"పోనీ నీ ప్రియుడు రాజారావుకు... అలా కంగారుపడకు. మీ ఆయనకు చెప్పనులే. ఎందుకంటే నీలాంటి ఏ కొద్దిమందిమూలంగానో నేను ఆడజాతినంతా అసహ్యించుకోను కాబట్టి, నేను నిజం కక్కితే నీ కాపురం కూలిపోతుందన్న కొద్దిపాటి సానుభూతి ఇంకా మిగిలేవుంది కాబట్టి... చెప్పు... నానీ ఎక్కడ..." ఇక నిభాయించుకోలేనట్టు సరళ జుట్టు పట్టుకోవడానికి చేతిని పైకెత్తబోతుండగా చంద్రం అడ్డంపడ్డాడు.

 

    "పరాయిదానిమీద చేయివేసే హక్కు మీకులేదు. అసలు..." చంద్రం మాటలింకా పూర్తికాకుండానే యశస్వి పిడికిలి అతడిపొట్టను తాకింది.

 

    "నువ్వు హక్కులగురించి మాట్లాడుతున్నావా స్కౌండ్రల్. నీ జీవిత భాగస్వామిని బ్రతికే హక్కు కాలరాసి ఒక బజారు ఆడగాని ప్రోద్భలంతో నీ తల్లిచెల్లెళ్ళ అండతో భార్యని హత్యచేసిన నువ్వు నా హక్కుని ప్రశ్నిస్తున్నావా?" ఈసారి చంద్రం కళ్ళు భైర్లుకమ్మేటట్టు గెడ్డంపై గుద్దాడు.

 

    చంద్రం నీరసంగా తూలిపోతుంటే ఆసరా ఇచ్చి "చూడూ... కట్టుకున్న నేరానికి భార్యని హత్యచేసే హక్కు నీకున్నట్టే నేరం చేసినవాళ్ళ తోలువలిచే హక్కు పోలీసాఫీసర్ కీ వుంటుంది" అంటూ దూరంగా నెట్టివేశాడు.

 

    చంద్రం నిస్త్రాణగా గోడకి జారగిలబడిపోయాడు. "మిష్టర్ చంద్రం... నువ్వు చేసుకున్న అదృష్టమేమన్నా వుంటే అది పావనిలాంటి ఓ సాధ్వి నీకు భార్యకావడం... 'సాధ్వి' అంటూ ఆమెను ఎందుకు ఎడ్రస్ చేశానూ అంటే ఇంతచేసినా నిన్నూ నీ వాళ్ళని రక్షించడానికి చివరి వూపిరిదాకా ఆ తల్లి ప్రయత్నించి మరీ ప్రాణాలు విడిచింది కాబట్టి... ఐతే ఇప్పుడామె లేదు. నువ్వు చదువుకున్న పురాణాలే నిజమైతే ఆమె ఉసురు, ఆ శాపం మీ అందర్నీ ఎలాగూ కాటేస్తుంది. మళ్ళీ నానీని ఎందుకు దాచేశారు? ఒక నిజం చెప్పించాలనుకున్నాననేగా... అందుకే నానీని కడతేర్చే ప్రయత్నంచేస్తే నాకు మీరు వ్యక్తిగతమైన శత్రువులైపోతారు" ఉద్వేగంగా చంద్రం కాలరు పట్టుకున్నాడు "ర్రేయ్... ఐ వాంట్ నానీ... ఐ ఇమ్మీడియెట్లీ వాంట్ హిమ్ సేఫ్... లేదూ మిమ్మల్ని వెంటాడి వేధించి ఉరికంబమెక్కిస్తాను. నానీని సురక్షితంగా ఇరవైనాలుగు గంటల్లో నా ముందుంచాలి. అర్థమైందా" వదిలేశాడు "కౌంట్ డౌన్ మొదలైంది లెక్కపెట్టుకో."   

 

    ఆవేశంగా బయటకు నడిచాడు.

 

    బుల్లెట్ స్టార్ట్ చేయలేదు. సరాసరి రాజారావు దగ్గరకి వెళ్ళాడు. ఇంటివాళ్ళు చెప్పారు మూడురోజులుగా అతడు ఇంటికే రావడంలేదని.

 

    యశస్వి భ్రుకుటి ముడిపడింది.

 

    మరో అయిదు నిముషాలలో బుల్లెట్ కామేశ్వరి ఇంటికి చేరుకుంది.

 

    ఆ  ఇల్లూ తాళంవేసి వుంది.

 

    పరిస్థితుల్ని ఒక వాస్తవానికి అన్వయించుకుంటూ విశ్లేషించి అనుభవంగల పోలీసాఫీసర్ గా నానీ మిస్ కావడంలో మిగతాపాత్రల పాత్ర ఎంతుందీ అని ఆలోచించాడు.

