అంతలో దూరంగా, తెల్లగా... పొదల ప్రక్కగా మెరుపు మెరిసినట్లయింది అవును -అప్పుడూ ఇంతే, అలాగే తళుక్కుమంది ఆమె.

 

    వేదిత చేతిలో బిందెతో దగ్గరకు వచ్చేసింది. శాయి ఊపిరి బరువుగా విడుస్తున్నాడు. వేదిత చలమ దగ్గర ఆగింది, కాని నీళ్ళుతోడి ప్రక్కన పారబోసి తర్వాత బిందెలో నింపుకుంటోంది.

 

    మలినమై వున్నదా ముఖం? లేదు. అదే నిర్మలత్వం, అదే నిష్కపటకాంతులు. బిందె నింపుకున్నది. లేచి నిలబడి చంకన పెట్టుకున్నది వెళ్ళిపోతున్నది - వెళ్ళి పోయింది.

 

    "సక్సేనా!" అని పిలిచాడు శాయి చెట్టువెనుకనుండి "చూశావుగా! ఇప్పుడు చెప్పు. నీ అభిప్రాయం ఏమిటి?"

 

    ఆమె దర్శనమైన మొదటి క్షణం నుండి యీ ప్రపంచాన్ని మరచి పోయిన సక్సేనా స్నేహితుడి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. అతని ముఖంలోకి కొత్త చైతన్యం వచ్చింది.

 

    "శాయీ! ఈమెనా నువ్వు మోహించావు? ఈ దేవతామూర్తినా నీవు కామించావు? ఈ అమర మానవినా నీ కౌగిలిలో బంధించి పెదవి మీద చుంబించావు. నీ పాపానికి నిష్కృతి లేదు. నువ్వు మనిషివికాదు. నిన్నేదో దెయ్యం ఆవహించింది. చూసీ చూడగానే ఆమె పాదాలమీద పడి "అమ్మా!" అని ఆర్తనాదం చేయాలనిపించిందే నాకు. ఆమెకు దాసోహమై, భక్తుడినై పవిత్రంగా ఆరాధించాలనిపించిందే. నీకు.... నీకు నిజంగా మతిపోయింది. నీలో మానవత్వం నశించిపోయింది. శాయీ! నీ శుభం కోరి చెబుతున్నాను. ఆమె మీద నుండి వ్యాపించిన కాంతి నిన్నేమీ హెచ్చరించటం లేదా? ఆమెను లోక శ్రేయస్సు కొరకు ఆమె సిద్ధాంతాలకు వదిలెయ్యి. ఆమె జోలికి పోకు స్నేహితుడిగా నిన్నేమీ కోరను. ఈ ఒక్క కోరిక మన్నించు."

 

                                         * * *

 

    మరునాడు సక్సేనా ఆనందపురం విడిచి వెళ్లిపోయాడు.   

 

                                           * * *    

 

    సక్సేనా రాకతో ఒకింత ఊపిరి తీసుకున్నట్లు అనిపించిన శేషశాయికి అతను వెళ్ళిపోవటం తిరిగి ఎప్పటి సంఘర్షణను కొనసాగించి నట్లయింది. తిరిగి ఇల్లు, తనకి తెలియకుండా తనచుట్టూ పరిభ్రమించే సీత, తను మరిచిపోలేని వేదిత....

 

    ఎలా అయినా ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. బ్యాంకులో ఎంత ఎకౌంటు వుందో నిల్వ జూసుకున్నాడు. ఊళ్ళోని పెద్దల్ని కలిసి తన పొలాలను బేరం పెట్టాడు.

 

    అతడు పొలాలను అమ్మ జూస్తున్నాడన్న సంగతి ఇందుమతమ్మగారి చెవిన పడింది. ఆవిడ ఒకరోజు కొడుకుని తన దగ్గరకు రమ్మని కబురంపింది. వారి యింట్లో సంప్రదాయం ఎట్లా పోషించబడుతూ వచ్చిందంటే ఒక్కొక్కసారి శాయి వారం రోజులవరకూ తల్లిని చూడటానికి వెళ్ళేవాడు కాదు.  

 

    "పిలిచావా అమ్మా?" అంటూ దగ్గరకు వెళ్లాడు కొడుకు.

 

    "అవును, పిలిచాను. నీతో కాస్త మాట్లాడాలి. కూర్చో నాయనా!"

 

    శాయి ఒక కుర్చీని తల్లి మంచం దగ్గరకు లాక్కుని "చెప్పమ్మా అన్నాడు ఆప్యాయత వొలికే కంఠంతో.

