"అంటే..." ఏదో అడగబోయాడు సూర్యవంశీ.
    
    రైల్వే కంపార్ట్ మెంట్, లావెట్రీలో దొరికిన మొండెంకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ లోని బ్లడ్ గ్రూపు.... కత్తిపోట్లు... బోన్స్ డిటైల్స్ ద్వారా.... ఆ మొండేనికి చెందిన బాడీ పార్ట్సే ఇవి...."
    
    ఈ మిస్టరీ ఇలా విడుతుందని ఊహించని సూర్యవంశీ చాలా అనందానికి లోనయ్యాడు.
    
    "ఆ వ్యక్తి కత్తిపోట్లవల్ల మరణించాడని మొండెం రిపోర్ట్ ద్వారా తెల్సింది....కానీ.... స్కల్, బోన్స్ ద్వారా ఆ విషయం ఎలా తెలుస్తుంది..." తన సందేహాన్ని వ్యక్తం చేసాడు సూర్యవంశీ.
    
    "నా చేత మీరు ఫోరెన్సిక్ లెసన్స్ చెప్పించేస్తున్నారు...." అని జోకేసి, చెప్పడం ప్రారంభించాడు మధుసూదన్.
    
    కత్తిపోట్లకు గురైన ఏ డెడ్ బాడీని చూసినా ప్రధానంగా రెండు ప్రశ్నలు తలెత్తుతాయి.... ఈజిట్ సూసైడ్ ఆర్ హోమి సైడ్... అంటే ఆత్మహత్యా లేదా ఎవరైనా చేసిన హత్యా అని కత్తిద్వారా ఏర్పడిన గాయాన్ని రెండు రకాలుగా విభజిస్తారు..... కత్తిగాట్లు, కత్తిపోట్లు సాధారణంగా కత్తిగాట్లు చేతులకు, ముఖానికి మాత్రమే తగులుతాయి. కత్తితో ఎటాక్ చేసినపుడు మాత్రమే ఈ గాయాలు తగలడానికి ఆస్కారం ఉంది.
    
    ఉదాహరణకు-
    
    సూసైడ్ కేసులో కత్తితో గొంతు కోసుకోడానికి, హత్యకేసులో కత్తితో గొంతుకోయడానికి చాలా తేడా ఉంది. రెండో కేసుకి సంబంధించి కత్తితో గొంతుకోసే ప్రయత్నంలో హతుడికి, హంతకుడికి మధ్య తీవ్రమైన గొడవ జరగడానికి ఆస్కారం ఉంది. తనని ఎటాక్ చేసే వ్యక్తి నుంచి, ఏ వ్యక్తి అయినా తప్పించుకోడానికే ప్రయత్నం చేస్తాడు కదా... అలాంటి ప్రయత్నం చేసినపుడు ముఖానికి, చేతులకు తదితర శరీర భాగాలకు గాయాలు కావడం, రక్తం కారడం సహజం అలాగే సదరు వ్యక్తికి తగిలిన గాయాలు, కారిన రక్తంద్వారా హంతకుడు ఉపయోగించిన కత్తిని గుర్తించొచ్చు. కారిన రక్తం ద్వారా హంతకుడి దేహ దారుఢ్యాన్ని విశ్లేషించవచ్చు.
    
    ఫర్ ఎగ్జాంపుల్... హతుడికి లోతుగా, బలంగా గాయాలు తగిలాయనుకోండి.... ఆ గాయాల లోతు నిర్ధారణద్వారా హంతకుడి శక్తిని, లాఘవాన్ని హంతకుడి నేరమేధస్సును, సదరు హంతకుడు ఉపయోగించిన కత్తిని గుర్తించొచ్చు.....కారిన రక్తం ద్వారా హంతకుడి దేహ దారుఢ్యాన్ని విశ్లేషించ వచ్చు.
    
    ఫర్ ఎగ్జాంపుల్... హతుడికి లోతుగా, బలంగా గాయాలు తగిలాయనుకోండి.... ఆ గాయాల లోతు నిర్ధారణ ద్వారా హంతకుడి శక్తిని, లాఘవాన్ని హంతకుడి నేర మేథస్సును, సదరు హంతకుడు ప్రొఫెషనల్ కిల్లరా కాదా అనే విషయాన్ని కూడా నిర్ధారించడానికి ఆస్కారం ఉంది.
    
    హతుడి శరీరమ్మీద గాయాలను బట్టి, హంతకుడు ఏ దిశగా వచ్చి హత్య చేసాడో చెప్పొచ్చు.... అలాగే హత్య జరిగిన కొన్ని గంటల్లో హతుడి శరీరంలోని చేతుల్ని, కాళ్ళను రక్తపు గుర్తులను, తల వెంట్రుకలను మెదలయిన వాటిని పరీక్షిస్తే హంతకుడి గురించి వెంటనే చాలా వివరాలు తెలిసే అవకాశం ఉంది.
    
    కానీ అలా హత్య జైర్గిన వెంటనే పరీక్షలు జరగడానికి పోలీసులు చేసే తతంగంవల్ల వీలుపడదు.
    
    ఒక గాయంద్వారా హంతకుడి దృఢత్వాన్ని, మనస్తత్వాన్ని విశ్లేషించే అవకాశం ఉండగా అదే గాయం ద్వారా ఆ గాయం ఏ ఆయుధం ద్వారా కలిగిందో గుర్తించొచ్చు.....బలమైన పోట్లు కత్తులుద్వారా బయ్ నెట్లుద్వారా రంపాలు, గునపాలు ద్వారా....ఏదైనా సూది ఇనపపనిముట్లు ద్వారా మాత్రమే జరిగే అవకాశం ఉంది.... అలాగే శరీరంలో జరిగిన గాయాల్లో ఏ గాయం ద్వారా వ్యక్తి మృతిచెందాడు అన్న విషయంకూడా నిర్ధారించవచ్చు.
    
