చివరకు దగ్గుతో అలసిపోయి, గ్లాసు క్రిందపడేసి "మాలతీ!" అంటూ సోఫాలో ఒదిగిపోయాడు.

    మాలతి దగ్గరకు వచ్చి చూసింది. నిద్రో, నిస్త్రాణ్ణో తెలీదుగానీ మగతగా వున్నాడు. చెయ్యి చెంపలమీద వుంచి ప్రేమగా రాసింది. కొంచెం కదిలి 'మాలతీ!' అని మళ్ళీ పడుకున్నాడు.

    ఆ చెయ్యి అలానేవుంచి కన్నీళ్ళు విడుస్తూ చాలాసేపు ఆ స్థితిలో వుండిపోయింది.

    బయట అలికిడి అయినట్లయి, ఉలికిపడి చెయ్యితీసేసి చప్పున లోపలి గదిలోకి వెళ్ళిపోయింది.

    ఒకటి....రెండు నిముషాలు గడిచాయి.

    నిశ్చయంగా గదిలోకి ఎవరో వచ్చారు. కానీ అంతకన్నా ఏ శబ్దమూ లేదు. ఎవరు? ఏం చేస్తున్నారు? గోపయ్య అయితే లోపలిగదిలోకి రాకుండా వుంటాడా?

    ఎంతో జాగ్రత్తగా తొంగిచూసింది.

    మళ్ళీ తృళ్ళిపడింది.

    "శంకర్!" సోఫామీదకు వంగి దేనికోసమో శేఖర్ జేబులు తడుముతున్నాడు. చివరకు తాళంచెవులగుత్తి జేబులోంచి బయటకు తీశాడు. క్షణంసేపు శేఖర్ ముఖంలోకి కసిగా, ద్వేషంగా చూసి, ఏదో నిశ్చయించుకున్నట్లు టేబిల్ మీది ఖాళీసీసా తీసి దాంతో శేఖర్ తలమీద మోదేటట్లుగా రెండుచేతులతో పట్టుకుని పైకెత్తాడు.

    మాలతి మెరుపులా బయటకు వచ్చింది.

    విద్యుద్ఘాతం తగిలినట్లుగా వణికి, ఆ చేతుల్ని అలాగే దించి "నువ్వా?" అన్నాడు.

    "దుర్మార్గుడా! చివరకు హత్యకు కూడా ఒడిగట్టావా?"

    శంకర్ పెరిగిన గడ్డంతో, లోతుకుపోయిన కళ్లతో, నలిగినా బట్టల్తో నిర్లక్ష్యంగా, అసహ్యంగా కనబడుతున్నాడు.

    "డబ్బు అవసరం మనుషుల్ని అనేక పనులు చేయిస్తుంది మాలతీ! అందులో ఇదొకటి. అవునూ నువ్వు మళ్ళీ ఎప్పుడు వచ్చావు?"

    "నేనెప్పుడూ ఇక్కడే వుంటాను."

    "అలాగా! ఈ ధైర్యం ఎప్పటినుంచి?"

    "నేను పిరికిదాన్ననుకోవటం నీ పొరపాటు. సహనం, శక్తి, మానవత్వం, ఆత్మవిశ్వాసం అన్నీ వున్న ఆడదాన్నని మరిచిపోకు."

    "ఆడదానివి. అందుకే నా కళ్ళకు మరింత అందంగా కనిపిస్తున్నావు" అతని కళ్ళు మెరిశాయి.

    "మాలతీ! శేఖర్ అంటే నాకు ద్వేషంలేదు కానీ వాడు నీ మొగుడు అవటం వల్లే అంత కోపం నాకు. వాడు నిన్ను వదిలేసినా, ఇంట్లోంచి వెల్లగొట్టినా, వాడంటే నువ్వు పడిఛస్తున్నందుకు వాడంటే ఒళ్ళు రగులుకుపోతున్నది. మాలాతీ! గుర్తుందా? ఇదే చోట - ఓరకం ఉన్మాదంలో నీకు నువ్వు తెలిసీ, తెలియని స్థితిలో నీ అందం నేను అనుభవించాను. అప్పట్నుంచీ నీమీద వ్యామోహం మరీ ఎక్కువైంది. పిచ్చికుక్కలా తయారయ్యాను. చాలారోజుల తర్వాత మళ్ళీ ఇదేచోట కలుసుకున్నాం. మాలతీ! వీడు స్పృహలో లేడు. ఉన్నా ఏమీ చేయలేడు. రా! నిన్ను తనివితీరా మళ్ళీ...." అంటూ చూట్టూ తిరిగి ఆమె మీదకు వచ్చాడు.

