కొడుకును పెంచాల్సింది ఇలాగే!

 

రోజులు మారిపోయాయి, ఆడా మగా తేడాలు పోయాయి అని నాగరికులు ఎంత చెబుతున్నా... ఎక్కడో ఒకచోట ఆ భేదభావం కనిపిస్తూనే ఉంటుంది. నువ్విలా చేయలేవు అనో, ఇలా చేయడం నీవల్ల కాదు అనో, నువ్విలా చేయకూడదు అనో ఏదో ఒక సమయంలో మగవాళ్లు ఆడవాళ్లను అంటూనే ఉంటున్నారు. దానికి కారణం మగవాళ్ల యాటిట్యూడ్ అనేది పెద్దల వాదన. మరి మీ అబ్బాయి యాటిట్యూడ్ ఎలా ఉందో ఎప్పుడైనా గమనించారా? మీకు కనుక కొడుకు ఉంటే... తనకి మీరు కొన్ని విషయాలు చిన్నతనం నుంచే చెప్పండి, నేర్పండి. రేపు పెద్దయ్యాక తను ఆదర్శవంతుడవ్వాలంటే ఇది తప్పనిసరి.

- ఏడవొద్దు అని మీ అబ్బాయికి ఎప్పుడూ చెప్పకండి. చాలామంది అంటుంటారు.. మగపిల్లలు ఏడవకూడదు అని. అంటే ఆడపిల్లలే ఏడవాలి అని పరోక్షంగా చెబుతున్నట్టే కదా. ఆడవాళ్లు ఏడుస్తూనే ఉంటారులే అనే యాటిట్యూడ్ తనలో పెరిగిపోదూ!

- ఆడపిల్లలను తప్ప మగపిల్లలను తల్లులు వంట పనిలో సాయమడగరు. అదీ తప్పే. వంట ఆడవాళ్లే చేయాలని లేదు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న చెఫ్స్ లో అత్యధికులు పురుషులే. అలా అని కెరీర్ కోసం వంట కాదు. ఇప్పుడు అలవాటు చేస్తే రేపు పెద్దయ్యాక భార్యకు సాయపడే అలవాటు వస్తుంది. ఇల్లు తుడవడం, గిన్నెలు కడగడం వంటివి మగపిల్లలు చేయకూడని పనులేవీ కాదని తప్పకుండా చెప్పండి.

- ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు కూడా ఉంటే వాళ్లని ఎప్పుడూ సమానంగానే చూడండి. ఏ విషయంలోనూ అబ్బాయికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అమ్మాయిని తక్కువ చేయకండి.

 

 

- మగపిల్లలు మరీ సౌమ్యంగానో, సుకుమారంగానో ఉంటే ఏంటి ఆడపిల్లలాగా అంటుంటారు. దాంతో మగాడు రఫ్ గా ఉండాలి అన్న భావన పేరుకుపోతుంది. తర్వాత ఏమవుతుందో మీకు వేరే చెప్పాలా?
- ఆడపిల్లలతో గౌరవంగా మాట్లాడటం నేర్పించండి. చెల్లెలయినా సరే కొట్టడం, తిట్టడం చేయనీయకండి.

- ఆడపిల్లల విలువేంటో తెలియజేయండి. చరిత్రలో గొప్ప గొప్ప మహిళల కథనాలు చెప్పండి. ఆడపిల్లలు కూడా చాలా సాధించగలరు అన్న నమ్మకం చిన్ననాటే ఏర్పడితే... ఆడవాళ్లను తక్కువగా చూసే అలవాటు రాదు.

- పిల్లలు టీవీ చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్లను బలహీనంగా చూపించేవి, తప్పుగా చూపించే వాటిని చూడనివ్వకండి. కొన్నిసార్లు వాళ్ల చిన్ని బుర్రలకి అవి తప్పుగా అర్థమైతే తర్వాత వాళ్ల ఆలోచనాధోరణిపై, వ్యక్తిత్వంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

చిన్నతనంలోనే ఇంత అవసరమా అనుకోకండి. మొక్కై వంగనిది మానై వంగదు. చిన్నప్పుడు నేర్పలేనిది పెద్దయ్యాక నేర్పలేరు. పిల్లల మనసులు తెల్ల కాగితాలు. వాటిపై మొదటే మంచి అక్షరాలు రాయండి. వాటినే జీవితాంతం చదువుకుంటూ ఉంటారు. పాటిస్తూ ఉంటారు. ఆదర్శంగా నిలబడతారు.

- Sameera