నేను లోపలికెళ్ళి భోజనం చేసి వంటగది కెదురుగ్గా వున్న స్థలంలో పడుకున్నాను. బాగా అలసిపోయిన శరీరంకాబట్టి వెంటనే నిద్రపట్టేసింది.

 

    ఎప్పుడో ఓ వేళప్పుడు మెలకువ వచ్చింది. బాగా చలిగా వుంది. దుప్పటి తీసుకుందామని స్టోర్ గదిలోకి వెళ్ళాను. ఆ గది బెడ్ రూమ్ కెదురుగ్గా వుంది. అందులోంచి మాటలు వినిపిస్తుండడంతో అటుచూశాను. తలుపులు కూడా వేసుకోకుండా ఆనంద్, శ్రీలక్ష్మి ఒకే బెడ్ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

 

    ఆమె చేతిలో నెక్లెస్ మెరిసిపోతోంది. అతనికి దాన్ని చూపిస్తూ "తీసుకో ఆనంద్. దీన్ని తీసుకుని వెళ్ళి కరెంట్ కు డబ్బు కట్టేయి. కరెంట్ కనెక్షన్ తీసుకుని పని ప్రారంభించు. కరెంట్ కనెక్షన్ లేకుండా నీ పవర్ ట్రామ్స్ ఇండస్ట్రీ ప్రారంభం కాకపోవడాన్ని గురించి తలుచుకుంటుంటే - చాలా బాధగా వుంటుంది" అంది.

 

    "మరి దీన్ని గురించి నీ భర్త అడిగితే?" అతను సందేహం వెలిబుచ్చాడు.

 

    "నేనేదో చెప్పుకుంటాలే. ఈ నగలు వేసుకోవడం కూడా లేదు. ఆయన దీన్ని గుర్తుపెట్టుకుని అడిగితే లాకర్ తీసుకుని నగలన్నీ అందులో పెట్టేస్తాం అని యిన్ని రోజులు పోరుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. కాబట్టి దీన్ని నువు తీసుకునివెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయి" అని ఆమె బలవంతంగా నెక్లెస్ ను అతని చేతిలో పెట్టింది.

 

    అతను ఇబ్బందిగానే తీసుకున్నాడు. వాళ్ళు నన్ను గమనించలేదు. దుప్పటి తీసుకుని వచ్చేశాను.

 

    ఆనంద్ మరో రోజు కూడా వుండి వెళ్ళిపోయాడు.

 

    ఆయన వెళ్ళిన నాలుగురోజుల తరువాత శ్రీలక్ష్మి భర్త వచ్చాడు. రెండు రోజుల తరువాత ఆఫీసర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో శ్రీలక్ష్మి భర్త ముందు జాగ్రత్తచర్యగా నగలు దాచుకోవటానికి బ్యాంక్ లాకర్ తీసుకున్నాడు.

 

    ఇంటికొచ్చి భార్యను నగలు అడిగాడు. ఆ సమయంలో నేను అక్కడే వున్నాను.

 

    నగలు అడుగుతున్న భర్తను చూసి ఖంగుతింది శ్రీలక్ష్మి. ఒక్కసారి ఒంట్లోని రక్తమంతా మెదడులోకి చిమ్ముకొచ్చినట్టు మొద్దుబారి పోయింది. బేలగా చూస్తున్న భార్యను గద్దించి అడిగాడు అతను. "నగలు యివ్వమంటే అలా పిచ్చిపట్టిన దానిలా చూస్తావేమిటి? నువు చెప్పినట్లే లాకర్ తీసుకున్నాను.కాలం ఏమీ బాగాలేదు. విలువైన నగలు ఇంట్లో వుండడం డేంజర్. ఆ ఒక్క నెక్లెసే ఈరోజుల ధరల్లో నలభై వేలదాకా వుంటుంది.

 

    నా చేతిలో వున్న బిందె జారి కిందపడింది. నేనే అంత బెదిరిపోతే ఇక శ్రీలక్ష్మి పరిస్థితి ఎలా వుంటుందో వూహించలేకపోయాను. నెక్లెస్ అన్న మాటే నాకు పాములా మెడకు చుట్టుకున్నట్టే వుంది.

 

    కొంతసేపటికి తేరుకుంది ఆమె.

 

    "ఇప్పుడు లాకర్ ఎందుకండీ? నగల్ని నేను భద్రపరిచాను. మీరు ఆ వర్రీ వదిలి నిశ్చింతగా వుండండి" అంది.

 

    "నో... నో... లాకర్ ఆల్ రెడీ తీసుకున్నాను. నిన్ను ఒకసారి ఆశ్చర్యపరుద్దామని ఇలా నీతో చెప్పాపెట్టకుండా తెచ్చాను. మన నగలు సేఫ్ గా వుండాలంటే లాకర్ మంచిది" అన్నాడు ఆయన.

