ఆమె ఉలిక్కిపడి చూసింది. వెంటనే ఆ చేతిని గట్టిగా పట్టుకుంది. ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్లుగా ఆమె కింద పెదవిని పంటితో బిగబట్టింది. ఆ తర్వాత సూటిగా కిరణ్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది-
    
    "కిరణ్ నేనంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను."
    
    అనుకోని ఆ ప్రశ్నకు కిరణ్ కాస్త షాక్ తిని వెంటనే సర్దుకుని - "ఇష్టమా కాదు ప్రాణం. నీకోసం ఆర్నెల్లనుంచి పడిగాపులు పడ్తున్నాను తెలుసా?" అన్నాడు.
    
    "నాకోసం ఏమైనా చేస్తావా?" ముఖంలోను, గొంతులోను ఏ భావం కనబడకుండా అడిగింది చాయ.
    
    "నా ప్రాణాలైనా ఇస్తాను" వెంటనే అన్నాడు.
    
    "ప్రాణాలా? అవెందుకు? అటుచూడు" ఆమె చుట్టూవున్న జంటల వైపు కళ్ళతో చూపిస్తూ అంది.
    
    "వాళ్ళు పొందుతున్న ఆనందం అంతా నాకు కావాలి. ఆ తెల్లచుడీదార్ అమ్మాయి కాలికున్న స్లిప్పర్స్ చూడు. ఆ రెడ్ టీషర్టు వేసుకున్న అమ్మాయి మెడలోని లాకెట్ చూడు..... వాళ్ళు వేసుకున్న నెయిల్ పాలిష్ దగ్గర్నుంచీ జుట్టుకి పెట్టుకున్న క్లిప్స్ వరకూ అన్నీ నాకు కావాలి. నాకు దాహంగా వుంది. మొత్తం ఆనందాన్ని ఒకేసారి త్రాగేయాలనిపించేంత దాహం.....ఇవ్వగలవా?"
    
    చాయ కళ్ళల్లోని అదోలాంటి తీక్షణత అతనికి వెరపు కలిగించింది.
    
    ఆమె మెత్తని చెయ్యి అతని చేతిని హత్తుకుపోతూ వుంటే గులాబీ రంగు పెదవుల్ని, నక్షత్రకాంతులీనే ఆమె కళ్ళనీ తమకంగా చూస్తూ- "ఎస్ మైడియర్.....మై లవ్, నీకోసం ఏవైనా చేస్తాను. ఆ ఆనందాలన్నీ నీకు స్వంతం చేస్తాను. నీ పెదవి అంచున మెరిసే చిరునవ్వు కోసం నా ప్రాణాలు త్యాగం చేయాల్సి వచ్చినా సందేహించను" ఉద్రేకంగా అన్నాడు కిరణ్.
    
                                              * * *
    
    "ఎస్! నీకోసం ఏమైనా చేస్తాను. అన్నీ అందిస్తాను" అన్న కిరణ్ మాటలు చాయకి మాటిమాటికి మధురంగా గుర్తొస్తూనే వున్నాయి. అయినా ఏదో అసంతృప్తి వుంది.
    
    ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. కళ్ళు మూసుకున్నప్పుడల్లా తను ఐస్ క్రీమ్ పార్లర్ లో చూసిన అమ్మాయిలే కనిపిస్తున్నారు. కారు డోర్లు స్టయిల్ గా వేస్తూ వాక్ మెన్ వింటూ హైహీల్స్ టకటకలాడించుకుంటూ విరగబడి నవ్వుతూ, తనని పరిహసిస్తున్నట్లు అనిపిస్తోంది. చాయకి తన వంటిమీదున్న నైటీ ముక్కలు ముక్కలుగా చింపేసుకోవాలనిపిస్తోంది.
    
    "నో! నేను మీకంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఆనందంగా వుండాల్సిన దానను. నా అందానికి, తెలివికీ ఇలాంటి చీకటి కొప్పంలో మగ్గాల్సిన దాన్నికాదు. నన్ను ఈ నరకం నుండి ఎవరైనా బయటపడేయండి ప్లీజ్" అని అరవాలనిపించింది. ఎంతో కసిగా వుంది. ఉక్రోషంగా వుంది. ఆవేదనగా వుంది. ఏదో చేసేయాలని తిక్కతిక్కగా వుంది. కళ్ళు మూసుకుంటే పీడకలలు వస్తాయేమోనని భయంగా వుంది. అందుకే చాయ కళ్ళు తెరుచుకునే పడుకుంది.
    
    గోడమీద పెద్ద కొబ్బరాకు నీడ పడుతోంది. అది గాలికి ఊగినప్పుడల్లా జడల దయ్యం వికటాట్టహాసం చేస్తున్నట్లు వికృతంగా వుంది. మాటిమాటికీ ఓ భయంకర దృశ్యం ఆమెని భయపెడుతోంది.
    
