"ఇంత స్వల్ప విషయానికింత రాద్దాంతం కూడని పని" అన్నాడు మందలింపుగా సూరిని చూస్తూ.
    
    సూరి రియాక్ట్ కాలేదు. కూల్ గా వ్యవహారాన్ని సాధించాలని వచ్చాడు తప్ప పేచీ పడటం అతడికీ యిష్టం లేదు.
    
    "మీ ఆధ్వర్యంలో మన యూనివర్శిటీ పక్షపాత ధోరణులుకి అతీతంగా ఎంత పురోభివృద్ది చెందిందీ విద్యార్ధులందరికీ తెలుసు. ఇప్పుడు మీరే యూనిలెటరల్ గా ఇలా నిర్ణయం తీసుకుంటే మేం ఎవరితో చెప్పుకోవాలి?"
    
    కొద్దిగా చల్లబడ్డాడు వీసీ. "నన్నేం చేయమంటారు?"
    
    "సమర్దుల్ని ఎంపిక చేయండి."
    
    "మిస్ ప్రబంధ మూడుసార్లు రాష్ట్రస్థాయిలో ఎన్నికైన వ్యక్తి."
    
    "ఆమె విషయంలో మాకు కంప్లెయింట్ లేదు. మీరిప్పుడు మార్చాల్సింది సుధీర్ ని" సూరి అభ్యర్ధనగా చూశాడు.
    
    "కానీ ఎలా? మీ యూనియన్ లీడర్ మీ తరపున ప్రపోజ్ చేసింది ఆ ఇద్దర్ని."
    
    "మా విద్యార్ధి సంఘం ఉనికికి అర్ధం మీపరంగా మాకు ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడమే తప్ప, మా వ్యవహారాల్లో తల దూర్చడము కాదు" సూరి నచ్చచెబుతున్నట్టుగా అన్నాడు "సరే! ఇది మన యూనివర్శిటీ రెప్యుటేషన్ కి సంబంధించిన విషయం. అంతర్గతంగా మనకెన్ని సమస్యలున్నా ఇంటర్ యూనివర్శిటీ పోటీల్లో అర్భకుడిని పంపి మనకు మనం కళంకాన్ని ఆపాదించుకోవడం దారుణం. నిజానికి నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. శౌరి కాదు."
    
    వీసీ ఇబ్బందిగా చూస్తూ వుండిపోయాడు.
    
    ప్రబంధతోపాటు ఆహ్దిత్యని పంపడం న్యాయమని శౌరి ముందే రిజిస్ట్రార్ చెప్పినప్పుడు శౌరి ఎంత బలంగా రియాక్టయ్యిందీ అతడికి గుర్తుంది.
    
    అసలు ప్రబంధే అంగీకరించదని శౌరి చెప్పినప్పుడు ఒక ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తుల ఆలోచనకి భిన్నంగా ఎలా నిర్ణయించుకోగలడు?"
    
    "ఓకే!" చాలాసేపు ఆలోచించాక అన్నాడు వైస్ ఛాన్సలర్, "సమర్దుల్ని పంపడం నాకు ఆమోదయోగ్యమైన విషయమే కాబట్టి రెండు మూడురోజుల్లో ఓ నిర్ణయానికి వద్దాం."
    
    "ఎలా?" అనడిగాడు సూరి.
    
    "ఈ యూనివర్శిటీలో కాని, దీనికి అనుబంధంగా వున్న కాలేజీల్లో కాని ఇంకా చాలామంది స్పార్క్ వున్న విద్యార్ధులు వుండొచ్చు. మూడురోజుల్లో మన యూనివర్శిటీ ప్రొఫెసర్స్ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజ్ క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి, అందులో ఇద్దర్ని ఎంపిక చేద్దాం. కాంపిటీషన్ లో కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్ధులకేకాక అనుబంధ కళాశాలల్లోని డిగ్రీ స్టూడెంట్స్ కీ అవకాశమిద్దాం."
    
    అంగీకరించారు విద్యార్ధులంతా.
    
    వెంటనే యుద్దప్రాతిపదికపైన ఆ విషయం అనుబంధంగా వున్న డిగ్రీ కాలేజెస్ కి వర్తమానంగా వెళ్ళింది.
    
