మన పండుగలకి వేడుకలు ఎక్కువ . వచ్చే పోయే బందువులే కాదు , ఆట పాటలు , సరదాలు కూడా ఎక్కువే . ఉదాహరణకి ఇప్పుడు ఈ దేవీ నవరాత్రులనే తీసుకోండి . దేశమంతా నృత్యాలతో సాయంత్రాలు రంగులద్దుకుంటుంది. ఒకో ప్రాంతంలో ఒక్కో ఆచారం. కాని అన్ని ప్రాంతాలలో చాలా కామన్‌గా వుండే విషయం మాత్రం నృత్యం . మన తెలంగాణా రాష్ట్రంలో కూడా బతుకమ్మ వేడుకల్లో పాట, నృత్యం ముఖ్య పాత్ర పోషిస్తాయి . రిథమిక్‌‌గా సాగే పాటకి అనుగుణంగా పాదాలు కదుపుతుంటే మనసు ఆనందంతో నిండి పోతుంది . ఇదిగో సరిగ్గా ఇదే విషయాన్ని అధ్యయనం చేసి మరీ చెబుతున్నారు నార్వే పరిశోధకులు.

 

ఆటలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా వుండే వారు ఎంతో ఆరోగ్యం గా వుంటునట్టు తెలిసిందిట వీరి అధ్యయనంలో . వీరు సంతృప్తితో జీవిస్తునట్టు, ఆనందంగా వుంటునట్టు, అలాగే మంచి సంబంధ భాందవ్యాలు కలిగివుంటునట్టు కూడా తేలిందిట . ఎందుకు అంటే అలాంటి కార్యక్రమాలు మెదడు, మనసు, రోగ నిరోధక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపించటం వల్ల అయ్యుండవచ్చు అని చెబుతున్నారు.

 

ఒత్తిడి తగ్గి ఆ ప్రభావం ఆరోగ్యం మీద పడుతుందని భావిస్తున్నారు. కాబట్టి వీరు చెప్పేది ఏంటంటే పండగ వస్తే హమ్మయ్య సెలవు దొరికింది అనుకుంటూ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య వుండి పోకండి. అలా బయట పడి నలుగురిని కలవండి, ఆడి పాడండి.. ఆరోగ్యంగా వుండండి అంటున్నారు. ఒకప్పుడు మన పెద్దలు చేసింది అదే కదండీ ! ఏ వేడుకని అయినా అందరు కలసి ఆట పాటలతో గడిపేవారు. బహుశా వాళ్ళు అప్పుడు ఆరోగ్యంగా వుండటానికి అది కూడా ఒక కారణం ఏమో ! మరి మీ చుట్టూ పక్కల పండగ హడావుడి ఎలా వుందో చూడండి ఒకసారి. వీలు చేసుకుని మరీ మీరూ అడుగు కలపండి. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి .

 

-రమా