పారడైజ్ సిటీకీ తిరుగుప్రయాణం మొదలెట్టింది వినీల పైలట్ చేస్తున్న జనరల్ భోజాగారి ప్రైవేట్ జెట్. ఎన్ టిబ్ ఎయిర్ పోర్టులో ఎక్కించుకున్న 'మెకానిక్' సైతాన్ సింగాతో కలిసి విమానంలోని తన ఛాంబర్స్ లో కూర్చుని వున్నాడు జనరల్ భోజా తన అన్న దుర్లబ్ సింగ్ ని ఎవరో టపాకాయని కాల్చినట్లు కాల్చేశారని చెబుతుంటే, వింటున్న జనరల్ భోజా కళ్ళు నిప్పుకణికిల్లా ఎర్రబడ్డాయి.  

 

    "విచారించకు సైతాన్ సింగ్: విచారించి లాభంలేదు. కన్నుకి కన్నూ, రక్తానికి రక్తం తీసుకోవడమే మొగతనం: నీ అన్నని చంపింది ఎవరో ఇండియన్ డగ్సే అనుకోవడంలో పొరబాటు లేదు నీ అన్నచావుకి పగతీర్చుకోవడం కోసం నువ్వు ఏ ప్లానన్నా చెప్పు. నేను నీ వెనక నిలబడతా:" అన్నాడు జనరల్ భోజా, స్కాచ్ విస్కీ గ్లాసులోపోసి సైతాన్ సింగ్ కి అందిస్తూ.

 

    తలవంచుకునే కొద్దిసేపు వుండిపోయి తర్వాత నెమ్మదిగా తలఎత్తి జనరల్ భోజా వైపు చూశాడు సైతాన్ సింగ్... మద్యం కాస్త చప్పరించి, "జనరల్ సాబ్: మీ అండదండలు నాకు వుండాలేగానీ ఇండియాని కాశ్మీర్ దగ్గరనుంచి కన్యాకుమారిదాకా తగలపెట్టియ్యగలను. ఆ దావాగ్ని ఇండియాలో ప్రతి మనిషినీ ప్రతి ప్రాణినీ, ప్రతి చెట్టునీ, ప్రతి పుట్టనీ మాడ్చి మసిబొగ్గులు చేసేస్తుంది. ఆ దారుణ మారణహోమంలో నుంచి తేరుకోవాలంటే ఇండియాకు వందేళ్ళకు తక్కువ పట్టదు..." అన్నాడు ఆవేశంగా.

 

    "శభాష్:" అన్నాడు జనరల్ భోజా మెచ్చుకోలుగా. "సైతాన్ సింగ్: నీ కసి చూస్తుంటే నాకు చాలా ఆనందంగా వుంది. నీ ముచ్చట తీరే రోజు అతిత్వరలో వస్తుందని ఆశిద్దాం. కానీ ఊహలు ఎన్నెన్నో వుండొచ్చు. అవి అమలుపరిచే శక్తి సామర్ధ్యాలు నీకు ఉన్నాయా లేవా? అని నేను ముందు తేల్చుకోవాలి. మీ అన్న దుర్లబ్ సింగ్ విషయంలో అయితే నాకు అనుమానమే ఉండేది కాదు. అతను నేను చెప్పిన పనులు చాలా చెయ్యగలిగాడు. అయితే అవన్నీ కూడా నేను చేయించబోయే అసలు పనితో పోల్చి చూస్తే పిల్లాట లాంటివి... అతడు నేను చెప్పిన పనులన్నీ నేర్పుగా నిర్వర్తించాక, అతన్ని బిగ్ లీగ్ లోకి లాగుదామనుకుంటుండగా ఈ ట్రాజిడీ జరిగిపోయింది. ఒకే రక్తాన్ని పంచుకు పుట్టారు మీరిద్దరూ. అతనిలో వున్నంత రక్తదాహం నీలో కూడా వుంటుందనే నమ్ముతున్నాను నేను. అందుకే నీకీ అవకాశం ఇస్తోంది. ఇందాక చెప్పినట్లు ముందుగా నీకొక టెస్ట్ కేస్."

