నిప్పులాంటి మనిషి! ఆమెలో 'ఫైర్' ఉంది! 

 

ఆడపిల్లవి నీకా పనులు అవసరమా అన్న మాట ఎన్నిసార్లు మన చెవిన పడుతుందో లెక్కే లేదు. హర్షిణీ కన్హేకర్ చెవిన కూడా ఆ మాట చాలాసార్లు పడింది. కానీ అది ఆమె మనసును తాకలేదు. ఆమె ఆలోచనల్ని ప్రభావితమూ చేయలేదు. చేసివుంటే... ఆమె ఎవరూ ఊహించని ఒక గొప్ప ఘనతను సాధించేది కాదు. 

   ఢిల్లీలోని శాస్త్రి నగర్ లో ఒక షూ ఫ్యాక్టరీకి నిప్పంటుకుంది. ఫైర్ స్టేషన్ కి కబురెళ్లింది. క్షణాల్లో సిబ్బంది వచ్చేశారు. మంటలు ఎగసిపడుతున్నాయ్. దగ్గరకు వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. దాంతో అగ్నిమాపక సిబ్బంది ఎదురుగా ఉన్న ఒక భవంతి ఎక్కారు. అక్కడ్నుంచి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. ప్రయత్నం ఫలించలేదు. పొగ కమ్ముకుంటోంది. ఏమీ కనిపించడం లేదు.

   

 

 

అలా అని ఆలస్యం చేస్తే ఫ్యాక్టరీ కూలిపోవచ్చు. దాంతో రిస్క్ తీసుకోక తప్పలేదు. సిబ్బంది ఫ్యాక్టరీ దగ్గరకు దూసుకెళ్లారు. ప్రాణాలొడ్డి మంటలార్పే ప్రయత్నం చేశారు. ఆరు గంటల పాటు కష్టపడి విజయం సాధించారు.

        

 

ఈ సాహసాన్ని అందరూ ఊపిరి బిగబట్టి చూశారు. అయితే వాళ్లు అలా చూడ్డానికి కారణం ఇంకొకటి కూడా ఉంది. ఆ ఆపరేషన్ మొత్తం ఓ మహిళ ఆధ్వర్యంలో జరుగుతోంది. మగవాళ్లతో పోటీపడుతూ నిప్పుతో చెలగాటమాడుతున్న ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విజయం సాధించాక ఆమెను వేనోళ్ల పొగిడారు. ఆమె ఎవరో కాదు... హర్షిణీ కన్హేకర్. మన దేశంలో తొట్ట తొలి మహిళా ఫైర్ ఫైటర్.

   

ఆడపిల్లని నిప్పుతో పోలుస్తారు. నిప్పులా బతకాలంటూ బోధిస్తారు. అదే ఆడపిల్ల నిప్పుతో చెలగాటమాడతానంటే నీకేమైనా పిచ్చా అంటారు. హర్షిణిని కూడా అలానే అన్నారు. ఏదీ దొరకనట్టు అగ్నిమాపక దళంలో చేరడమేంటి అన్నారు ఇంట్లోవాళ్లు. ఈ పిల్ల అసలేమనుకుంటోంది అంటూ నొసలు చిట్లించారు బయటివాళ్లు. చివరికి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్నవాళ్లు కూడా ఇది ఆడవాళ్లు చేసే పని కాదు అన్నారు. అయినా వెనకడుగేయలేదు హర్షిణి. వేసివుంటే ఇంత గొప్ప విజయం దక్కేది కాదు.

    నాగపూర్ లోని లేడీస్ ఎల్.ఎ.డి. కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేసి, అదే కాలేజ్ లో డిగ్రీలో చేరారు హర్షిణి. చదువులో నంబర్ వన్ కాకపోయినా ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మాత్రం టాప్. ఎన్నో కాంపిటీషన్లలో పాల్గొని విజేతగా నిలిచారు. అప్పుడే ఎన్.సి.సి.లో కూడా చేరారు. అది ఆమె మనసును సాహసాల వైపు మళ్లించింది. జీవితం ఎప్పుడూ చాలెంజింగ్ గా ఉండాలి అన్న భావన ఏర్పడింది. డిగ్రీ అయ్యాక ఎంబీయేలో చేరారు.

   

అది చదువుతూనే రకరకాల చాలెంజింగ్ కోర్సులకు అప్లై చేయడం మొదలుపెట్టారు. వాటిలో ఫైర్ ఇంజినీరింగ్ కోర్స్ కూడా ఉంది. కొన్ని రోజులకు నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నుంచి పిలుపు వచ్చింది. అయితే కోర్సులో చేయడం మాత్రం ఈజీగా అయిపోలేదు. ముప్ఫై సీట్లు మాత్రమే ఉన్నాయి. దానికి యూపీఎస్సీ స్థాయిలో పరీక్ష రాయాలి. క్వాలిఫై అయితే అబ్బాయిలతో కలిసి కఠినతరమైన శిక్షణ తీసుకోవాలి. ఇవన్నీ అధిగమించి, దేశంలో మొదటి మహిళా ఫైర్ ఫైటర్ గా రికార్డు సృష్టించారామె.

    

ఢిల్లీ, కొల్హాపూర్, ముంబై లాంటి నగరాల్లో ఎన్నో భయంకరమైన అగ్ని ప్రమాదాలను డీల్ చేసిన రికార్డు హర్షిణిది. పెద్ద పెద్ద భవంతులు కూలిపోయినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కూడా తనదైన శైలిలో సేవలు అందించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. మన దేశంలో ఫైర్ సర్వీస్ ని ఇంకా అభివృద్ధి చేయాలని, విదేశాల్లో మాదిరిగానే కొత్త కొత్త విధానాలు అవలంబించాలన్నది ఆమె ఆశయం. ఆ దిశగా అడుగులు వేస్తున్న హర్షిణి ఎందరితో ఆదర్శంగా నిలుస్తున్నారు.

    

  ఈ సాహసవంతమైన ప్రయాణం ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే... "ఆడపిల్లలు ఇవే చేయాలని అన్న అభిప్రాయాలు, నిబంధనలు నాకు నచ్చవు. అవకాశం దొరకాలే కానీ ఆడపిల్లలు మగవాళ్లకు దేనిలోనూ తీసిపోరు. అవసరమైతే వాళ్లతో సమానంగా రిస్క్ తీసుకోగలరు, సాహసాలు చేయగలరు అని నిరూపించాలనుకున్నాను. ఇప్పుడు ఈ రంగంలోకి చాలామంది ఆడపిల్లలు వస్తున్నారు. నాకు ఆనందంగా ఉంది" అంటారు హర్షిణి.

    నిజమే. అవకాశం దొరకాలే కానీ ఆడపిల్లలు పులిపిల్లల్లా గర్జిస్తారు. నిప్పుతో చెలగాటమాడతారు... నింగిని అందుకుంటారు. దానికి హర్షిణి లాంటి మహిళలే నిలువెత్తు నిదర్శనం!

-sameera