బలవంతుడైన అబ్దుల్ గోడకున్న కత్తిని అందుకుని ముందు కడుగేశాడు. అతని ఎడంచేయి లైట్ స్విచ్ ను వెతుకుతోంది!
    
    "కౌన్ హై లే తుమ్ ఆప్... ఆప్... మై సఫాకర్ దూంగా ఆప్. బోసడికా...." అబ్దుల్ గొంతు అంతకంతకు పెరగడాన్ని సహించలేకపోతున్నాడు బబ్లూ.
    
    మసక వెలుగులో అబ్దుల్ కదలికల్ని గమనిస్తున్న బబ్లూ ఒక్కసారి అబ్దుల్ మీదపడి, అతని చేతిలోని కత్తిని లాక్కోబోయాడు.
    
    పెనుగులాట జరిగింది.
    
    ఆ పెనుగులాటలో అబ్దుల్ చేతిలోని మాంసంకత్తి విసురుగా రెండుసార్లు గాల్లో కదలాడింది.
    
    ఒకదెబ్బ బబ్లూ భుజమ్మీద పడడం చర్మం పైకిలేచి, రక్తం బొటబొటా కారడం వెంటవెంటనే జరిగిపోయాయి.
    
    "అరే బుడ్దా..." అని కోపంగా బలాన్నంతా కూడదీసుకుని అబ్దుల్ ని ముందుకు తోసేసాడు బబ్లూ.
    
    అబ్దుల్ కిందపడిపోయాడు - కిందపడిన అబ్దుల్ కెవ్వున కేకవేసాడు.
    
    భయవిహ్వలంగా కొట్టుకుంటూ అరుస్తున్నాడు - అంతవరకూ సమయంకోసం ఎదురుచూస్తున్న నిరంజనరావు-
    
    రూమ్ లైటు వేశాడు.
    
    లైటు ఒక్కసారి ముఖమ్మీద పడడంతో ఇంకోవ్యక్తి అక్కడున్నాడని తెలీని బబ్లూ పడగవిప్పిన పాములా తలతిప్పి అక్కడ-
    
    అసహ్యంగా నిరంజనరావుని చూసి-
        
    గబగబా ఆ రూమ్ లోంచి బయటకు పరుగెత్తాడు.
    
    అప్పటికే చుట్టుపక్కల ఇళ్ళల్లో ఒక్కొక్కలైతూ వెలుగుతున్నాయి. కొంతమంది రోడ్డుమీదకొస్తున్నారు.
    
    గల్లీలోంచి వేగంగా చివరవరకూ వచ్చి, మారుతీ కారెక్కాడు బబ్లూ....
    
    ఆ కారు గల్లీలో విసురుగా తిరుగుతూ మెయిన్ రోడ్ పట్టడానికి ఇరవై నిమిషాల టైమ్ పట్టింది.
    
                                                         *    *    *    *    *
    
    బబ్లూతో పెనుగులాటలో మాంసం కత్తి కిందపడడం పైన అబ్దుల్ పడడంతో కత్తి నేరుగా గుండెల్లోకి దిగడంతో తనకత్తికి తనే బలైపోయాడు.
    
    అబ్దుల్...
    
    మరో నలభై నిమిషాల తర్వాత పోలీసులొచ్చారు.
    
    మెయిన్ బజార్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ అక్కడ నిరంజనరావుని చూసి ఆశ్చర్యపోయాడు - అతనొకప్పుడు మంగళ్ హాట్ లో నిరంజనరావు దగ్గర పనిచేశాడు.
    
    "ఓల్డ్ ఫ్రెండ్ అబ్దుల్ - జస్ట్ చూడ్డానికి వచ్చాను...." అదే సమయంలో అతని కలికి ఒక వస్తువు తగిలితే చేత్తో తీసి పట్టుకుని తడిమిచూశాడు నిరంజనరావు.
    
    లైటర్!
    
    బబ్లూ చేతిలోని లైటర్!
    
    "హతుడి రక్తంతోపాటు, హంతకుడి రక్తంకూడా కిందపడింది...." క్లూ దొరికిందన్న ఆనందంతో చిన్నగా అరుస్తూ అన్నాడు సర్కిల్ ఇన్స్ పెక్టర్.
        
    "అర్జంటుగా ఫోరెన్సిక్ స్పెషలిస్టుల్ని పిలవండి..." నిరంజనరావు చెప్పినట్లుగానే చేశాడు ఆ సి.ఐ.
    
