు వేరు. ఇంటి పనిలో తోడుగా నిలిచే సహాయకుల దగ్గర నుంచీ జలుబు చేసినా వాలిపోయే వైద్యుల వరకూ.... సమస్త సౌకర్యాలూ వారి చెంత ఉంటాయి. కానీ బయటకు కనిపించే వారి జీవిత విధానాన్ని చూసి అలాగే జీవిద్దామని అనుకుంటే కనుక మన బతుకులు ప్రమాదంలో పడక మానవు. ఇప్పుడు అలాంటి చర్చే కరీనాకపూర్‌ గురించి జరుగుతోంది.

 

కరీనా గత ఏడాది డిసెంబరులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కరీనా దంపతులు ఇద్దరూ బాలీవుడ్ తారలు కావడంతో ఆ సంఘటనకి మీడియా విపరీతమైన ప్రచారం వచ్చింది. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. గర్భవతిగా ఉన్న సమయంలో కరీనా 18 కిలోల బరువు పెరిగిందట. ఈ బరువునంతా తగ్గించుకోవడానికి ఇప్పుడు ఆమె కంకణం కట్టుకుంది. అందుకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయడమే కాకుండా జిమ్‌లో వ్యాయామం చేయడం, కిక్‌ బాక్సింగ్‌ చేయడం వంటి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతేకాదు! బిడ్డ జన్మించిన మూడు రోజులకే కరీనా ఇంట జరిగిన ఓ పార్టీలో ఉత్సాహంగా పాల్గొనడం, మరికొద్ది రోజులు గడిచేసరికి ర్యాంప్‌ మీద నడవడం, త్వరలోనే ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధపడిపోవడం వంటి చర్యలన్నీ కూడా ఇప్పుడు వార్తల్లోకి ఎక్కుతున్నాయి.

 

సాధారణంగా తారలు, తల్లయినా కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులూ రాలేదని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ర్యాంప్ మీద నడుస్తూ, ఫొటో షూట్లు చేస్తూ, ఇంటర్వ్యూలలో కనిపిస్తూ.... తమ అందం ఏమాత్రం తగ్గలేదని నిరూపించే ప్రహసనాలు చేస్తారు. ఇదంతా వారి వ్యక్తిగతమే అయినప్పటికీ... వారిని అనుకరించే ప్రయత్నం చేస్తే మాత్రం, సాధారణ మహిళలకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే-

 

- బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కనీసం ఆరువారాల విశ్రాంతి కావాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయంలో శాస్త్రీయత ఉందంటున్నారు వైద్యులు. తల్లి అయిన తరువాత స్త్రీ రుతుక్రమం ఆగిపోతుంది. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఆ రుతుక్రమం తిరిగి సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకనే వారాల తరబడి విపరీతమైన రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. ఇలా కనీసం ఆరువారాలపాటు నరకయాతను అనుభవించిన తరువాత కానీ ఆమె శరీరం తిరిగి సాధారణ స్థితికి చేరుకోదు.

 

- బాలింతరాళ్లకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు వారి మీద చాలా త్వరగా దాడి చేస్తాయి. దాంతో వారు ఎలాగూ ఇబ్బంది పడతారు. కానీ వారి నుంచి తల్లిపాలు తాగుతున్న బిడ్డకు కూడా ఈ అనారోగ్యం వ్యాపించే ప్రమాదం ఉంటుంది. సున్నితమైన పసిపిల్లల శరీరం ఒకోసారి ప్రాణాపాయ స్థితికి చేరుకుటుంది. అందుకనే పెద్దలు బాలింతలను కొన్ని వారాలపాటు బయట తిరగవద్దనీ, చలిగాలి తాకనివ్వద్దనీ చెబుతారు.

 

- చాలామంది తల్లులు, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత డిప్రెషన్‌కు లోనవుతారు. దీనిని Postpartum Depression అంటారు. ఈ సమయంలో వారు ఉద్వేగపూరితమైన వాతావరణంలోకి అడుగుపెడితే, వారి మానసిక స్థితి మరింత దిగజారిపోతుంది. బిడ్డకు వీలైనంత దగ్గరగా ఉంటూ వారి బాగోగులను గమనించుకోవడం వల్లే ఈ Postpartum Depression నుంచి త్వరగా బయటపడవచ్చని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.

 

- బిడ్డకు జన్మనిచ్చిన తరువాత శరీరంలో కొన్ని మార్పులు రావడం సహజమే! ఈ సమయంలో వచ్చే అధికబరువుని ఎలాగైనా తగ్గించుకోవాలన్న ఆశ ఎవరికైనా ఉంటుంది. కానీ ఆ ఆశతో తినే ఆహారంలో విపరీతమైన మార్పులు చేయడం, డైటింగ్‌ చేయడం, విపరీతమైన వ్యాయామాలు చేయడం వంటి తొందరపాటు చర్యలతో తల్లీబిడ్డల ఆరోగ్యానికి హాని జరగవచ్చు.

 

అన్నింటికీ మించి మాతృత్వం అనేది ఒక వరం. ఆ వరంతో వచ్చిన వరాల మూటతో కొద్దివారాలు దగ్గరగా గడపడం మంచిది. ఎందుకంటే బిడ్డ భూమ్మీద పడిన తొలి నెలలు అతని మానసిక, శారీరిక వికాసంలో చాలా ముఖ్యపాత్రని వహిస్తాయట. ఆ సమయంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా, అతని దీర్ఘకాలిక ఎదుగుదల మీద ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తల్లి ప్రేమ, లాలన అందాల్సిన ఈ అవసరాన్ని గుర్తించబట్టే తల్లులకు వీలైనన్ని సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాలు కోరుతుంటాయి. ఇలా తమ బిడ్డలతో గడపడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ అలాంటి అవకాశం ఉన్నవారు మిగతా వ్యాపకాలను పక్కనపెట్టి, బిడ్డ మీద శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. అందుకే కరీనా జీవితం కరీనాది... మన జీవితం మనది!!!

 

- నిర్జర.