    ప్రబంధ, సుధీర్ ల పేర్లున్న సర్క్యులర్ ను మేనేజ్ మెంట్ ఉపసంహరించుకోవడంతో విద్యార్ధులు శాంతించారు.
    
    శౌరికి ఇది మరో ఓటమి.
    
    ప్రబంధ ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు కాని శౌరి మాత్రం ప్రశాంతంగా వుండలేకపోయాడు. తన వ్యక్తిగతమైన పరపతి క్రమంగా హరించుకుపోతున్నట్టు అనిపిస్తోంది.
    
    మరోలా కక్ష తీర్చుకోవడమే శౌరి ధ్యేయమైతే ఈ పాటికి సూరి, ఆదిత్యల పేర్లను జనాభా లెక్కల్లోనుంచి తొలగించేసి తనే సంతాపసభ నిర్వహించేవాడు. కాని ఇది మేధకి సంబంధించిన పోటీ.
    
    పరిష్కారమార్గం తెలీని శౌరి తనమితుర్లతో కలిసి ఆరాత్రి మందు కొడుతూ మధనపడిపోతున్నాడు.
    
    అంతకన్నా ఎక్కువ సంఘర్షణకు లోనవుతున్నది సుధీర్. ఒక అవసరార్ధం శౌరి తన పేరుని ఇరికించినా, అది ప్రబంధతో పరిచయానికి దోహదంచేస్తుందని అంతదాకా చాలా ఉత్సాహపడిన సుధీర్ ఇప్పుడు అవకాశం జారిపోతుందన్న బాధతో అవసరానికి మించి తాగి కుమిలి పోతున్నాడు.
    
    "లాభంలేదు శౌరీ! నువ్వు బలాన్ని పుంజుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారంకాదు. ఆఫ్ట్రాల్ ఓ అనామకుడిలా పడివున్న ఆదిత్య గ్రాఫ్ అలా పెరిగిపోవడం నీ ఉనికికి చాలా ప్రమాదం. ఈసారి వాడు ఓడి తీరాలి. లేనినాడు మీ వంశానికే అది కళంకం."
    
    "కాని ఎలా?"
    
    "క్విజ్ మాస్టర్ ఓ సీనియర్ ప్రొఫెసర్ వుంటాడీసారి."
    
    "అయితే?"
    
    "అడగాల్సిన ప్రశ్నల్ని ముందు ఆయన సిద్దం చేసుకుంటాడుగా?"
    
    శౌరి కళ్ళల్లో సన్నని మెరుపు.
    
    "ఈసారి ఓడితే మీ చెల్లెలు ఆరోగ్యం ఏ స్థాయికి దిగజారుతుందో తెలీదు కాబట్టి...
    
    నిజమే! ప్రబంధ మానసికంగా చాలా అలసి ఉన్మాదిలా ప్రవర్తిస్తోంది.
    
    "చెప్పు" సాలోచనగా అన్నాడు శౌరి.
    
    "బహుశా మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ రాధాకృష్ణ ఈసారి క్విజ్ మాస్టర్ గా అంతా నిర్వహిస్తాడు. అతడు సీనియర్ ప్రొఫెసర్ గా రేపు వైస్ ఛాన్సలర్ అయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు కాబట్టి ఒక రాష్ట్రముఖ్యమంత్రి కొడుగ్గా అగడబోయే ప్రశ్నల్ని ముందే తెలుసుకోవడం కష్టం కాదనుకుంటాను."
    
    సుధీర్ తర్కాన్ని అభినందించకుండా వుండలేకపోయాడు శౌరి. ఆ మాత్రం చాలు వ్యవహారం నడపడానికి.
    
    మరుసటిరోజు ఉదయం పదిగంటలకన్నా శౌరికి మరో ముఖ్యమైన వార్త తెలిసింది. అది ఆదిత్య క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొనటానికి నిరాకరించాడని.
    
    దానికి కారణం హాస్పిటల్లో అతడి నాన్నమ్మ అడ్మిట్ కావటం.
    
    సమస్య దానంతట అదే పరిష్కారం కావడం శౌరికి చాలా ఆనందకరమైన విషయమైపోయింది.