ఏటవాలుగా పడుతున్న సూర్యకిరణం వరప్రసాదానికి మేలుకొలుపు పాడుతున్నట్లు మృదువుగా అతని చెక్కిలిని ముద్దాడుతోంది.
    
    మెల్లగా లేచి కూర్చున్నాడు వరప్రసాదం. ఒక్కసారి వొళ్ళు విదిలించి చుట్టూ పరికించి చూశాడు. పెట్టెలాంటి చతురస్రాకారపు గుహది.
    
    ఒక్కక్షణం అఘోరీ బాబాని మనసులో తలుచుకొని ముందుకు నడిచాడు. నీలం, గోధుమ, ఆకుపచ్చ వర్ణాలతో ఆ ప్రదేశమంతా మెరిసి పోతోంది.
        
    ప్రకృతి అందాలు అతని ప్రయాణ వేగాన్ని తగ్గించకపోగా మరింత ఉత్సుకతని అతనిలో నింపి ముందుకు సాగనంపుతున్నట్టు నడుస్తున్నాడు విశ్రాంతి కూడా తీసుకోకుండా! అలసటనేది తెలియనట్టు!
    
    అప్పటికి మిట్టమధ్యాహ్నం అయిపోయినట్లు సమయాన్ని సూచిస్తూ సూర్యుడు నడినెత్తిమీదకి చేరుకున్నాడు. అదే సమయంలో అతను చేరుకున్న ప్రదేశాన్ని తెలియచేస్తూ హిందీలో రాసున్న "తవాఘాట్" అన్న బోర్డు కనిపించింది.
    
    మరికొంచెం ముందుకు నడిస్తే అక్కడ కనిపించిందో చిన్న దుకాణం.
    
    వరప్రసాదం అక్కడికి చేరుకొని నీళ్ళతో ముఖం కడుక్కుని అక్కడ దొరికిన చుక్కారొట్టెలు, దుంపల కూరలతో పొట్ట నింపుకుని డబ్బులు చెల్లించాడు.
    
    అతనికి సహకరించటానికా అన్నట్లు గుర్రాలని బాడుగకు యిచ్చే వాళ్ళు కనిపించారు.
    
    వరప్రసాదాన్ని వెనక కూర్చోపెట్టుకుని ముందుకు సాగిపోయాడు బాడుగవాడు. తొమ్మిది కిలోమీటర్ల దూరంలో వున్న 'పంగూ' అనే ప్రదేశానికి అతన్ని అరగంటలో తీసుకుపోయింది గుర్రం ఆ వ్యక్తికి బాడుగ యిచ్చి మళ్ళీ కొంతదూరం నడిచాడు.
    
    ముందుగా అతనికి తగిలింది సిర్కా! అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు గుర్రంతో ఉత్తరప్రదేశ్ వాడిలా వున్నాడు. వరప్రసాదం వైపు ఆశ్చర్యంగా చూశాడు.
    
    అతను మానస సరోవర్ దగ్గరున్న కైలాస పర్వతానికి వెళ్ళాలి అనగానే ముందు ఆశ్చర్యపోయాడు. అసలా సమయంలో మిలట్రీ జవాన్లే ఎక్కడా కనపడరు. అటువంటిది ఈ ముసలివాడికిదేం పిచ్చి అనుకున్నాడు. వరప్రసాదం డబ్బుతీసి అతని చేతిలో పెట్టాడు. లెక్క పెట్టుకుని ఆశ్చర్య పోయాడతను. వందరూపాయల నోట్లు పది!
    
    "ఏక్ హజార్!" ఆశ్చర్యానందాలతో అనుకుని మౌనంగా అతన్ని గుర్రం ఎక్కించుకుని గాలా, మాల్వా, బుద్ది, గంజి, కాలపానీ (ఈ ప్రదేశంలో ఉన్న కాళీమాత ఆలయం దగ్గర్నించీ కాళీనది మొదలవుతుంది) నవిడాంగ్ (ఇక్కడ ప్రకృతి సహజంగా ఏర్పడిన 'ఓం' కారం వుంది. నవిడాంగ్ సమీపంలోని పర్వత శిఖరాలపై మంచుతో ఏర్పడినది ఈ ఓంకారం వీక్షించడం ఓ అపురూపమైన దృశ్యం) లేపు లేక్ పాస్, తక్లాకోట్ వరకూ తీసుకెళ్ళి దింపాడు. వరప్రసాదం ముందుకు నడుస్తుండగా అతను హిందీలో యిలా అన్నాడు-
    
    "ఏ బాబూ! జరా నమాల్ కే ఆగే జానా! చైనా మిలిట్రీ లోగ్ పకడ్ లేగా నైతో" అన్నాడు.
    
    "సమజ్ గయా! ధన్యవాద్" అని ముందుకు నడిచాడతను.
    
                                                  *    *    *    *    *
    
    అప్పుడే ఆ గదిలోకి వచ్చాడు డాక్టర్.
    
    అభిరాం కళ్ళు మూసుకుని ఆలోచనల్లో వున్నాడు. తిరుపతి ఎక్కడా కనిపించలేదు. మనస్విని నిస్త్రాణంగా మహదేవ్ బెడ్ మీద తలుంచి అచేతనంగా చైర్ మీద కూర్చుంది. ఎదురుగా కన్పించిన దృశ్యం చూసి ఒక్కక్షణం నోటమాట రాలేదు డాక్టర్ కి.
    
                                                  *    *    *    *    *
    
    క్ర్తమంగా వెలుగు పలచబడుతుంది. హృదయానికి మరింత ప్రశాంతత చిక్కుతున్న అనుభూతి...
    
    ఎప్పుడో చూసిన ఆ పరిసరాలు నిన్న మొన్ననే చూసినట్లు అనిపిస్తున్నాయ్ వరప్రసాదానికి.
    
    గుర్రబ్బండివాడు హెచ్చరించినట్లు ఎవ్వరూ అతని మార్గానికి అడ్డు రాలేదు.
    
    "సమీపిస్తున్నాను....అఘోరీ బాబాని సమీపిస్తున్నాను" గొంతెత్తి పెద్దగా అరవాలనిపించింది అతనికి.
    
    సరిగ్గా అప్పుడే జరిగిందా సంఘటన-
    
    గాలి విసురుగా ఈడ్చి ఈడ్చి కొడుతూ... మంచుని పైకి లేపుతూ-సుడులు తిరగసాగింది.
        
    హోరుమంటూ రొద....చెవుల్లోని కర్ణభేరి పగిలిపోయేలా వరప్రసాదం చుట్టూ చూశాడు.
    
    తల దాచుకోవటానికి ఒక గుహకానీ నివాసయోగ్యమైన స్థలం కానీ కనిపించలేదు.
    
    కనుచూపు మేరంతా దూదిలాంటి తెల్లని మంచే!
    
    "అఘోరీ బాబా.... అఘోరీ బాబా..." ధైర్యం కూడగట్టుకుని ప్రార్దించాడు.
    
    మరింత జోరు సంతరించుకుంది గాలి... క్రమంగా మంచు తుఫానుగా మారింది.
    
    వరప్రసాదం మనో నిబ్బరం కోల్పోకుండా దృష్టినంతటినీ అఘోరీ బాబా మీదే నిలిపాడు.