లేడీ డాక్టరు దగ్గరకు వెళ్లడమే మంచిదా!

 

 

ప్రపంచంలో వంద మంది ప్రసిద్ధ వైద్యుల జాబితాను తయారుచేయమని అడిగితే.... అందులో బహుశా 90 శాతం మగవారే కనిపిస్తారు. కారణం స్పష్టమే! ఆడవారు ఎంత నైపుణ్యం చూపినా, దానిని సమాజం అంగీకరించేందుకు వెనుకడుగు వేస్తూనే ఉంటుంది. కానీ గణాంకాలను పరిశీలిస్తే, నిజాలు వేరేలా కనిపిస్తాయి. అందుకు ఉదాహరణగా ఓ పరిశోధన..


వైద్యాన్ని అందించడంలో మగ డాక్టర్లకీ, లేడీ డాక్టర్లకీ మధ్య వ్యత్యాసం ఉంటుందన్న విషయం ఎప్పుడోనే బయటపడింది. రోగులకు వైద్యం చేసేటప్పుడు లైడీ డాక్టర్లు నియమనిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారనీ, రోగులకు సమాచారాన్ని అందించడంలో లోటు రానివ్వరని పరిశోధకులు చెబుతూ ఉంటారు. ఇలాంటి పద్ధతుల వల్ల రోగులకు మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే అవి ఏకంగా రోగుల ప్రాణాలనే కాపాడుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది.


హార్వర్డు విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు స్త్రీ, పురుష వైద్యుల దగ్గరకి వెళ్లే రోగుల పరిస్థితి ఏమిటా అని గమనించారు. ఇందుకోసం 2011 – 14 మధ్య చికిత్స పొందని ఓ పదిలక్షల మంది రోగుల తీరును గమనించారు. వీరిలో లేడీ డాక్టర్ల దగ్గరకు వెళ్లిన రోగుల పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నట్లు తేలింది. మగ డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకున్న రోగులతో పోలిస్తే వీరు తిరిగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఓ ఐదు శాతం తక్కువగా ఉన్నట్లు బయటపడింది.


కేవలం ఆసుపత్రిలో చేరడమే కాదు.. లేడీ డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకున్న రోగుల ఆయుష్షు కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతరులతో పోలిస్తే వీరిలో అర్థంతరంగా చనిపోవడం అనేది ఓ ఐదు శాతం తక్కువగా కనిపించింది. అలా చూసుకుంటే పరిశోధకుల వద్ద ఉన్న రోగులలో దాదాపు 32,000 మంది ఆయుష్షు దీర్ఘంగా సాగినట్లు తేలింది.


అదీ విషయం! స్వభావసిద్ధంగా నియమనిబంధనలను అనుసరించే మనస్తత్వం వల్లనైతేనేం, రోగులతో ఉన్న సంబంధబాంధవ్యాల వల్లనైతేనేం... స్త్రీ వైద్యుల దగ్గర చికిత్స తీసుకునే రోగుల పరిస్థితి మెరుగ్గా అన్నట్లు ఈ పరిశోధనతో బయటపడింది. కానీ విచిత్రం ఏమిటంటే... మగ డాక్టర్లతో పోలిస్తే, లేడీ డాక్టర్లకు దాదాపు ఎనిమిది శాతం తక్కువ వేతనాలు లభిస్తాయట. అంతేకాదు! ఆసుపత్రులలో పనిచేసే లేడీ డాక్టర్లకు పదోన్నతుల విషయంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంటుందన్న ఆరోపణలూ ఉన్నాయి.

- నిర్జర.