సీత వచ్చి వెళ్ళి పోయింది. ఆమె అర్థంకాని అస్పష్ట ప్రవర్తన వేదితకు అంతుపట్టకపోయినా ఆమె వచ్చి వెళ్ళాక యెంత హాయి, అపరిమితానందం కలిగాయి? ఆమె సీతను నిండు హృదయంతో ప్రేమించింది.

 

    తలుపులుకూడా వేసుకోకుండా వేదిత నిద్రపోతోంది. తలుపులు వేసుకునే అలవాటు వాళ్ళకి ఎప్పుడూ లేదు. తమ యింట్లో విలువైన సంపద ఏముంది ఎవరయినా కొల్లగొట్టుకు పోవటానికి? సంపద ఏమయినా ఉంటే అది మనుషుల్లో ఉంది, హృదయాల్లో ఉంది.

 

    వేదిత నిర్మలంగా, గాఢంగా నిద్రపోతున్న ఆ సమయానికి కుటీరం బయట తోటలో ఓ చెట్టుక్రింద నిలబడి గంగరాజు వెక్కివెక్కి ఏడుస్తున్నాడు.

 

    గంగరాజును చూసి ఆ ఊళ్ళో అందరూ ఝడుసుకుంటారు. అతను రౌడి అనీ, దుర్వ్యసనపరుడనీ అతను నడుస్తూంటే గ్రామస్తులు దూరదూరంగా తొలగిపోతారు. భార్య గతించినప్పటినుంచీ అతన్లో ఓ విధమైన విరక్తీ, దిగులూ జనించాయి. అయితే అతనెప్పుడూ వాటిని అజ్ఞాతంగానే ఉంచాడుగాని బయటకు ఎవరితోనూ చెప్పుకోలేదు. అతనికి ప్రపంచంలో నా అన్నవారు లేరు. తల్లీ, తండ్రి, తోబుట్టువులూ ఎవరూ లేరు. అలా ఏకాకిగా తిరుగుతూండే గంగరాజుకు వేదిత దర్శనం ఓ నూతన స్పందన కలగజేసినట్లయింది. దేవాలయానికి అప్పుడప్పుడూ వెళ్ళే అతనికి ఆమె గానం, ఆమె ఉనికి, ఆమె వర్చస్సు, ఆమెలోని దివ్యత్వం ఆకర్షించి ముగ్ధుడ్ని చేసి ఆమెవైపు ఆకట్టుకున్నాయి. అతడామెకు అజ్ఞాత భక్తుడిగా, ఆరాధించే శిష్యునిగా తయారయాడు. ఆమె అతనికి ఓ తల్లిగా, సోదరిగా, కూతురిగా, దేవతగా, గోచరించి, ఆమె దర్శనంతోనే అతని నేత్రాలు చమరుస్తూ ఉండేవి. అయితే ఎప్పుడూ వెళ్ళి ఆమెను పలకరించి, మాట్లాడి ఎరుగడు. దూరం నుంచే చేతులు జోడించి ఆమెకు నమస్కరించి తిరిగి పోతూండేవాడు. అదే అతనికి అపరిమితానందాన్ని కలుగజేసేది. ఆమె అతన్ని ఎప్పుడూ సరిగ్గా చూసి కూడా ఉండదు. ఆమెను చాలా రోజులవరకూ చూడకుండా ఉంటే అతని మనస్సు కలతగా ఉండేది. వెంటనే దేవాలయానికి వెళ్ళి ఏదో ఓ మూలనుంచి ఆమెనుచూసి సంతృప్తిపడి వెళ్ళిపోతూండేవాడు. మొదట్లో ఈ మూగ మనోవేదన అతనికి అర్థమయ్యేది కాదు. కాని రాను రానూ దూరంగా దృగ్గోచరమయ్యే ఓ వెలుగు తన మనోనేత్రాన్ని వికసింపజేస్తున్నదన్న సత్యం స్ఫురించసాగింది.    

 

    ఆ వేదితనే, తాను దేవతగా ఎంచి పూజిస్తూన్న ఆ అనురాగమూర్తినే ఇప్పుడు తన చేతుల్తో ఆహుతి చేయబోతున్నాడు. అంతే, అలా జరగాలి, తను ఆపే స్థితిలో లేడు. చెయ్యి దాటిపోయింది. 'దొరా! నా మొర ఆలకించు ఆపదల్ని కోరి తెచ్చుకోకు. ఈనా ఒక్క ప్రార్థనా మన్నించు, ఆమ్మ జోలికి నువ్వు పోకు. అసలు నీకీ పాపపు తలంపు ఎలా పుట్టింది? నీకాళ్లు పట్టుకుని వేడుకుంటాను. ఈ పని మానెయ్యి, ఈ పరమ కిరాతకం నాతో చేయించకు. హాయిగా సాగే బతుకులో నిప్పులు పోసుకోకు'. అని అతను శేషశాయిని హెచ్చరిద్దామనుకున్నాడు. కాని అతను శూలాల్లాంటి మాటలతో తన నోరు, మనసు కట్టేశాడు. అతను తన ప్రాణరక్షకుడు. తనని అజ్ఞాబద్ధుడిని చేశాడు. కృతజ్ఞత చూపించే కిరాతకుడిగా తను తయారయాడు.  