 

    రాత్రి పొద్దుపోయాక నానీకోసం మరో చిన్న ఆధారమైనా దొరుకుతుందేమో తెగ ప్రయత్నించి చివరగా కామేశ్వరి ఇంటికి వచ్చాడు.

 

    ఇంకా తాళం వేసే వుంది.

 

    అసహనంగా అనకాపల్లిలో అతడుండే ఎపార్ట్ మెంట్ కి వచ్చాడు.

 

    అప్పటికే బయట ఫియెట్ లో వెయిట్ చేస్తూంది హరిత.

 

    నిశ్శబ్దంగా అతడ్ని అనుసరించింది.

 

    "ఏమైంది" అలసటగా గదిలోని సోఫాలో వెనక్కి వాలికూర్చున్న యశస్విని లాలనగా అడిగిందామె.

 

    ఇప్పుడామె ఆకతాయిపిల్లలా లేదు.

 

    అనూహ్యమైన మానసికగ్లానితో నలిగిపోతున్న అతడ్ని సేదదీర్చగల ప్రియనేస్తంలా వుంది.

 

    మోచేతిని తలపై వుంచుకుని సీలింగ్ వైపు చూస్తూ వుండిపోయాడు చాలా సేపటిదాకా. హరితా... అసలు నానీ బ్రతికే వున్నాడంటావా?"

 

                                   *    *    *

 

    "అమ్మా..."

 

    గెస్ట్ హౌస్ ఓ మారుమూల గదిలో నేలపై పడుకుని వున్న నానీ కళ్ళనుంచి ఇక ఆగలేనమ్మా అంటూ నీళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.

 

    భయంగా వుంది. దిగులుగా వుంది. అంతకుమించి చుట్టూవున్న అపరాత్రి చీకటి అమ్మని మరీ మరీ గుర్తుచేస్తూంది.

 

    "ఆకలేస్తూందమ్మా...రెండుసార్లు ఆకలిపాట పాడాక... ఇంకా ఆకలేస్తూనే ఉంది... నన్ను చీకట్లో దాచేసారే... అమ్మ. నాకు భయ్యమేస్తుందే..." వెక్కిపడుతున్నాడు "ఇలాంటప్పుడు ఏం చెయ్యాలో చెప్పలేదేంటమ్మా?"

 

    ఓ పక్కకి ఒత్తిగిలి వణికిపోతూ రెండుచేతుల్ని చెంపలకిందుంచుకుని నిస్త్రాణగా కళ్ళను అరమోడ్పుల్ని చేస్తుంటే...

 

    లీలగా తల్లిరూపం కనిపించింది.

 

    ఎక్కడ్నుంచి వచ్చిందో "మంచి నానీలు ఏడుస్తారా... ముద్దుల కన్నాలు కన్నీళ్ళెట్టుకుంటారా" అమ్మ చెంపల్ని స్పృశిస్తూంది పాపిడి సర్దుతూంది. "నానీ నా చిట్టితండ్రి... నువ్వెక్కడున్నా నేనెప్పుడూ తోడుంటాగా. మరలాంటప్పుడు దిగులు పడొచ్చా! ఆరోజు గుడిదగ్గర ఏంచెప్పావు? ఎవరూ ముద్దాడకపోతే అమ్మపాట పాడుకుంటాననలేదూ."

 

    "మ...రేం" మగతగా తలూపాడు.

 

    "మరి పాడుకోవచ్చుగా" అమ్మగొంతూ వణుకుతూంది. "అంటే నన్ను ఏడిపిస్తావన్నమాట"

 

    "లే...ద...మ్మా!" నానీ కళ్ళనుంచి నీళ్ళు మరింతగా సుడులు తిరిగాయి."తప్పయిందే" చేతనాచేతనావస్థలమధ్యే 'అమ్మముద్దు' గుర్తుచేసే అమ్మపాటని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు.

 

    ఇప్పుడు నానీకళ్ళు పూర్తిగా మూతలుపడ్డాయి.

 

    గదిలోని చీకటిని మరిచిపోయాడు.

 

    అంతదాకా వేధించిన ఒంటరితనంనుంచి దూరం జరిగాడు.

 

    అమ్మఒడిలో అమ్మగుండెలపై అమ్మ కౌగిలిలోని ముద్దులన్నీ గుర్తుకొస్తుంటే...

 

    "పొత్తిళ్ళ నానీకి పాలముద్దు

    పారాడే కొండకి మురిపాలముద్దు

    ఒడిలోని కన్నకి వెన్నముద్దు

    చిన్నికృష్ణుడి చెంప చిన్నముద్దు

    మారాము తండ్రికి గారాలముద్దు

    ఎప్పుడైనా ఇస్తుంది ఎంచక్కటి ముద్దు

    ఇన్ని ముద్దుల అమ్మ నా చెంతవుండగా

    ఏడుపుదండగే ఎప్పుడూ పండగే..."

 

    మంత్రంలా జపించాడు... ఒకసారికాదు

 

    రెండు... మూడు... అయిదుసార్లు.