"ఒకసారి మిర్రర్ లో చూసుకో...." హేండ్ మిర్రర్ ని బబ్లూకి అందిస్తూ అన్నాడు డాక్టర్ పర్నేష్ ప్లాస్టిక్ పళ్ళు, స్టీల్ రాడ్ ఇప్పుడేవీ లేవు. స్టీల్ రాడ్ మాయమైపోగానే, తన ముఖంలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోయాడు బబ్లూ.
    
    "కొన్నాళ్ళు నువ్వు గట్టి పదార్ధాలు వాడకూడదు....అలాగే మెడిసన్స్ ని తప్పకుండా రెగ్యులర్ గా వాడాలి..." చెప్పాడు పర్నేష్.
    
    "నేనెప్పుడు సిటీ వదిలి పోవచ్చు...."
    
    "ఇన్ ఫెక్షన్ లాంటిది తలెత్తకుండా ఇంజక్షన్ చేశాను.... పర్వాలేదని నేననుకొంటే.... నిన్ను డిస్ ఛార్జి చేస్తాను... ఏం అర్జంటుగా వెళ్ళి ఏదైనా మర్డర్ చెయ్యాలా..." జోకేసాడు పర్నేష్. నవ్వాడు బబ్లూ చాలా ఏళ్ళుగా ఉన్న స్టీల్ రాడ్ అలా మాయం కావడం బాధాకరంగా ఉంది బాబ్లూకి. పింగాణీ బేసిన్ లో ఉన్న రెండు ప్లాస్టిక్ పళ్ళను, ఆ స్టీల్ రాడ్ ను ఆ తర్వాత నర్స్ బయటకు పట్టుకుపోయాడు. ఆ క్లినిక్ లోంచి మరో గంట తర్వాత బయటికొచ్చాడు బబ్లూ.
    
                                                  *    *    *    *    *
    
    ఎ.సి. హెయిర్ కటింగ్ సెలూన్ లోకి వచ్చిన బబ్లూ వేపు ఆశ్చర్యంగా చూసాడు హెయిర్ కటింగ్ మాస్టర్ - ఆ వెంటనే.
    
    రిఫరెన్స్ బుక్ ని చేతిలో పెట్టాడు - పేజీలు  తిరగేస్తున్నాడు బబ్లూ- రకరకాల షేపుల్లో ఎన్నెన్నో అమెరికన్స్ స్టయిల్స్.... ఎన్నెన్నో జపానీ స్టయిల్స్....ఇండియన్ స్టయిల్స్....జపాన్ స్టయిల్లో ఒక మోడల్ ని ఎంచుకుని చూపించాడు...జపాన్ కుంగ్ ఫూ ఫైటర్స్ స్టయిల్ అది.....గెడ్డం కింద కొబ్బరి బొండాల పీచులాంటి గెడ్డం.... పైన ఒకే ఒక సెంటీమీటరు పొడవులో జుత్తు.
    
    "ఓ.కే... సర్..." కత్తిరందుకున్నాడు హెయిర్ కట్టర్...
    
    సరిగ్గా నలభై నిముషాలు గడిచాయి.....
    
    మిర్రర్ లో తన ముఖాన్ని చూసుకుని, తనే ఆశ్చర్యపోయాడు బబ్లూ ఇప్పుడు తనని కన్నతండ్రి కూడా గుర్తు పట్టలేడు. జేబులోంచి రెండు కరెన్సీ నోట్లను తీసి హెయిర్ కట్టర్ చేతిలో పెట్టాడు. ఆ రెండూ రెండు అయిదువందల రూపాయల నోట్లు.
    
                                                 *    *    *    *    *
    
    ఏ హెయిర్ స్టయిల్ కి ఏ గెటప్ లో ఉండాలో క్రిమినల్ బబ్లూకి బాగా తెలుసు. అందుకే నగరానికి నడిబొడ్డునున్న రెయిన్ బో డ్రెసెస్ షాపులో కెళ్ళి, రకరకాల డ్రెస్సుల్ని తీసుకున్నాడు. అందులో కుర్తా, పైజామాతో పాటు చైనా మాంక్స్ వేసుకునే రెడ్ కలర్ పంచె, జుబ్బా ఉండటం కూడా విశేషం!
    
                                              *    *    *    *    *
    
    విశాఖపట్నం రైల్వే స్టేషన్...
    
    గోదావరి ఎక్స్ ప్రెస్ బయలుదేరాడానికి ఇంకా ఇరవై నిముషాల టైముంది.
    
    ఆటో దిగి, స్టేషన్లోకి అడుగుపెట్టాడు నిరంజనరావు.
    
    బ్రౌన్ కలరు సూటు, బూటు.... కళ్ళకు రేబాన్ గ్లాసెస్... కుడి చేతిలో హేండ్ స్టిక్...
    
    అతన్ని ఎవరు చూసినా గుడ్డివాడనుకోరు.
    
    పక్కన సూట్ కేసుతో నడుస్తున్నాడు ఎక్స్ కానిస్టేబులు ఏడుకొండలు...
    
    మరో అయిదు నిమిషాల తర్వాత ఫస్ట్ క్లాస్ ఏ.సీ. కంపార్టుమెంట్లో ఉన్నాడు నిరంజనరావు.
    
    ట్రైన్ బయలుదేరింది...
    
    "నేను చెప్పినవన్నీ తెస్తున్నావా" అడిగాడు నిరంజనరావు.
    