    దుర్గంధభూయిష్టమైన చెత్తకుండీ చుట్టూ ఈగలు, పేడ పురుగులు, ఎంగిలి విస్తరాకులకోసం కొట్లాడుకుంటూ గజ్జికుక్కలూ, కారు చీకట్లో కేవలం ఆ కుళ్ళు రొచ్చు వాసనవల్ల అక్కడో చెత్తకుండీ వున్నట్లు తెలుస్తోంది. అందరి ఇళ్ళల్లో మిగిలిపోయిన చెత్త, కుళ్ళిపోయిన, పనికిరాని చెత్తపారేసే చోటులో ఎవరో ఓ బట్టల మూట విసిరిపారేశారు. అది మూటే కానీ లోపల ఓ ప్రాణి వుంది. అప్పుడే ఈ లోకం గాలి పీల్చి జీవం పోసుకున్న మాంసం ముద్ద. ఆ పెంటకుప్ప మీద పడి కేర్ కేర్ మంది. ఓ కుక్క వాసన చూసింది. ఓ ఎలుక పైనుంచి పరిగెత్తింది. ఆ ప్రాణి ఆపకుండా ఏడుస్తూ తన ఉనికిని చాటుతూనే వుంది. ఓ పంది నోరు పెట్టబోయింది. ఇంతలో ఎవరో అదిలించారు. ఆ పసిప్రాణిని చెత్తకుండీలోంచి బయటకి తీసారు.
    
    "నో" చాయ ఆ భయంకరపు వూహని తుడిచెయ్యాలని తల విదిలించినకొద్దీ ఆమెకి ఆ వూహే గోడమీద నీడలా అతిస్పష్టంగా కనబడి భయపెట్టసాగింది. దాదాపుగా ఆ వూహే గోడమీద నీడలా అతిస్పష్టంగా కనబడి భయపెట్టసాగింది. దాదాపుగా ఆ అనాధాశ్రమంలో వున్నా అందరూ అలా దొరికినవారే తనతో సహా.
    
    చాయ లేచి కూర్చుంది. తన ఎడమ అరచేతిని చూసుకుంది. "అసుమంటి.....ఇసుమంటి జన్మ కాదు, రాణీయోగం. పుట్టింది కోటలోనేగానీ దారి తప్పినావే కూన" అన్న కోయవాడి మాటలు గుర్తొచ్చాయి.
    
    "అవును! చాలా గొప్ప ఇంటిలో పుట్టి వుంటాను. నాది రాచపుట్టుకే. ఎవరు కాదంటారు? చూపిస్తాను. ఈ నవ్వుతున్న అందరికీ నేనేమిటో చూపిస్తాను. కాసులమీద నడవాల. నోట్లకట్టలమీదే పండాల. హాహాహా అని గట్టిగా విరగబడి నవ్వాలనిపించింది.
    
    "ఎవరు? ఇక్కడేం చేస్తున్నావ్?" చౌకీదార్ రాంసింగ్ గొంతు ఆ నిశీధిలో భయంకరంగా వినిపించింది.
    
    "నేను....నేనే కోమలిని" అన్న సన్నని గొంతు భయంభయంగా వినిపించింది.
    
    "ఇక్కడేం చేస్తున్నావ్ ఇంత రాత్రి?" గద్దించినట్లు బొంగురుగా అడిగాడు.
    
    "వెన్నెల బావుంది. చూస్తున్నాను కాసేపు వుండనివ్వు రాంసింగ్" కోమల అభ్యర్ధనగా అంది.
    
    "గవన్నీ పొద్దుగాల చూస్కో చెప్తుంటే వినొస్తలేదా? పోతావా..... వార్డెన్ అమ్మకు చెప్పాల్నా?" రాంసింగ్ గొంతు పెంచి అరిచాడు.
    
    వెన్నెల పొద్దుట చూస్కోమంటున్నాడు. చాయకి నవ్వొచ్చింది.
    
    కోమల తలుపు తోసుకుని లోపలికి వచ్చింది.
    
    చాయ పడుకునే ఆమెని గమనించసాగింది.
    
    "రోజూ తొమ్మిది గంటలకల్లా గుండెలమీద చేతులు వేసుకుని పడుకుని గురకపెట్టి నిద్రపోయేది. దీనికేం వచ్చింది ఈ వేళ?' అనుకుంది చాయ.
    
    కోమల కిటికీ దగ్గరకు నడిచింది.
    
    బయట అంతా చీకటి. కీచురాళ్ళ రొద మాత్రం కర్ణకఠోరంగా వినిపిస్తోంది. ఎక్కడో ఓ నక్క ఊళ పెడుతున్నట్లుగా సైరన్ మ్రోగుతోంది.
    
    చాయ లేచి వెళ్ళి కోమల భుజంమీద చెయ్యి వేసింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఎదురుగా వున్న చాయని చూసి బిత్తరపోయి ఇంకా పడుకోలేదా?" అని ఓ వెర్రి ప్రశ్న వేసింది.
    
    చాయ తల అడ్డంగా వూపి, ఆ రూంలోనే ఇంకో మూల పడుకుని నిద్రపోతున్న మంగళవైపు చూసింది. ఆమె మంచి నిద్రలో వుంది.
    
    "ఏమిటి సంగతి? ఏదో ఆలోచిస్తున్నట్లున్నావ్?" నెమ్మదిగా అయినా వాడిగా అడిగింది చాయ.