 

    ఏ చెట్టుమీద నుంచో గుడ్లగూబ కూసింది. గాలికి ఆకులు కదిలి గలగలమన్నాయి. భయమంటే యెరుగని గంగరాజుకు ఆ క్షణంలో వళ్ళు జలదరించింది. గుడివైపు తిరిగి "స్వామీ! నన్ను క్షమించు" అని మనస్సులో ప్రార్థించాడు. మెల్లిగా కదిలి, గుండెను చిక్క పెట్టుకుని వేదిత కుటీరంవైపు నడిచిపోసాగాడు.

 

    వేదితకు ఆకస్మికంగా మెలకువ వచ్చింది. ఈ మెలకువ రావటంలో స్వాభావికం ఏమీ కనబడకపోయేసరికి ఆమె కనులు వెడల్పు చేసి నలువైపులా చూడటానికి ప్రయత్నించింది. గదంతా చీకటిగా ఉంది. గోడనున్న దీపం ఎప్పుడు కొండెక్కిందో తెలియదు. లేచి వెలిగిద్దామా అనుకుంది. ఇప్పుడు వేళ ఎంతయి ఉంటుందో! ఆమె లేద్దామని అనుకుంటూండగా ఆ చీకట్లో అడుగుల చప్పుడు కాసాగాయి. ఎవరన్నా ప్రవేశించారా తమ యింట్లో? యెన్నడూ లేనిది ఈరోజు ఎలా సంభవించింది? అయినా తమ పేద కుటీరంలో ఏమి లభిస్తుంది దొంగలకు? ఆమెకు నవ్వు వచ్చింది.

 

    అడుగుల చప్పుడు రాను రానూ ఆమె దగ్గరకు రాసాగాయి. వేదిత భయపడలేదు. యేం జరుగుతుందోనని చూస్తోంది. అడుగులు ఆమెను మరీ సమీపించి నిలిచిపోయాయి. చీకటిలో ఏదో నీడ కదిలినట్లయింది, ఎవరిదో ఊపిరి బరువుగా వినిపిస్తోంది. తన మీదకు ఎవరో వంగుతున్నట్లు గ్రహించింది ఆమె. అంతే, వెంటనే ఓ బలమయిన చెయ్యి ఆమె నోటిమీద పడింది. ఏం జరుగుతుందో అర్థంకాక గట్టిగా విదిలించుకోవటానికి ప్రయత్నించింది. కాని అవతలవ్యక్తి బలంముందు ఆమె శక్తి ఎందుకూ పనికిరాలేదు. చేతిని నోటిపైనే నొక్కివుంచి, రెండవ చేత్తో అమాంతం ఆమెను పైకి లేవదీసి, కదలకుండా గట్టిగా బంధించి మెరుపులా బయటకు వెళ్ళిపోతున్నాడు. అంతా క్షణంలో జరిగినట్లయింది. ఊహ కందనంత వేగంతో జరిగిపోయింది. ఆమెను పట్టుకుని బయటకు వచ్చి, ఆ చీకట్లో అవలీలగా తోటను దాటేసి, దేవాలయం వెలుపలికి వచ్చి ఏటివైపుగా వెళ్ళిపోతున్నాడు. ఇది కలా, నిజమా అనుకుంది వేదిత. కాళ్ళూ చేతులూ విదిలించటానికి ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. తన నోటిమీద ఉన్న అతని చేతిని తోసేద్దామని ప్రయత్నించింది. ఆమెవల్ల కాలేదు. ఇహ బలహీనత ఆవరించగా విసిగి, హతాశురాలయి పర్యవసానం విధికి వదిలివేసి ఊరుకుంది.

 

    ఆ వ్యక్తి అతి వేగంగా అలా ఓ పదినిమిషాలు నడిచాడు. ఆయాసంతో వగరుస్తున్నాడు. ఏరు పారుతున్న ధ్వని వినిపిస్తోంది వేదితకు. అతను ఏరు దాటేశాడు. తర్వాత కొంతదూరం పోయాక ఒంగుని తనని ఏదో పాకలోకి తీసుకు వెళ్ళుతున్నట్లు గ్రహించింది ఆమె.

 

    "ఇదిగో తెచ్చాను" ఓ కఠినమయిన స్వరం పలికి, ఆమెను క్రిందికి దింపివేయటం జరిగింది. తర్వాత ఆ వ్యక్తి విసురుగా బయటకు దూసుకుపోవటం కనిపించింది.