హాలీడేస్.. కేవలం జాలీ డేస్ కాదు!

 

 

దాదాపు పిల్లలందరికీ పరీక్షలు అయిపోయినట్టే. కొందరికి ఆల్రెడీ సెలవులు ఇచ్చేశారు. మిగతావాళ్లకి ఇంకో వారంలో ఇచ్చేస్తారు. మరి మీ పిల్లల హాలీడేస్ ని మీరెలా ప్లాన్ చేస్తున్నారు? హాలీడేస్ ప్లాన్ చేయడానికేముంటుంది అనుకుంటున్నారు కదా! అదే పొరపాటు. పిల్లల చదువులే కాదు... వాళ్ల సెలవుల్ని కూడా ప్లాన్ చేయడమే గుడ్ పేరెంటింగ్.

సెలవులంటే ఆడిపాడటానికి, సరదాగా ఎంజాయ్ చేయడానికి, విశ్రాంతి తీసుకోడానికి అన్న భావనే మనందరిలోనూ ఉంది. అది తప్పు కూడా కాదు. అయితే సెలవుల్ని వాటికి మాత్రమే కేటాయించడం మాత్రం కరెక్ట్ కాదు. హాలీడేస్ ని జాలీగా ఎంజాయ్ చేయడంతో పాటు కొన్ని మంచి అలవాట్లను పెంచుకోడానికి, అభిరుచుల్ని అలవర్చుకోడానికి, ఆల్రెడీ తమలో ఉన్న ప్రతిభకు మరింత మెరుగు దిద్దుకోడానికి ఉపయోగించుకోడాలన్న విషయాన్ని మీ పిల్లలకు ఈసారి తెలియజేయండి. అలా చేయాలంటే ముందు మీరు వాళ్ల హాలీడేస్ ని ప్లాన్ చేయండి.

- బడి ఉండదు కాబట్టి పొద్దున్నే లేవాల్సిన పని లేదు అనుకుంటారు పిల్లలు. మనం కూడా పోనీలే అని వదిలేస్తాం. మొదటి వారం రోజులు మాత్రమే అలా వదిలేయండి. సెలవులన్నాళ్లూ వదిలేశారో... అదే అలవాటైపోతుంది. స్కూలు మొదలయ్యాక సతాయిస్తారు. కాబట్టి మరీ పొద్దున్నే కాకపోయినా కాస్త త్వరగా లేపేయండి. అలాగే ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రేపు మీరు ఇలా గడపాలి, ఈ పనులు చేయాలి అంటూ ఓ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. దానివల్ల వాళ్లకి రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుస్తుంది.

- మీ పిల్లలకి ఏమంటే ఇష్టమో తెలుసుకోండి. మ్యూజిక్, డ్యాన్స్, స్విమ్మింగ్, పెయింటింగ్.. వాళ్ల అభిరుచి ఏదైనా సరే... అందులో శిక్షణ తీసుకోడానికి సెలవుల్ని మించిన సమయం మరొకటి దొరకదు. కాబట్టి వెంటనే చేర్పించండి. అయితే అది వాళ్ల ఇష్టమై ఉండాలి. ఇష్టం లేనిది చేయమని మాత్రం బలవంతపెట్టకండి. మీ అభిరుచుల్ని వాళ్లపై రుద్దకండి.

- మీరు రోజూ ఏదో ఒక సమయంలో ఒక గంటపాటు వేరే ఏ పనీ పెట్టుకోకుండా పిల్లలతో గడపండి. ఆ సమయంలో వాళ్లకి మంచి విషయాలు చెప్పండి. దేశం కోసం పోరాడిన యోధుల చరిత్రలు, గొప్ప గొప్ప పనులు చేసిన మహానుభావుల జీవితాల గురించి చెప్పండి. వాళ్లు ఎలా ఆ స్థాయికి చేరుకున్నారో తెలియజేయండి. మీ పిల్లల వ్యక్తిత్వ రూపుకల్పనలో ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. అలాగే మనీ సేవింగ్ వంటి ఉపయోగకరమైన విషయాల గురించి కూడా వివరించండి.

- చాలామంది పిల్లలకి ఎక్కువ పని చెప్పరు. రోజంతా స్కూల్లో అలసిపోతారు కదా అనుకుంటారు. ఒక్కోసారి చెప్పినా పిల్లలు చేయరు. హోమ్ వర్క్ ఉందనో ఆడుకోవాలనో చెప్పి తప్పించుకుంటారు. వాళ్లని దారిలో పెట్టడానికి ఇదే సరైన సమయం. సెలవుల్లో పిల్లలకి అడపా దడపా ఏదో ఒక పని చెప్పండి. మీ ఇంటి పనిలో వంట పనిలో సాయం చేయమనండి. ఇల్లు సర్దమనండి. మొక్కలకు నీళ్లు పోయమనండి. పెంపుడు జంతువులు ఉంటే వాటికి స్నానం చేయించమనండి. దానివల్ల బాధ్యతలు పంచుకోవడం మెల్లగా అలవాటవుతుంది.

- సెలవులన్నాళ్లూ పిల్లల పనులు మీరేమీ చేయకండి. లేచిన తర్వాత పక్క సర్దుకోవడం దగ్గర్నుంచి పడుకునేముందు బ్రష్ చేసుకోవడం వరకూ ప్రతి పనీ వాళ్లే చేయాలి. ఏ పనిలోనూ మీరు కల్పించుకోవద్దు. అలా చేస్తే వాళ్లకి ఓ క్రమశిక్షణ అలవాటవుతుంది. దాంతో బడి తెరిచిన తర్వాత కూడా అలవాటు ప్రకారం వాళ్ల పనులు వాళ్లు చేసేసుకుంటారు. మీకు శ్రమ తగ్గుతుంది.

- వారానికి రెండు రోజులు, కుదరకపోతే కనీసం ఒక్కరోజు వాళ్లని బైటికి తీసుకెళ్లండి. బైటికంటే సినిమాకో షాపింగుకో కాదు. వాటికీ తీసుకెళ్లాలి. అయితే వాటితో పాటు ఏ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో, శారీరక మానసిక వైకల్యం ఉన్న పిల్లల దగ్గరకో తీసుకెళ్లండి. వాళ్లతో గడపమనండి. మీరు తీసుకెళ్లిన పండో ఫలమో వాళ్లకి ఇప్పించండి. దీనివల్ల మీ పిల్లలు చాలా నేర్చుకుంటారు. ఇవ్వడంలోని ఆనందం వాళ్లకి తెలుస్తుంది. తమ దగ్గర ఉన్న సంతోషం చాలామంది దగ్గర లేదని తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో అత్యాశలకు పోకుండా, తమకంటే గొప్పవారితో పోల్చుకుని అసంతృప్తి చెందకుండా ఉన్నదానితో తృప్తిగా బతకడం ఎలాగో అర్థమవుతుంది.

- సెలవుల్లో ఏదైనా ఊరు వెళ్లాలనుకుంటే... ఏదైనా చారిత్రక నేపథ్యం ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లండి. సరదాగా గడపడంతో పాటు విజ్ఞానం కూడా కూడా పెరుగుతుంది.

ఈసారి పిల్లల హాలీడేస్ ని ఇలా ప్లాన్ చేసి చూడండి. కచ్చితంగా మీ పిల్లల్లో మీకు తెలియని మార్పు కనిపిస్తుంది. మీక్కూడా మీ  బుజ్జాయిల భవిష్యత్తు అందంగా కనిపిస్తుంది.

- Sameera