ఆయన ముఖం ఎర్రగా వుంది "రేపట్నుండీ కాలేజీ మానెయ్!" ఆర్డర్ లా అన్నారు.

 

    "ఏమిటీ?" ఆయన మాటలు నేను సరిగ్గా వినలేదేమో అని మళ్ళీ అడిగాను.

 

    "రేపటి నుండీ నువ్వు బయట కాలు పెట్టనవసరం లేదు! చదివింది చాలు!" అంది అక్క.

 

    "అక్కా! నీకేమైనా పిచ్చెక్కిందా?" కోపంగా అడిగాను.

 

    "ఆ పిచ్చెక్కేటట్లే ఉంది. నువ్వు చేస్తున్న పరువు తక్కువ పనులకి తల ఎత్తుకోలేకపోతున్నాం. అడ్డమైన తిరుగుళ్ళూ తిరుగుతూ ఇంకా ఓట్రిస్తావేమిటే?" చేతులు తిప్పుతూ అంది.

 

    రాత్రి నేను విక్కీతో వెళ్ళడం ఎవరో చూసి చెప్పారన్నమాట! మౌనంగా నిలబడ్డాను.

 

    "ఎవడో... చిత్తు కాయితాలు ఏరుకునే వాడిలాంటి వాడితో ప్రోగ్రామ్ హాల్లో కనిపించావుట?" వ్యంగ్యంగా అడిగింది అక్క.

 

    "ఎవరికి?" ధైర్యంగా అడిగాను.

 

    "ఎవరికైతే నీకెందుకూ? వెళ్ళావా లేదా?" ఈసారి బావ అడిగాడు.

 

    "వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి ఎవరు చూశారు" అడిగాను.

 

    "నేనే" అన్నాడు.

 

    "అతను చిత్తు కాయితాలు ఏరుకునేటట్లు కనిపించినా, పెద్ద ఫారెన్ రిటర్న్ డ్ డాక్టర్!" అన్నాను.

 

    "అంటే నేను డాబుగా కనిపించినా చిల్లర వెధవననా?" కోపంగా అరిచాడు.

 

    "అలా అని నేను అనలేదు."

 

    అమ్మ ఏడుస్తూ "ఇంటిని ఆదుకుంటుంది అనుకున్న అదికాస్తా మాయదారి జబ్బొచ్చిపోయింది. నువ్వు చూస్తే ఇలా పెడదారి పట్టి తిరుగుతున్నావు! ఏం శని పట్టిందే ఈ కొంపకీ?" అంది.

 

    నిజంగా నేను పెడద్రోవలు పట్టి సందీప్ తో, సిద్ధార్థతో చెక్కర్లు కొట్టినప్పుడు ఎవరికీ తెలీనే తెలీదు! ఇప్పుడిప్పుడే బుద్ధి తెచ్చుకుని సక్రమమైన దారిలో నడుద్దామనుకుంటుంటే రాద్ధాంతాలు చేస్తున్నారు.

 

    "ఎవరు అతను? తల్లిదండ్రులెవరు? కులం గోత్రం ఏమిటి?" నాన్న అడిగారు.

 

    నాకు వాటిల్లో ఒక్క ప్రశ్నకు సమాధానం తెలీదు! అందుకే దిక్కులు చూస్తూ నిలబడ్డాను.

 

    "తెలీదా? తెలుసుకునే తీరిక చిక్కలేదా?" వెటకారంగా అడిగింది అక్క.

 

    మనిషి శక్తిని పట్టించేవి సమస్యలే! అందుకే నిబ్బరంగా "అతని గురించి తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు!" అన్నాను.

 

    "మరి... నడుం చుట్టూ చేతులేసుకుని నడిచే అవసరం వుందా?" లాపాయింట్ లాగినట్లుగా అడిగాడు బావ.

 

    "ఉంది! ఆ గొడవలో జనం మీదపడి ఉక్కిరిబిక్కిరిగా ఉన్నప్పుడు అతను నన్ను బయటికి తీసుకొచ్చి సహాయం చేశాడు" అన్నాను.

