జనం నోరు మూయించిన ‘నల్లపిల్ల’

 


ఇది నలుపు తెలుపుల ప్రపంచం. పైకి ఎన్ని కబుర్లు వినిపించినా తెల్లగా ఉండేవారి పట్లే మోజు ఎక్కువగా ఉంటుంది. నల్లగా ఉండేవారి పట్ల వివక్షా ఉంటుంది. ఆడవారి విషయంలో అయితే చెప్పనే అక్కర్లేదు. వాళ్లు తెల్లగా అయ్యే క్రీంని రాసుకుంటేనే విజయాలను సాధిస్తారంటూ బహిరంగంగానే ప్రకటనలు కనిపిస్తుంటాయి. అలాంటిది ఒక కారు నలుపు రంగులో ఉన్న అమ్మాయి ఏం చేయాలి. ‘నన్ను ఇలా ఎందుకు పుట్టించావురా భగవంతుడా!’ అంటూ జీవితాంతం కుమిలికుమిలి ఏడుస్తూ బతకాలా?’ ఈ ప్రశ్నకు సమాధానం ఖౌదియా (Khoudia) దగ్గర ఉంది...

 

 

ఖౌదియా ఆఫ్రికా ఖండంలోని సెనగల్‌ దేశంలో పుట్టింది. ఆమెకు 15 ఏళ్లు వచ్చేసరికి కుటుంబం, ఫ్యాషన్‌ ప్రపంచం అయిన ఫ్రాన్స్‌లో స్థిరపడింది. ఖౌదియా బాగా నల్లగా ఉండేది. దాంతో సహజంగానే ఆమె తీవ్రమైన వివక్షకు గురయ్యేది. చిన్నప్పటి నుంచీ ఆమెను తోటి పిల్లలు వెంటాడి వెంటాడి ఏడిపించేవారు. ఇక ఫ్రాన్స్‌లోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. నలుగురిలోనూ భిన్నంగా కనిపించే ఆమె ఒంటి రంగుని చూడగానే ఆకతాయిల మాటలకు హద్దులుండేవి కావు.

 

 

‘నన్ను ఏడిపించేవారిని చూసీచూసీ... నన్ను నేనే ప్రేమించుకోవాలని నిశ్చయించుకున్నాను. విమర్శించేవారిని నిదానంగా పట్టించుకోవడం మానేశాను. ఆ దృక్పథం నాకు ఎంతగానో ఉపయోగపడింది,’ అంటుంది ఖౌదియా. అలా ఎదిగిన విశ్వాసంతో ఖౌదియా రెండేళ్ల క్రితం మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించింది. తెలుపు రంగుకి మాత్రమే ప్రాధాన్యత ఉన్న రంగంలోనే తనేమిటో నిరూపించుకోవాలనుకుంది. అలా తొలిసారి నల్లజాతీయులకు సంబంధించిన ఒక ఫొటోషూట్‌లో స్థానాన్ని సంపాదించింది.

 

 

తొలి ఫొటోషూట్‌ తరువాత ఖౌదియాకు నిదానంగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. కానీ అదే స్థాయిలో విమర్శలూ వినిపించసాగాయి. ‘నల్ల పిల్ల’, ‘చీకటి పిల్ల’ లాంటి మారుపేర్లతో ఆమెను పిలవడం మొదలుపెట్టారు. కానీ ఖౌదియా అవేవీ పట్టించుకోలేదు సరికదా... ఇంకా దూకుడుగా అవకాశాల కోసం ప్రయత్నించసాగింది. ‘నన్ను వాళ్లు నానారకాల పేర్లతోనూ ఏడిపించేందుకు ప్రయత్నించేవారు. నా రంగుని చూసి నేను బాధపడాలని వాళ్లు కోరుకునేవారు. కానీ నన్ను నా రంగుతో పిలిచిని ప్రతి పిలుపునీ నేను ప్రేమించాను. వాళ్లకి నేనేమిటో నిరూపించాలని అనుకున్నాను,’ అంటుంది ఖౌదియా.
ఖౌదియాకు ఇప్పుడు 19 ఏళ్లు. ఆమె ఆత్మవిశ్వాసాన్నీ, పట్టుదలనీ చూసిన The Colored Girl Inc అనే సంస్థ ఆమె మోడలింగ్‌ బాధ్యతలు చూసుకునేందుకు ముందుకువచ్చింది. ఖౌదియా ఇప్పుడో సెలబ్రెటీ! ప్యారిస్‌, న్యూయార్క్‌ ఫ్యాషన్‌ ప్రపంచంలో ఆమె పేరు విననివారు ఉండరు. ఖౌదియా ఇన్‌స్టాగ్రాం అకౌంటుని తెరవగానే దాదాపు మూడులక్షల మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు... ఆమె విజయం ఏ స్థాయికి చేరుకుందో!

 

 

 

ఖౌదియా ఏదో అనుకోకుండా ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు- ‘ఆడవాళ్లు నలుపు రంగులో ఉన్నప్పటికీ, వాళ్ల కలలన్నింటినీ నిజం చేసుకోవచ్చు అని నిరూపించేందుకే ఈ రంగంలోకి అడుగుపెట్టానని’ అంటోంది. అంతేకాదు! ‘అందానికి నిర్వచనం ఇదీ అనీ... నువ్వు ఇలాగే కనిపించాలనీ చెప్పే అధికారం ఎవ్వరికీ లేద’ని ఖచ్చితంగా చెప్పేస్తోంది. మన అందం పట్ల విశ్వాసం ఉన్నంతవరకూ, బయటకి ఎలా కనిపించామన్నది ఎమాత్రం ముఖ్యం కాదన్నది ఖౌదియా వాదన. ఖౌదియా విజయం వేలాదిమంది నల్లజాతీయులకు ఓ ప్రేరణగా నిలుస్తోంది. కొందరైతే ఏకంగా ఆమెను అనుసరిస్తూ ఫ్యాషన్‌ ప్రపంచంలో అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు- ‘ఈ ఫ్యాషన్‌ సామ్రాజ్యంలో చాలామంది నల్లజాతీయులకు చోటు ఉంది,’ అంటూ వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది ఖౌదియా.

-నిర్జర.