 

    ఎంత సర్ది చెప్పినా ఆయన వినలేదు. నగలు తీసుకురమ్మన్నాడు. వాళ్ళిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. చివరికి ఆయనే బీరువా తలుపు తెరిచి లోపలున్న నగల్ని బయటకు తీశాడు. అన్నీ పరిశీలించాక అడిగాడు "నక్లెస్ ఎక్కడ?"

 

    ఆమె అదిరిపడడం నాకు కనిపిస్తోంది.

 

    "వుంటుంది బాగా చూడండి" అంతకంటే ఆ సమయంలో ఏమీ చెప్పలేకపోయింది.

 

    అతను అటూ ఇటూ వాటిని కదిపాడు "లేదు" అన్నాడు సీరియస్ గా.

 

    ఇలాంటి సంఘటనకు ఆమె ప్రిపేర్ కాకపోవడంవల్ల ఏదైనా వ్యూహం పన్నలేకపోయింది. "వుంది చూడండి" అని మరో అబద్ధం చెప్పే ఛాన్స్ కోల్పోయింది.

 

    మౌనంగా, బొమ్మలా నిలబడిపోయిన శ్రీలక్ష్మినిచూసి అతను రెచ్చిపోయాడు. ఒక్క ఉదుటున లేచివెళ్ళి ఆ చెంపా ఈ చెంపా వాయించాడు.

 

    ఆమెలో చలనం లేదు.

 

    కసిగా మళ్ళీ కొట్టాడు. ఆమె జవాబు చెప్పలేకపోవడం అతని అహాన్ని దెబ్బతీస్తోంది. క్షణక్షణానికీ అతనిలో కోపం ఎక్కువవుతోంది. ఇష్టం వచ్చినట్లు బాది-

 

    "మరో అయిదు నిముషాల్లో నెక్లెస్ ఏమైందో చెప్పకపోతే అటో ఇటో తేలిపోతుంది. ఇక్కడినుంచి నేరులా లాయర్ దగ్గరికి వెళతాను. విడాకుల కోసం" అన్నాడు చివరి రెండు పదాలను ఒత్తి పలుకుతూ.

 

    ఎందుకనో ఆ మాటలకు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మా స్వంత అక్క సంసారం ముక్కలైపోతున్నట్లు బాధపడిపోయాను. శ్రీలక్ష్మి లాంటి మంచి అమ్మాయికి రాకూడని కష్టం అది. ఏదో తెలియని తెగింపు నాలో ప్రవేశించింది. చకచకా నిర్ణయం జరిగిపోయింది .

 

    దెయ్యం ఆవహించిన దానిలా నడుచుకుంటూ అతని ముందుకెళ్ళి నిలబడ్డాను. మూడోపాత్ర ప్రవేశించేసరికి ఆశ్చర్యపోయాడు.

 

    "అమ్మగారిని ఏమీ అనకండి. ఆ నెక్లెస్ ను నేనే రెండురోజుల క్రితం దొంగిలించాను. కువైట్ నుంచి వచ్చిన మా పెద్దనాన్నకు ఇచ్చిపంపాను" అన్నాడు.

 

    అతను నమ్మలేనట్టు నావైపు చూసి "దొంగిలించావా?" అన్నాడు.

 

    "అవును! కావాలంటే అది ఎలా వుంటుందో చెబుతాను" అని ఆ రాత్రి మసకరాత్రి మసక వెలుతురులో నేను చూసిన నెక్లెస్ ను వర్ణించాను.

 

    అతను అప్పటికి నమ్మాడని అతను నా కొప్పు పట్టుకుని కిందకు గుంజి గుద్దడం వల్ల గ్రహించాను.

 

    శ్రీలక్ష్మి ఈ షాక్ నుంచి తేరుకునే ముందు అతను నన్ను బయటకు తీసుకుపోవాలని వేయిదేవుళ్ళకు మొక్కుకున్నాను. దేవుడు నా మొర విన్నట్టు అతను నన్ను గుంజుతూ "దొంగముండా! నిన్ను పోలీసులకు అప్పగిస్తానే" అని బరబరా లాక్కుపోయాడు.

 

    పోలీసులు నన్ను ఎలా ట్రీట్ చేయాలో అలా చేశారు. నాపై చోరీకేసు పెట్టారు. అంతకు ముందు కాలనీలో జరిగిన దొంగతనం కూడా నేనే చేశానని చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ రాత్రి ఎస్.ఐ.తో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్ళు రేప్ చేశారు."

 

    అంతవరకు చెప్పి రాధ దాదా ముఖంలోకి చూసింది అతను యెలాంటి రియాక్షన్ లేకుండా ప్లాట్ గా వుండడం చూసి ఆమె మరోమారు భయపడింది.

 

    "తరువాత!" అతను కఠినంగా అడిగాడు.