జాకీ చేతులు కట్టుకు చెబుతున్నాడు-

 

    "అంతా సవ్యంగా జరిగితే రేపే నా పెళ్ళి సార్!"

 

    "అవును. అందరి కథకి రేపే క్లయిమాక్సు!"

 

    "మీకెలాగుందోగాని సర్-నాకు మాత్రం గొప్ప థ్రిల్లింగ్ గా వుంది సార్!"

 

    "ఉంటుందుంటుంది. అల్లాగే ఉంటుంది."

 

    "సీజను పూర్తయ్యేలోగా ఈ బాపతు పెళ్ళిళ్ళు టపటపా నాలుగైదు చేసిపెడితే మీ మేలు మరిచిపోలేను సార్!" అన్నాడు జాకీ.

 

    అతనికి జవాబు చెప్పకుండా సత్యం అకస్మాత్తుగా లేచి నుంచున్నాడు.

 

    సత్యం ఎందుకు లేచాడో తెలీక జాకీ కంగారుపడ్డాడు.

 

    సత్యం దృష్టి ఒకచోట కేంద్రీకృతమై వుంది.

 

    జాకీకూడా అటువేపే చూచాడు.

 

    అక్కడ కృష్ణమూర్తి నించుని వున్నాడు.

 

    అతను ఒక్కో అడుగువేస్తూ సత్యంతో అంటున్నాడు---

 

    "నేను అనుకున్నది ఒకటి. నువ్వు చేస్తున్నది ఇంకొకటి. ఇది నీకు న్యాయంగా వుందా?"

 

    "నా వరకు నాకు న్యాయమే. నా బిడ్డను అవమానించిన వాడిని నామరూపాల్లేకుండా చేయడం నా డ్యూటీ. వాడి అంతు చూస్తానని ఆనాడే చెప్పాను. చెప్పింది చేస్తున్నాను.అండర్ స్టాండ్!"

 

    "నాన్నా" అరిచేడు కృష్ణమూర్తి.

 

    ఆ సంబోధనకి జాకీ అదిరిపోయాడు. ఆ తండ్రీ కొడుకులవేపు వెర్రిచూపులు చూస్తున్నాడు.

 

    సత్యం నిబ్బరంగా అన్నాడు.

 

    "అరవకు కన్నా! జరిగేది చూస్తాడంతే!"

 

    "చూస్తాను ఈ పెళ్ళెట్లా చేయించగలవో నేనూ చూస్తాను!" అని కృష్ణమూర్తి వెనక్కి తిరిగాడు.

 

    "జాకీ! వాడిని పట్టుకో!" అరిచాడు సత్యం.

 

    జాకీ కదలలేదు.

 

    "యూ ఫూల్! నీకే చెపుతూంట. వాడ్ని పట్టుకో!"

 

    అప్పటిగ్గాని జాకీ కదలలేదు.

 

    "యూ ఫూల్! నీకే చెపుతూంట. వాడ్ని పట్టుకో!"

 

    అప్పటిగ్గాని జాకీ కదలలేదు.

 

    దగ్గరకొచ్చిన జాకీని ఎగిరి తన్నాడు కృష్ణమూర్తి. ఆ దెబ్బతో జాకీ వెల్లకిలా పడ్డాడు. పడ్డవాడి ఛాతీమీద కాలుపెట్టి అన్నాడు కృష్ణమూర్తి.

 

    "బతుకుమీద తీపివుంటే ఈ పెద్ద మనిషితో చేతులు కలపకు. ఇది నా వార్నింగ్!"

 

    అని వెళ్ళబోతున్న కృష్ణమూర్తిని అమాంతం వాటేసుకున్నాడు జాకీ. ఈ గొడవ విని అప్పటికే వచ్చిన జాకీ మనుషులు కృష్ణమూర్తిని గట్టిగా పట్టుకున్నారు.

 

    సత్యం వాళ్ళకి సూచనలిస్తున్నాడు.

 

    "కొట్టొద్దు. కట్టేయండి. దట్సాల్!"

 

    వాళ్ళు ఆ పనే చేశారు.

 

    కట్టివేయబడ్డ కొడుకుని చేరి అన్నాడు సత్యం.

 

    "సో! ఎక్ టెస్ట్! మళ్ళీ కొత్త సంవత్సరంలో కలుద్దాం! ఓ.కె! కమాన్-జాకీ!"

 

    అంటూ సత్యం వెళ్ళిపోతున్నాడు. అతన్ని కుక్కపిల్లలాగా వెంబడిస్తున్నాడు జాకీ.

 

    ఇంటి బయట-

 

    సుబ్బారావు జాకీ కోసం నక్కి నక్కి చూస్తున్నాడు.

 

    సత్యంతోపాటు జాకీ గొప్ప ఉల్లాసంగా బయటకు రావడం చూసిన సుబ్బారావు గుండె ఆగిపోయినంత పనయ్యింది.