 

    "చెప్పండి బాస్:"

 

    "నువ్వే చెప్పు: ఏం చేసి నాకు నమ్మకం కలిగించగలవు?"

 

    మీసాన్ని దువ్వుతూ ఆలోచించాడు సైతాన్ సింగ్.

 

    "మెషిన్ గన్ తీసుకొని అన్నెం పున్నెం ఎరుగని వందమందిని పటపట కాల్చెయ్యమంటారా?"

 

    "అందులో కొత్తేముంది: మీ దేశంలో ఏ రోజు ఏ పేపరుచూసినా అవే వార్తలుగా: కాస్త సెన్సేషనల్ గా ఉండేది చెప్పు?"

 

    మద్యం మరో మూడు గుక్కలు తాగాడు సైతాన్ సింగ్.

 

    సరిగ్గా అదే సమయంలో లోపలికి వచ్చింది వినీల.

 

    "చిన్న మెకానికల్ స్నాగ్ వచ్చింది. ఏదన్నా ఎయిర్ పోర్ట్ లో దిగి చెక్ చేయిస్తే బాగుంటుందనిపిస్తోంది" అంది.

 

    "ఓకే:" అన్నాడు జనరల్ భోజా స్టయిల్ గా.

 

    "ఇక్కడ వైట్ పేపర్స్ ఏమన్నా వున్నాయా? కొన్ని నోటింగ్స్ చెయ్యాలి" అంది వినీల.

 

    "ఆ కప్ బోర్డులో వుంటాయి చూడు" అన్నాడు భోజా. కాగితాల కోసం వెదుకుతున్నట్లు నటిస్తూ అక్కడే ఉండిపోయి, వాల్లమాటలు వినసాగింది వినీల.

 

    "కొద్దిరోజుల్లో ఢిల్లీలో ఒక ఉత్సవం జరగబోతోంది... దాదాపు ఇండియాలోని పెద్ద తలకాయలన్నీ ఆ ఉత్సవానికి హాజరవుతాయి... నిస్సందేహంగా ఆ వి ఐ పి.నిలోవి చాలామంది విమానాల్లోనే ప్రయాణాలు చేస్తారు. అలా నిండా వి ఐ పి. లతో వున్న ఓ విమానాన్ని హైజాక్ చేసేస్తే...?"   

 

    "ఇప్పుడు కాస్త బుర్ర వుపయోగించి మాట్లాడుతున్నావ్..." అన్నాడు జనరల్ భోజా, తన మామూలు మోటు ధోరణిలోకి వచ్చేస్తూ. "ఎప్పుడు ముహూర్తం?"

 

    "అతి త్వరలోనే అని చెప్పాను కదా?"

 

    హిప్పోపోటమాస్ లాగా కళ్ళు అరమోడ్పుగా పెట్టి కాసేపు ఆలోచించి తర్వాత అన్నాడు జనరల్ భోజా.

 

    "చూడు సైతాన్ సింగ్: మీ ఎక్స్ ట్రీమిస్టులకీ పాకిస్తాన్ సహాయం ఇంకా వుంటోందా?"

 

    "ఇండియాకి వ్యతిరేకంగా ఎవరు ఏ పని తలపెట్టినా అందుకు పాకిస్తాన్ అండదండలు ఎప్పుడూ వుంటూనే ఉంటాయి... కానీ బెనజీర్ భుట్టో ఇప్పుడు పవర్లోకి వచ్చిందిగా కొత్తరకం. మాకు సాయం చెయ్యడానికి పెద్దగా ఇంట్రెస్టు చూపించడం లేదు. అయితే అలా ఎన్నాళ్ళు మెయిన్ టెయిన్ చెయ్యగలదో చూడాలి."   

 

    మళ్ళీ కాసేపు ఆలోచించాడు జనరల్ భోజా.

 

    "అట్టాకాదు సైతాన్ సింగ్: ఎవరో చెబితే విన్నా: ఇదివరకెప్పుడో మీ దేశంలో - సౌతిండియాలో అనుకుంటా... అదేదో సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా అయిదారు పొరుగు దేశాలు కలిసి ముట్టడించి నేలమట్టం చేసెయ్యలేదూ... ఏంటా సామ్రాజ్యం పేరు?"