    మాలతి బెదిరిపోలేదు. అతన్ని అపహాస్యం చేస్తున్నట్లు పెద్దపెట్టున నవ్వింది.

    తెల్లబోయి ఆగి ఆమెకి పిచ్చిపట్టిందా అన్నట్లు చూశాడు.

    "తనివితీరా అనుభవిస్తావా? నేనంత మట్టిబొమ్మను అనుకుంటున్నావా? ఆటబొమ్మననుకుంటున్నావా? ఒకనాడు, అనేక కారణాలమూలంగా తెలిసీ తెలియని స్థితిలో నేనున్నప్పుడు జరిగిన పనికి, బలహీనతను ఆపాదించి దౌర్జన్యం చేద్దామనుకుంటున్నావా?"

    "మాలతీ! బెదిరించి తప్పించుకుందా మనుకుంటున్నావా?"

    "నా చేతిలోంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాల్సింది  నువ్వు."

    "అలాగా?" అంటూ మీదకు రాబోయాడు.

    శేఖర్ ఇంట్లో తిరగడానికి వాడుకునే చేతికర్ర మాలతి కాళ్ళదగ్గరే పడివుంది. ఊహించడానికి సాధ్యంకానంత వేగంతో ఆమె దాన్ని అందుకుని "రాస్కెల్! నన్ను నాశనంచేసే శక్తి నీకు వుందా?" అంటూ బలమంతా ఉపయోగించి ముఖంమీద కొట్టింది.

    "అమ్మా!" అంటూ శంకర్ రెండుచేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు.

    "నిన్ను అప్పుడే వదలను. నీ అంతంచూసి, నువ్వు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదులుతుంటే....." అంటూ ఉద్రేకంతో ప్రళయ కాల స్వరూపిణిలా అతని శరీరంమీద ఎక్కడపడితే అక్కడ ఆ కర్ర నాట్యం చేస్తోంది.

    అతను తట్టుకోలేకపోయాడు. నిలబడలేకపోయాడు. క్రిందపడిపోయి అటూ ఇటూ పొర్లుతున్నాడు. తల బ్రద్దలై నెత్తురు కారుతోంది.

    అయినా మాలతికి జాలి కలుగలేదు. "నువ్వు నా కళ్ళముందు చావాలి. అప్పుడే నాకు తృప్తి" అంటూ మళ్ళీ ఆ చేతికర్రని పైకెత్తింది.

    "అమ్మగారూ! అమ్మగారూ!" అంటూ గోపయ్య అరుస్తూ లోపలకు పరిగెత్తుకొచ్చాడు.

    "అమ్మగారూ! శాంతించండి. ఇలాంటి వెధవల్ని చంపటం మనకే ఆప్రతిష్ట."

    ఆమె చేతుల్ని బలంగా పట్టుకుని ఆపాడు.

    "ఒరేయ్! లేవరా" అంటూ క్రింద పడివున్న శంకరంను బలవంతంగా పైకి లేవదీశాడు.

    "ఆడదంటే ఇప్పటికైనా తెలిసొచ్చిందా? ఫో! ఈ రోజుని జ్ఞాపకం పెట్టుకుంటూ జన్మంతా గడుపు" చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటూ పోయి బయటకు ఒక్క త్రోపు తోశాడు.

    గోపయ్య తిరిగి లోపలకు వచ్చి విశ్వరూపం దాల్చినట్లుగా వున్న మలతికేసి విస్మయంగా చూస్తూ నిలబడ్డాడు.

    "గోపయ్యా! అయ్యగారికి శంకర్ పీడ వదిలిపోయింది. నా పీడ వుంచటం ఇష్టంలేదు. నే వెడుతున్నాను."

    "అమ్మగారూ!"

    "ఇది పరిష్కారం చెయ్యడానికి వీలులేని సమస్య. అపరిష్కృతంగానే వుంచి మీ అందర్నీ విడిచి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను."

    "అమ్మగారూ! ఇప్పటికే ఈ బ్రతుకు భారంతో ఎవరికీ చెప్పుకోలేని క్షోభతో, ఎవరూలేని ఒంటరితనంతో కుమిలిపోతున్నాను. ముందురోజులు ఎలా గడిపేది అమ్మగారూ?"