 

    సత్యాన్ని చంపుతానని ఏభైవేలు తీసుకుని-ఆయన్ని చంపడం అటుంచి కుక్కపిల్లలాగా ఆయన వెనక చేతులు కట్టుకుని నడుస్తున్నాడంటే జాకీని ఏమనుకోవాలి?

 

    క్లాస్ వన్ నమ్మకద్రోహం కాదా? జాకీ ద్రోహానికి తలపడ్డాడని సుబ్బారావుకి ఆ క్షణమే తోచింది.

 

    అంచేత---

 

    "ఒరే జాకీ" అంటూ అరుస్తూ అతనిమీదకి దూకేడు.

 

    జాకీ సుబ్బారావుని లాఘవంగా పట్టుకున్నాడు.

 

    సుబ్బారావు జాకీ చేతుల్లో చేపపిల్లలాగా గిలగిలా తన్నుకుంటూ అరుస్తున్నాడు---

 

    "దగా చేస్తావురా దొంగరాస్కెల్! ఫ్రండునన్నావ్. ప్రాణాలు కాపాడ్తాన్నావ్! ఏభైవేలు మింగేవ్! చివరాఖరికి నాకే ద్రోహం చేస్తావురా! వదిలిపెట్టు! ఊ..."

 

    జాకీ సుబ్బారావు మాటలు పట్టించుకోలేదు. తను పట్టిన ఉడుంపట్టు విడిచి పెట్టనూలేదు.

 

    సత్యం సుబ్బారావు వేపు ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తుంటే సుబ్బారావు అంటున్నాడు---

 

    "సార్! ఈ జాకీగాడ్ని నమ్మకండి సార్! వెన్నుపోటు పొడిచే రకం!"

 

    "నువ్వు చేసిందేమిటో?" అన్నాడు సత్యం.

 

    "క్షమించండి, బుద్ధి గడ్డితిని మీకిచ్చిన మాట తప్పేను. మిమ్మల్ని చంపించి పీడ విరగడ చేసుకుందామనుకున్నాను, తప్పు చేసేను సార్! పెద్ద ఫ్రాడే చేసేను!" అన్నాడు సుబ్బారావు.

 

    "డబ్బు సుబ్బారావ్ డబ్బు! అది మనిషి నేమైనా చేయగలదు. ఆనాడు డబ్బులేక చావాలనుకున్నావ్! డబ్బు కనిపించగానే నిన్ను ఆదుకున్న వాడిని చంపాలనుకున్నావ్!" అన్నాడు సత్యం.

 

    "వద్దుసార్! నన్ను మాటల్తో చంపొద్దు! అయామ్ రెడీ నవ్! ఉరితీయండి నన్ను సంతోషంగా చస్తాను. కాని, ఈ దగాకోర్ గాడిదను మాత్రం దూరంగా వుంచండి. కమాన్ సర్! ఉరి తీయండి నన్ను!"

 

    "మన అగ్రిమెంటు ప్రకారం రేపటి వరకు టైముంది. అంతవరకు ఈ ఇంట్లో బుద్ధిగా వుండు జాకీ-"

 

    "యస్సార్?"

 

    "ఇతన్ని కూడా కట్టేయ్!"

 

    జాకీ సుబ్బారావుని ఇంట్లోకి లాక్కుపోతున్నాడు.


                                    *  *  *


    డిసెంబరు 31, రాత్రి!

 

    ఊరంతా దీపాల్తో అలంకరించబడి వుంది. పాత సంవత్సరానికి వీడ్కోలివ్వడానికి కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

    లక్ష్మీపతి ఇంట్లో సందడిగా వుంది. పద్మని అలంకరిస్తున్నారు. లక్ష్మీపతి ఇల్లంతా హడావిడిగా తిరుగుతున్నాడు.

 

    ఊరి చివరి ఇల్లు-

 

    కృష్ణమూర్తి పక్కనే సుబ్బారావు కూడా కట్టివేయబడి వున్నాడు. ఊళ్ళో కోలాహలం మంద్రస్థాయిలో వినిపిస్తోంది. సుబ్బారావు చెబుతుంటే కృష్ణమూర్తి వింటున్నాడు.

 

    "నమ్మకద్రోహం చేసినందుకు నాకీ శిక్ష కావాల్సిందే!"

 

    కృష్ణమూర్తి నిట్టూర్చేడు.

 

    "టైమెంతై వుంటుందో?" అన్నాడు కృష్ణమూర్తి.

 

    "పది దాటొచ్చు!"

 

    "అంటే-సరిగ్గా రెండు గంటలే వుందిటైం! ఈలోగా మనం ఏదో విధంగా యిక్కడ్నించి తప్పించుకోవాలి. లేకపోతే - కొంపలంటు కుంటాయి!"

 

    "నాకు బుర్ర పనిచేయడం మానేసి చాలా కాలమైంది. ఆ ఆలోచన ఏదో నువ్వే చేయాలి!" అన్నాడు సుబ్బారావు.