ఎప్పుడూ అంతే. ఏ మాత్రం తగాదా వచ్చినా ఏ ఆట ఆడుకున్నా కళ్యాణమూర్తి, వేదితా ఒక పక్షమయ్యేవారు. అతడు ఒక్కడూ ఒక పక్షం. ఒక్కోసారి అతనికి చెప్పకుండా కూడా యిద్దరూ ఎక్కడికైనా వెళ్ళి పోతుండే వాళ్లు.

 

    వాళ్ల లేత జీవితాలు యిలా కొన్ని సంవత్సరాలపాటు సాగిపోయాక వరుసగా ముగ్గురూ విడిపోయే సంఘటనలు జరిగాయి. వేదిత బాల్యం నుంచి మరో దశలోకి తీగెలో ప్రాకివెళ్ళే బంగారుతీగై కూర్చుంది. మునుపటిలా స్వేచ్ఛగా యిల్లు కదలటానికి వీల్లేదు. మొగపిల్లలతో కలిసి లేడిపిల్లలా గెంతటానికీ, కొండలవంకా, ఆడవుల వెంటా చిలిపిగా గెంతులేస్తూ తిరగటానికి వీలులేదు. ఇంట్లో కూర్చోవాలి. చిన్నచిన్న ఇంటి పన్లు చేయాలి. ఈ మార్పుకు ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. దుఃఖాన్ని దిగమ్రింగుకుంటూ కాలం గడపసాగింది. కళ్యాణమూర్తి, శేషశాయీ స్కూల్ చదువులైనాక, కళాశాలలో చేరడానికి బస్తీ వెళ్లారు. పండగకీ, పబ్బానికి ఇంటికొస్తూ ఉండేవారు. రోజులు గడిచినకొద్దీ పరిస్థితుల ప్రాబల్యం దృష్ట్యా నాగేంద్రరావుగారి కుటుంబం అనేక ఆర్ధిక యిబ్బందుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. క్రమంగా ఆ ఊళ్ళోని ఆస్తిపాస్తుల్ని అమ్ముకుంటూ వచ్చారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం కలసిరాక పోయేసరికి యింటిని మాత్రం తమకు ఉంచుకుని మిగతా ఆస్థినంతా తెగనమ్మి, ఆ ఊరు విడిచిపెట్టి బస్తీకి చేరుకున్నారు. అక్కడ నాగేంద్రరావుగారు నలుగురైదుగురు ధనికుల్ని మంచి చేసుకుని వాళ్ళతో భాగస్థుడిగా కలిసి వ్యాపారం ప్రారంభించాడు. పెద్ద లాభాలు లేక పోయినా, ఒడుదుడుకులు లేకుండా జీవితం గడిచిపోసాగింది.

 

    ఈ లోగా వేదిత పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయింది. పెళ్ళిలో ఆమె పెళ్ళిబట్టలతో పీటలమీద కూర్చుని జనసందోహంలో స్నేహితులెక్కడైనా కనిపిస్తారేమోనని కళ్ళతో వెదుక్కుంది. కనిపించారు దూరంగా, ఒకరి భుజంమీద ఒకరు చేయి వేసుకుని కళ్యాణమూర్తి, శేషశాయి చిరునవ్వు ముఖాలతో ఆమెవంక తిలకిస్తున్నారు. "మీకు నవ్వుగా ఉందా? నే నేడుస్తుంటే" అని కసిగా వుడికిపోయింది వేదిత.

 

    కళాశాలలో చదువైపోయాక పై చదువులకని కళ్యాణమూర్తి విశాఖపట్నం వెళ్ళిపోయాడు. శేషశాయికి మెడలువంచి పెద్దలు వివాహం జరిపించారు. వివాహం జరిగినా కొన్నాళ్ళకే శేషశాయి యింట్లో దెబ్బలాడి గాలిదుమారం లేపి, గెల్చి యింజనీరింగు చదవటానికి విదేశాలకు వెళ్లిపోయాడు. వేదిత నుదుట కుంకుమరేఖను చెరుపుకుని యింటికి తిరిగివచ్చింది.

 

                                            * * *

 

    ఇంటికి నిర్భాగ్యురాలిగా తిరిగివచ్చిన వేదితకు బ్రతుకు నిస్సారంగా శూన్యంగా గోచరించింది. గుడిలోని కోనేరు, చెట్లమీద కాపురం చేసే పక్షులు తోటలో తిరిగే కుందేళ్లు, గత్యంతరంలేక వికసించిన పువ్వులు ఆమెను విషాదంగా పలకరించాయి.

 

    గుడి తలుపులు తీసి లోపలకు ప్రవేశించింది. రమణీయంగా మలచబడి, చిరునవ్వులు వెదజల్లుతూన్న గోపాలబాలుడు ఆమెను రమ్మని పిలిచినట్లయింది.

 

    "పో నువ్వు దొంగవే కాదు, హృదయంలేని వాడివి కూడా" అని నిందించింది  వేదిత కళ్ళనీళ్లు తిరుగుతూండగా.

 

    "రా వేదితా రా! నీ కెవరూ లేకపోతేనేం? నే నున్నాను. నా నీడన నిద్రపో" అని చిన్ని కృష్ణుడు పలికినట్లయింది.

 

    ఈ పిలుపు ఆమె వీనుల్లో మురళీనాదంగా వినిపించింది. శరీరమంతా విద్యుత్ ప్రాకినట్లయింది. పదహారేళ్ళ సుకుమారి, అప్పుడే విరిసిన విరిలాంటి ముగ్ధబాలిక, మలినమంటే తెలియని నిర్మల హృదయ యీ పిలుపును అర్ధం చేసుకోలేకపోయింది.

 

    ఆమె అత్తవారింట్లో ఉన్నంతకాలమూ భర్తని ఏనాడూ ప్రేమించి ఎరుగదు. ప్రేమించటానికి ప్రయత్నంకూడా చెయ్యలేదు. కళ్యాణమూర్తి సుందరరూపమే ఎప్పుడూ హృదయంలో మెదులుతూ ఉండేది.

 

    "ఓ! నువ్వంటే యింత ఇష్టమని యిదివరకు నాకు తెలియదు కళ్యాణీ! ఎందుకిలా తరచు గుర్తువస్తావు? నువ్వు నన్ను గురించి ఆలోచించవు, నాకు తెలుసు. ఒక్క క్షణం కూడా నీఆలోచనలు వృధాచేయవు . బండెడు పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటావు. నీ పుస్తకాలే నీ ప్రియురాళ్ళు. కాపురమంటే ఏమిటో నీకు తెలుసా? అవున్లే ఏం తెలుస్తుంది? అడవి మనిషివి. అందుకే సుఖపడుతున్నావు."

 

    ఇలా అతన్ని గురించి మనసులో దూషిస్తూ, భూషిస్తూ రోజులు గడిపేది.

 

    "అవునుగాని, నువ్వెప్పుడూ ఆలోచిస్తూ ఉంటావేం?" అని అడిగాడు ఆమె పెనిమిటి తాంబూలం సేవిస్తూ.

 

    "మనిషినికదూ, అందుకని " అంది వేదిత ముందూ వెనుకా ఆలోచించకుండా.

 

    "అయితే ఆలోచించనివాళ్ళంతా మనుషులు కాదంటావా?"

 

    "అంతమాట ఎలా అంటాను నేను?"

 

    "అందగత్తెనని అహంభావం నీకు."

 

    ఆమె బదులు చెప్పకుండా ఆలోచిస్తోంది.