 

    ఇందుమతమ్మగారు కుమారుడివంక ఒకసారి ఓరగాచూసి "నువ్వు పెద్దవాడివై పోయావు. విదేశాలకు వెళ్ళి పెద్ద చదువు చదువుకుని వచ్చావు. సర్వస్వతంత్రుడివై పోయావు. నిజమే అనుకో, అంత మంచానపడివున్నా నీ తల్లిని బ్రతికే వున్నాను. పొలాలను అమ్మకం పెడుతున్నావుట నిజమేనా?" అన్నది.  

 

    శాయి మందహాసం చేసి "అందులో రహస్య మేమున్నదమ్మా? నేను యింజనీరింగ్ చదివి ఈ పల్లెటూళ్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోలేను కదా! జీవిత సార్థకతకు ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేయాలి. ఉద్యోగం మీద నాకు మోజులేదు. అందుకని వ్యాపారం చేద్దామనుకున్నాను. చెయ్యాలంటే బ్యాంకులో నిల్వవున్న డబ్బు చాలదు. అందువల్ల పొలాలుకూడా అమ్మిడబ్బుచేస్తే సరిపోతుంది." అన్నాడు.

 

    "ఉన్న ఆస్థినంతా ముందూ వెనుకా చూడకుండా వ్యాపారంలో తగలబెట్టటం వివేకవంతుల లక్షణమా?"

 

    "ఇది తగలబెట్టటం కాదు కదమ్మా! ఒక మంచిపని చేయటానికి వెరుపు దేనికి? నేనేం అంత వివేకహీనుడ్నికాదు -డబ్బు దుబారా చెయ్యటానికి. అందరిలా ఆస్తి అభివృద్ధి చేసుకుందామని నాకూ ఉంది.

 

 

    "కాని భార్యా, తల్లీ వీరి బరువు బాధ్యతకూడా ఉన్నాయిగా? నీవు ఎక్కడో స్థిరపడిపోతే మా సంగతేమిటి?"

 

    ఈ ప్రశ్నకు అతను సమాధాన మేమీ చెప్పకుండా ఆలోచిస్తున్నాడు.

 

    ఇందుమతమ్మగారు నిట్టూర్చి అతని ముఖంలోకి చూస్తూ "సంవత్సరాల తరబడి బయట ఉండటం అలవాటు పడినవాడివి. ఈ పల్లెటూళ్లో పడి ఉండలేవని నాకు తెలుసు. ఉండమనటమూ నా ధర్మంకాదు. కానీ సీత నీ అర్ధాంగి. అమాయకురాలు. ఇప్పటికే ఎంతో కాలం నిన్ను విడిచి శోకజీవితం గడిపివుంది. ఆమె మనస్సు మాత్రం క్షోభ పడేటట్లు చేయకు. నీవు ఎక్కడకు తిరిగినా ఆమెనుకూడా నీతోపాటు తీసుకుపోతూ వుండు. ఇహ నా విషయమంటావా? నా రోజులన్నీ గడిచిపోయినయి. నే నీ యింటిని విడిచి ఎక్కడకూ కదల్లేను. ఎప్పుడో అప్పుడు యిక్కడనే సమసిపోతాను" అని కొంచం ఆగి "కాని నాయనా ఒక్కమాట. తరతరాలనుండి మనది ఎంతో సంపన్న కుటుంబం. నీ పూర్వులంతా ఎంతో కష్టపడి, తెలివితేటలుపయోగించి తమ ఆస్తి పాస్తుల్ని పెంపొందింపజేస్తూ వచ్చారు. అందుకు భిన్నంగాపోయి, మన కుటుంబ గౌరవాన్ని మట్టిపాలు మాత్రం చేయకు" రాను రానూ ఆమె కంఠం గాద్గదికమైంది. కాంతి నశించిపోతూన్న ఆ వృద్ధురాలి నేత్రాలలో కాసిని ఆశ్రువులు నిలిచాయి.   

 

    శేషశాయి అయిదు నిమిషాలు అలాగే మెదలకుండా కూర్చుని, తర్వాత మెల్లగా లేచి బయటకు వచ్చేశాడు. మరునాడు ఉదయం శాయి ఏమీ తోచక తుపాకి తీసుకుని వేటకి బయల్దేరాడు. అతనికి వేటంటే చాలా సరదా. ఆ సరదాలో అన్ని దుఃఖాలూ, అన్ని ఆవేదనలూ మరచిపోతాడు.