    "ఎస్... సర్.... అన్నీ సూట్ కేస్ లో ఉన్నాయి సార్" జవాబిచ్చాడు ఏడుకొండలు హైదరాబాద్ కి వచ్చేముందు, విశాఖ పోర్టు ఏరియాలోని ఒక ఫ్రెండ్ ని కలిసి వచ్చాడు నిరంజనరావు ఆ వ్యక్తిపేరు పీటర్, పీటర్ సీమేన్.....సంవత్సరానికి ఒకసారి గ్రీక్ షిప్ లో ప్రపంచం అంతా చుట్టి వస్తాడు.....
    
    ఒక ఏడాది ఫ్రీగా వైజాగ్ లో గడిపి, తర్వాత మళ్ళీ షిప్ జర్నీ.
    
    షిప్ లో అతను పనిచేసే సమయంలో అతను చేసే ఇంకోపని గన్స్ కలెక్షన్, వేర్వేరు దేశాల వింత, వింత గన్స్ ని సంపాదించడం, వైజాగ్ కేంద్రంగా హైలెవెల్ వాళ్ళకి వాటిని అందజేయడం అతని బిజినెస్...
    
    రీసెంట్ టైమ్ లో ఎల్.టి.టి.ఇ వాళ్ళకి కూడా అతను ఎ.కె. 56 సప్లయి చేసాడని నిరంజనరావుకి తెలుసు.
    
    పీటర్ పాతికేళ్ళ క్రితం పోలీస్ కానిస్టేబుల్... అప్పటి పరిచయం నిరంజనరావుకి.
    
    "ప్రస్తుతం నా దగ్గర ఫైవ్ వెరైటీస్ పిస్టల్స్ ఉన్నాయి..... అమెరికన్ పిస్టల్స్" వాటిపేర్లు చెప్పాడు పీటర్.
    
    వీల్ లాక్ పిస్టల్... పీస్ మేకర్ కోల్డ్ 45, రెమింగ్టన్ ఎల్లియట్ డెర్రింగర్, మాసర్, ఎఫ్ ఎన్ బ్రౌనింగ్ 7.65 సి.ఎమ్....
    
    వీల్ లాక్ పిస్టల్ కి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది - ఇంగ్లాండుకు చెందిన హెన్రీ ఎయిత్ వాడిన పిస్టల్ అది-నార్వేలో రోడ్ సైడ్ వెండర్ దగ్గర మన ఇండియన్ కరెన్సీ ప్రకారం యాభై వేలకు కొన్నాను - ప్రస్తుతం దాన్ని ఓ మాజీ రాజా వారు లక్షరూపాయలకు అడుగుతున్నారు....
    
    పీస్ మేకర్ కోల్డ్ 45 ఒకప్పుడు క్రిమినల్స్ విచ్చలవిడిగా వాడిన పిస్టల్....రెమింగ్టన్ ఎల్లియట్ డెర్రింగర్ .....చిన్నదైనా భయంకరమైన పిస్టల్..... 50 బుల్లెట్ ని వాడడానికి ప్రత్యేకంగా తయారుచేసిన పిస్టల్ ఇది.... దీని స్పెషాలిటీ చెప్పమంటారా....? ప్రత్యర్ధిని నేలకూల్చటానికి ఒకే ఒక షాట్ చాలు.....బతకడానికి అవకాశం లేదు.... దీనిని చాలా ప్రభుత్వాలు నిషేధించాయి....
    
    మాసర్ పిస్టల్ ని ఎక్కువగా ఉపయోగించేది ఇంగ్లాండు పోలీసులు....
    
    ఎఫ్.ఎన్ బ్రౌనింగ్ హేండ్ బ్యాగ్ లో పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది....
    
    కుటుంబ తగాదాల్లో, వకర్ని ఒకరు చంపుకోడానికి ఒకప్పుడు అమెరికాలో స్త్రీలు ఈ పిస్టల్ ని వాడేవారు....
    
    "మీ పర్పస్ చెప్పండి.... నేను సజెస్ట్ చేస్తాను...." అడిగాడు పీటర్.
    
    "నా పర్పస్.... ఎనిమీకి ఒకే బుల్లెట్ తో చంపడం...." నిర్ఘాంతపోయాడు పీటర్ ఆ మాటకు.
    
    రెమింగ్టన్ ఎల్లియట్ డెర్రింగర్ తీసుకున్నాడు....అందుకు సంబంధించిన బుల్లెట్స్ ను ఇచ్చాడు పీటర్...
    
    "ఈ బుల్లెట్స్ ఇండియాలో దొరకవు.....మీకిచ్చినవే ఆఖరు బుల్లెట్స్...."
    
    "ఎన్నిచ్చావు...." అదిగాడు నిరంజనరావు.
    
    "యాభై..."
    
    "ఎక్కువనుకుంటాను.... నీకు నలభై బుల్లెట్స్ తిరిగి ఇచ్చేస్తాను...." ధీమాగా చెప్పాడు నిరంజనరావు.
    
                                                  *    *    *    *    *
    
    ముషీరాబాద్ సెంట్రల్ జైల్ వెనక, డబుల్ బెడ్ రూమ్ ఇండిపెండెంట్ హవుస్ లోకి అడుగుపెట్టాడు నిరంజనరావు.
    
    వారం రోజుల క్రితం ఏడుకొండల్ని వైజాగ్ నుండి పంపి, ఆ హవుస్ ని అద్దెకు తీసుకున్నాడతను.