    ఏ హంతకుడైనా ఒక వ్యక్తిని చంపాలనుకుంటే గుండెల్లో పొడిచిగాని, కంఠాన్ని, జననేంద్రియాలను తెగకోసిగాని చంపడానికి ప్రయత్నిస్తాడు.
    
    కత్తిపోట్లతో చనిపోయిన వ్యక్తులకు సంబంధించి రెండు విచిత్రమైన కేసులున్నాయి.
    
    ఒకటి అమెరికాలో ఒకసారి స్పీల్ అనేవ్యక్తి ఒకేఒక కత్తిపోటుకు గురై చనిపోయాడు.....ఒకే ఒక కత్తిపోటుకు గురై చనిపోవడం చాలా అరుదు. అందులోనూ అది ఆత్మహత్య అని స్పీల్ భార్య చెప్పడం విశేషం. స్పీల్ బాగా తాగి, తననుతాను పొడుచుకుని చనిపోయాడని స్పీల్ భార్య వాదన.
    
    కానీ పోలీసులు మాత్రం ఆ విషయాన్ని నమ్మలేకపోయారు. అది హత్యని రుజువు చెయ్యడానికి పోలీసులు చాల శ్రమపడాల్సి వచ్చింది. ఆఖరికి పోలీసులు ఆ కేసుని ఎలా పరిష్కరించారో తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది.
    
    స్పీల్ ప్రతి పనినీ ఎడంచేత్తోనే చేస్తాడు....అది ఆత్మహత్యా అనుకుంటే ఎడంచేత్తోనే స్పీల్ కత్తితో తననితాను పొడుచుకుని వుండేవాడు. గాయాన్ని విశ్లేషించగా అది లోతైన గాయం. బాగా రక్తస్రావం కూడా జరిగింది. ఎడంచేత్తో పొడుచుకొన్నప్పుడు అంత లోతుగా గాయం ఏర్పడడం జరగదు. ఎందుకంటే కుడిచేతి బలానికి ఎడంచేతి బలానికి చాలా భేదం ఉంటుంది గనుక.
    
    ఈ విషయం ఆధారంగా స్పీల్ భార్యను సాక్ష్యాధారాలతో కోర్ట్ ఆఫ్ లా ముందు నుంచోపెట్టారు...." చెప్పడం ఆపాడు ప్రొఫెసర్ మధుసూదన్.
    
    "రెండో కేసు...." ఆసక్తిగా అడిగాడు ఇన్స్ పెక్టర్ శశిరామ్.
    
    "ఈ కేసు చాలా ఫన్నీకేసు....ఇది కూడా సూసైడ్ కేసే.....ఇది బీహార్లో 1956లో జరిగింది. ఒక వ్యక్తి తననితాను పొడుచుకుని చనిపోయాడు......పోలీసులకు అది హత్యా, ఆత్మహత్యో తెలుసుకోడానికి చాలా కాలం పట్టింది......తగిలిన గాయాలకు వాడిన ఆయుధమే ఈ కేసులో చాలా కీలకం.
    
    ఆత్మహత్య అయితే ఆయుధం నేరస్థులంలోనే కనిపించాలి. కానీ కనిపించలేదు.....కానీ అది ఆత్మహత్య....అన్నాడు ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించగా విశ్లేషించగా-
    
    ఆ వ్యక్తి తను చనిపోవడానికి చాలాకాలం ముందుగానే తను పెంచుకునే కుక్కకు కత్తిని ఎత్తుకుపోయి సముద్రంలో విసిరేసే వెరైటీ ట్రైనింగ్ ను యిచ్చాడు.
    
    అంతా ప్లాన్ చేసుకున్నాడు..... ఆ సమయంలో కుక్కను ఎదురుగా ఉంచాడు. తను కత్తితో పొడుచుకుని చనిపోతూ కత్తిని విసిరేసాడు... ఆ కత్తిని యధాప్రకారం ఆ కుక్క సముద్రంలో పడేసింది. పడేసి ఆ కుక్కకూడా చనిపోవడం విశేషం.
    
    కుక్క ఎందుకు చనిపోయింది? ముందుగానే కత్తికి పవర్ ఫుల్ పాయిజన్ ని పూసాడు ఆ వ్యక్తి అంతే!
    
    దిసీజ్ ఏన్ ఏక్స్ టార్డినరీ ఇంట్ లి జెంట్ సూసైడ్ కేసు....అతను సూసైడ్ చేసుకోవడానికి గల కారణం వాళ్ళావిడ.....అది వేరేకథ...." చెప్పడం ముగించాడు మధుసూదన్.
    
    "ఈ మృతదేహం ముఖంలోని పళ్ళకు సంబంధించి ఏవైనా ప్లాస్టిక్ పన్నుగానీ స్టీల్ రాడ్ గానీ ఉండే అవకాశం ఉందా....." అడిగాడు సూర్యవంశీ.
    
    "నో....అలాంటిదేం లేదు....ఈ వ్యక్తి పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉన్నాయి...." చెప్పాడాయన.
    
    అంటే! అంటే..... బతికున్న వ్యక్తి స్టీల్ రాడ్ వ్యక్తి అంటే బబ్లూ.....చచ్చినవాడు సయ్యద్...