                                                    *    *    *    *    *
        
    ఫోరెన్సిక్ లాబ్ లోంచి బయటికొచ్చాడు నిరంజనరావు.... ప్రొఫెసర్ మధుసూదన్ రిపోర్ట్ ఇచ్చినా, బబ్లూ శరీరంలోంచి రాలిపడిన రక్తం పెద్దగా క్లూ ఇవ్వలేదు.
    
    పొట్యాటెడ్ బ్లడ్..... లీడ్స్ టు సో మెనీ సెక్సువల్ ఆర్ - బ్యూటర్ కిల్లింగ్స్.... ఆ మాట విని భయపడ్డాడు నిరంజనరావు!
    
    తన దగ్గరున్న ఏకైక క్లూ గోల్డెన్ లైటర్!
    
    ఆ లైటర్ ని ఎనలైజ్ చేయగా దానిమీద వేలిముద్రలు లేకుండా బబ్లూ జాగ్రత్తపడినట్లు తెలిసి ఒక్కసారి నిస్పృహకు గురయ్యాడు నిరంజనరావు.
    
    మరో ప్రక్క ఉస్మానియా సౌత్ బ్లాక్ బాంబ్ బ్లాస్ట్ కు పవర్ ఫుల్ ఆర్.డి. ఎక్స్ ప్రేలుడు పదార్ధం వాడారని వార్తల్లో విని ఖిన్నుడయ్యాడాయన.
    
    హాస్పిటల్ లో ఉన్న రబ్ జానీ అనేవ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపడానికి ఆ బాంబ్ బ్లాస్ట్ ని ప్రయోగించారని పోలీసులు ప్రాధమిక సమాచారం ప్రతిరోజూ న్యూస్ లో ఫాలో అవుతున్న నిరంజనరావు ఎక్కడో మనసు పొరల్లో కలిగిన చిన్న ఆలోచన...
    
    ఈ బాంబ్ బ్లాస్ట్ కు కారణం బబ్లూనా కాదా?
    
    బబ్లూ తనకు దొరకడా?
    
    తను ఫోరెన్సిక్ లాబ్ నుంచి వచ్చేసేముందు ప్రొఫెసర్ మధుసూదన్ చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది.
    
    "మీకు తెలుసు..... సెక్సువల్ కిల్లర్, మాస్ కిల్లర్ బ్రూటల్ కిల్లర్ మనస్తత్వం కిల్లింగ్ ఇన్ స్టింక్ పెరుగుతున్నకొద్దీ బయట ప్రపంచంలో చాలాసాఫ్ట్ గా కనిపిస్తాడు.... కానీ అతని ఆలోచన, అన్వేషణ ఎప్పుడూ ఎలిబీల్ని నాశనం చెయ్యడమే!
    
    అందుకోసం అతను మీమీద డైరెక్టు దాడికోసమే పూనుకోవచ్చు.....ఎందుకంటే...." ఆగాడాయన.
    
    "అయామ్ బ్లయిండ్... కదూ..."
    
    ఆ విషయం జ్ఞాపకానికొచ్చిన వెంటనే నిరంజనరావు ప్రతి క్షణం ప్రతి శబ్దాన్ని నిశితంగా పరిశీలించసాగాడు.
    
                                                   *    *    *    *    *
    
    ఫోరెన్సిక్ ప్రొఫెసర్ మధుసూదన్ చెప్పింది అక్షరాల కరెక్ట్... తనకోసం నిరంజనరావు హంట్ చేస్తున్నాడన్న విషయం మొట్టమొదటి సారి తెలుసుకున్న బబ్లూ డెడ్ లీ సీరియస్ గా ఆలోచించడం మొదలుపెట్టాడు.
    
    తను చేసిన పొరపాటు వెంటనే గుర్తుకొచ్చిండతనికి.... అబ్దుల్, ఇంటిలో జారిపోయిన లైటర్... సిగరెట్ లైటర్...
    
    చిన్నదైనా పెద్దదైనా క్లూ ఎంత ప్రమాదకర విషయమో అతనికి చాలా స్పష్టంగా తెలుసు.
    
    ఆ లైటర్ ని తనెక్కడ కొన్నాడో గుర్తుతెచ్చుకున్నాడు.... ఆ పైన ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు.
    
    లకడికాపూల్ లోని హోటల్ అశోకా కాంపౌండులో ఉన్న కస్టమ్స్ ఎప్రూవ్ డ్ ఫారిన్ నావెల్టీస్ షాపులోకి బయలుదేరాడు.
    
                                                   *    *    *    *    *