ఆ గ్లాసు పూర్తయింది. మరోగ్లాసు నింపుకుని త్రాగుతున్నాడు. ఇంతలో అడుగుల చప్పుడయి తల త్రిప్పిచూశాడు. గుమ్మంలో సీత నిలబడి ఉంది. ఆ రాత్రి పదిగంటల సమయంలో, హరికేన్ దీపం వెలుతురులో అసలే నల్లగా ఉండే సీత అతనికి మరింత నల్లగా కనబడింది.

 

    కళ్ళతో సౌంజ్ఞచేస్తూ "ఓ సీతా! మైడార్లింగ్! అంటే నా అర్ధాంగి కమిన్" అన్నాడు.

 

    సీత కదల్లేదు. అక్కడే నిలబడి అతనివంకే దీనంగా చూస్తోంది.

 

    "వస్తే లోపలికైనా రా! లేకపోతే బయటకు పో. ఎటూ గాకుండా మధ్యగా నిల్చుంటే చెడ్డ అసహ్యం నాకు."

 

    ఆమె లోపలకు వచ్చింది. తమ మాటలు ఎవరికైనా వినిపిస్తాయేమోనన్న భయంతో తలుపులు దగ్గరగా మూసి, అతను కూర్చున్న చోటికి వచ్చి బొటనవేలితో నేలనురాస్తూ తలవంచుకు నిలబడింది.

 

    మత్తెక్కి మసక మసగ్గా కనిపిస్తూన్న కళ్ళతో అతడామెవంక చూశాడు. ఆకుపచ్చరంగు చీరెకట్టుకుని, తెల్లజాకెట్టు వేసుకుని, ఆరోగ్యంగా పొంకంగా కనిపిస్తూన్న ఆమెను చూసి ఆశ్చర్యపడ్డాడు. విశాలమయిన గుండ్రని కళ్ళచుట్టూ కాటుక పెట్టుకుంది. సిగలో తెల్లని పువ్వుల దండ మెరుస్తూ, సువాసనలను విరజిమ్ముతోంది. తాచుపాములా నడుము క్రింది వరకూ సాగిన జడని చూచి విస్మతుడైనాడు. అచ్చుపోసిన ఉత్తమవంశపు పల్లెటూరి పిల్లలా ఉన్న సీత ఆ సమయంలో అతనికి ఆకర్షణీయంగానే కనిపించింది.

 

    "నేను నీ భర్తని. అయిదు సంవత్సరాల క్రితం మనకు పెళ్ళయింది. నువ్వు నన్ను గుర్తుపట్టావా?" అన్నాడు శాయి ఆమె ముఖంలోకి చూస్తూ.

 

    ఆమె కంటిలోంచి టప్ మని ఓ నీటిబిందువు జారిపడింది. హఠాత్తుగా అతని పాదాలమీద వాలి తన చేతులతో వాటిని కళ్ళకద్దుకుంది.

 

    అతను తన పాదాలను వెనక్కి లాక్కుని "లే లే! ఇలాంటి చాదస్తాలంటే నా కసహ్యం, లేచి నిల్చుని ఎంతసేపయినా కబుర్లు చెప్పు. చక్కగా వింటాను. అంతేగాని మనమేమయినా నాటకంలోని పాత్రధారులమా ఏమిటి, యిలాంటి చేష్టలు చెయ్యడానికి?" అన్నాడు విసుగ్గా.

 

    "నాకున్న ఒక్క సౌభాగ్యమూ మీరే! ఎలా గుర్తుపట్టననుకున్నారు?" అన్నది సీత డగ్గుత్తికతో. "తృప్తి తీరా నన్ను కళ్ళ కద్దుకోనివ్వండి. సంవత్సరాలుగా యీ శుభసమయం కోసమే ఎదురుచూస్తున్నాను." అని అతని పాదాలమీద మళ్ళీ చేతులు వేయబోయింది.

 

    "ఉష్. అట్లాంటివి వద్దని చెప్పానా? క్రిందనుండి లే ముందు. ఈ గదిలో బోలెడు కుర్చీలున్నాయి. ఒకటిలా దగ్గరగా లాక్కుని కూర్చో. తర్వాత నీ సెంటిమెంట్స్ చెప్పు. ఆలకిస్తాను.

 

    ఆమె లేచి బల్ల నానుకుని నిలబడి "ఫర్వాలేదు నిలబడే ఉంటాను" అన్నది మృదుకంఠంతో . అతను మళ్ళీ ఓ గుక్క త్రాగి, ఓ నిముషమాగి "ఏమీలేదు. పెళ్ళయాక నీతో మూడురోజులే వున్నాను. ఆ మూడు రోజులూ కూడా నీ వంక కన్నెత్తి చూడలేదు. పన్నెత్తి పలకరించలేదు. నాన్నగారు పోయినప్పుడు కర్మ చేయటానికి వచ్చినప్పుడు కూడా నిన్ను ఒకసారి కూడా కలుసుకుని మాట్లాడలేదు, సరే పెళ్ళిలో తలఎత్తి నన్నెలాగూ చూసి ఉండవు. అందుకని గుర్తుపట్టావా అని అడిగాను." అన్నాడు శాయి మంద్రస్వరంతో.

 

    సీత నల్లని పెదవులపై చిరుహాసం ఉదయించింది. ఆమె అమాయకమైన ముఖంమీద తరుణకాంతి, లజ్జారుణిమ చిందాయి.