 

    "పరాయి మగాడు అలా చేతులేస్తే తప్పులేదా? బరితెగించిపోయావు" అన్నాడు బావ.

 

    "ఇంకా ఊహే సరిగ్గా తెలీని నన్ను సినిమాకని తీసుకెళ్ళి, ధియేటర్లో కొత్త పెళ్ళాన్ని పక్కన ఉంచుకునే నా ఒళ్ళంతా తడిమి ఆనందించిన నీకు ఈ ప్రశ్న అడిగే హక్కులేదు!" ఒక్కొక్క మాటా తూటాలా బయటికి వస్తూ ఉంటే అమ్మా, నాన్న, అక్కా అవాక్కై నోరు తెరుచుకుని చూస్తుండిపోయారు.

 

    నా మాటలు విన్న బావ మొహం నల్లగా మాడిపోయింది.

 

    "చూశావా అమ్మా...దాని వేషాలు బయటపడేసరికి మా ఆయన మీద ఎంతెంత అభాండాలేస్తోందో? ఛీ..ఛీ... చెల్లెలని చూస్తున్నాగానీ అదే నా కూతురైతే ఇది చేస్తున్న పనులకి ఒళ్ళంతా వాతలు పెట్టేదాన్ని!" అంది.

 

    "అమ్మ అలా పెట్టలేకనే ఊరుకుంది పాపం!" దానివైపు శ్లేషగా చూస్తూ అన్నాను.

 

    ఆత్మశోదనే ఉంటే దానికి అది పెళ్ళి కాకముందు మధు అనే ఫారిన్ రిటర్న్ డ్ తో జరిపిన ప్రణయం గుర్తుకువచ్చేది! కానీ పెళ్ళి చేసుకుని పాపిట్లో ఇంత కుంకం... కాళ్ళనిండా పసుపూ రాసుకుని కొత్తవేషంలో పాత జీవితం మర్చిపోయింది. స్వంత అక్క అయినందుకు ఆ సమయంలో నోరు మూసుకున్నాను.

 

    మనం చేసిన తప్పులే ఇంకోళ్ళు చేసినప్పుడు క్షమించరాని నేరాల్లా కన్పిస్తాయి! బహుశా అంతర్లీనంగా వున్న పశ్చాత్తాపభావం అలా చేయిస్తుందేమో!

 

    "ఆముక్తా... ఒక పని చెయ్యమ్మా..." అంది అమ్మ.

 

    ఏవిటన్నట్లు చూశాను.

 

    "మాకు ఇంత విషం పెట్టి, ఆ తరువాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో!" అని బావురుమంది.

 

    అప్పుడొచ్చాయి నాకు కన్నీళ్ళు! మొత్తం శక్తిని గుప్పెళ్ళలోకి తెచ్చుకుని బిగబట్టి నిలబడ్డాను.

 

    నాన్న బావతో ఆ సంబంధం వాళ్ళని రేపు రమ్మని చెప్పు బాబూ! పొగ చుట్టుకోకముందే జాగ్రత్తపడి నిప్పుని ఆర్పేయడం మంచిది!" అన్నారు.

 

    వాళ్ళంతా కలిసి నా భవిష్యత్తు గురించి చర్చలు జరిపి, నేను పాడయి పోయానని తీర్మానించుకుని ఓ నిర్ణయం తీసుకున్నారు.

 

    అందుకు నేను కట్టుబడి రేపు చాపమీద తలవంచుకుని కూర్చుంటే నేను మంచి ఆడపిల్లని!

 

    లేకుంటే... బరితెగించినదాన్ని!

 

    "ఆ మూడు ముళ్ళూ పడిపోతే అన్నీ అవే సర్దుకుంటాయి" అక్క అమ్మని ఓదారుస్తోంది.

 

    స్వీయానుభవం అనుకుంట.

 

    నా హృదయం ఇప్పుడు నిజంగా తెల్లకాయితంలా వుంది. దానిమీద ఎవరి సంతకం లేదు.


                                                       *  *  *