 

    "పెళ్ళిలో మిమ్మల్ని చూడలేదనుకున్నారు. వందలసార్లు చూశాను మీకు తెలియకుండా. మీ స్పర్శ నాకు తగిలినప్పుడల్లా నాలో కోటినేత్రాలు తెరుచుకునేవి. ఆ మూడు రోజులూ మీరు నన్ను తిరస్కారభావంతో చూసినా నావంక ముఖం ఎత్తి చూడకపోయినా, మిమ్మల్ని ఎన్నోసార్లు కనులు వాచిపోయేటట్లు చూస్తూనే ఉన్నాను. మామగారు మరణించినప్పుడు మీరు వస్తే, మీకైతే నాయందు దయగలగలేదు గాని, నేను మీ నీడలా అంటిపెట్టుకు తిరిగాను" తృప్తి, తన్మయత కూడిన కంఠంతో అన్నది ఆమె.

 

    "అలానా? అమాయకురాలి వనుకున్నాను. గడుసుదానివే సుమా! అన్నిసార్లు చూశావుకదా నావంక - ఏమనుకున్నావేం నా గురించి?"

 

    ఆమె సమాధానం చెప్పటానికి సిగ్గుపడింది. "ఏమనుకుంటాను? మీ పాదాలకు దాసోహమైనాను" అన్నది చివరకు.

 

    అతను నివ్వెరపోతూ ఆమెవైపు చూశాడు. ఇంత బలీయమైన మనస్తత్వం భరించటం అతనికి కష్టంగా ఉంది. అదే ఆశ్చర్యం! దూరం నుంచి చూస్తే యీ సృష్టిలోని ప్రతి ఒక్క అంశమూ సామన్యంగానో, అసామాన్యంగానో, పనికిమాలినదిగానో,  ప్రయోజనంలేనిదిగానో కనిపిస్తుంది. దగ్గరకువెళ్ళిచూస్తే నిజరూపం అసలు అభిప్రాయాన్ని తారుమారు చేస్తుంది.

 

    అతని నిషా దిగిపోయినట్లయింది. తన ప్రమేయం లేకుండానే తనని అంటిపెట్టుకుని, పెనవేసుకుని తన పరిసరాలలో తచ్చాడుతూందన్న సత్యం అతని నరనరాల్ని కదిలించింది. తను పెళ్ళిచేసుకోక మునుపు చాలా సంవత్సరాలకు పూర్వమే యీ జీవి ఎక్కడో జన్మించింది. తన కోసం పెరిగింది. ఇప్పుడు తనని లతలా అల్లుకొనటానికి ప్రయత్నిస్తోంది.

 

    అతని కేమనటానికీ తోచక "నేను విదేశాలనుండి తిరిగి వచ్చాక యింత వరకూ రోజూ నువ్వు యీ గదికి రావడానికి సాహసించలేదు. అవతలి గదిలోనే వంటరిగా పడుకునేదానివి. ఇవాళ నీకేం జరిగింది? ఎందుకు నా గదిలోకి అడుగుపెట్టావు?" అని ప్రశ్నించాడు.  

 

    తెరిచివున్న కిటికీలగుండా చలిగాలి గది లోపలకు వ్యాపిస్తూ శరీరాలకు స్పందన కలుగజేస్తున్నది. తోటలోని చెట్లు గాలికి నెమ్మదిగా ఊగుతూ కిటికీగుండా చూస్తే చీకటిలో ఏదో అదృశ్యశక్తి తాలూకు అస్పష్ట హస్తాల్లా గోచరిస్తున్నాయి. క్రింద పశువుల చావడిలోని గేదెలు, ఆవులు చలిబాధకు తట్టుకోలేక అప్పుడప్పుడూ జాలిగా అరుస్తున్నాయి. ఆ పల్లెటూళ్ళో వీళ్ళిరువురూ తప్ప సమస్త ప్రజానీకం నిద్రపోతున్నట్లు అంతటా నిశ్శబ్దం అలుముకుని వుంది.   

 

    సీత కష్టంమీద నిట్టూర్పు ఆపుకుంది. కంటిలోని నీరు కారకుండా అణుచుకున్నది. విచలిత కంఠంతో అన్నది "అది మనకోసం నిర్దేశించబడిన పడకగది. మీరు ఇక్కడికి రాకముందు అత్తగారితో బాటు నేనూ క్రింద గదుల్లోనే పడుకునేదాన్ని. ఇప్పుడు మీరు వచ్చారు. పతి సన్నిధానంలోనే పడుకోవటం ఏ స్త్రీ కైనా విధి. నేనూ రోజూ మీ కోసం ప్రక్క సర్దివుంచి యీ రోజు వస్తారు. యీరోజు వస్తారు అని ఎదురుచూస్తున్నాను. మీ కరుణాకటాక్షం మాత్రం నా మీద ప్రసరించబడలేదు. ఈ గదిలోనే సోఫాలో పడుకుని గడిపివేస్తున్నారు. ఎన్నిసార్లో రాత్రులు వచ్చి చూశాను. మీరు బాగా త్రాగి, ఆ మైకంలో ఏదో కలవరిస్తూ నిద్రపోతూండేవారు. తెల్లవారితే పనివాళ్ళూ, అత్తగారూ చూస్తారని ఆ గ్లాసులూ, సీసాలు నేను తీసి బీరువాలో దాచి వేస్తున్నాను. కాని అత్తగారికి మన గురించి అనుమానం పీడిస్తోంది. మనిద్దరి పడక గురించి గుచ్చి గుచ్చి అడుగుతోంది. ఇవాళ మరీ గట్టిగా పీడించి తనమీద వొట్టు వేసి చెప్పమని కూర్చున్నారు. అందుకని ఇప్పుడు వచ్చాను.