అప్పటివరకు పీటర్ ఓ వ్యక్తిని నియమించి సామంత్ మధుమతితో ఉండగా ఫోటోలు తీయించినట్లు అర్జునరావుకి తెలీదు.

 

    ఆ విషయం తెలీటంతో గెలుపు తనదే అన్న పూర్తి నమ్మకం వచ్చేసింది అర్జునరావుకి.

 

    "మాట్లాడు. మౌనంగా ఉంటే క్షమించి వదిలేస్తామనుకుంటున్నావేమో" అర్జునరావు పెదవుల మీద చిరునవ్వు వెలిసింది.

 

    "మాట్లాడదామనే వచ్చాను కాని ఎక్కడ మాట్లాడనిచ్చారు? ఇక ఇప్పుడు మాట్లాడటం వృధా అనిపిస్తోంది ఇప్పటికయినా బుద్ధిగా మసలుకుంటే అందరికీ మంచిది. వస్తాను" అంటూ సామంత్ ఆ ఇద్దరికేసి చూస్తూ తమాషాగా కన్నుగీటి అదృశ్యమయిపోయాడు.

 

    సామంత్ ధైర్యానికి ఆ ఇద్దరూ విస్తుపోయారు.


                              *    *    *    *


    ఎయిర్ కండిషన్డ్ గదిలో ఓమూలగా ఉన్న వాలు కుర్చీలో మంచు ముద్దగా మిగిలిపోయి వుంది నాగమ్మ.

 

    సామంత్ నెమ్మదిగా ఆ గదిలోకి అడుగుపెట్టాడు.

 

    "అలనాటి పలనాటి నాగమ్మలా పౌరుషంగా బ్రతికిన నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని ఊహించలేదు. ఇవన్నీ చెప్పకుండా నా మనుమరాలినిచ్చి పెళ్ళి చేసినందుకు నామీద కోపంగా లేదా బాబూ?" ఆమె కంఠంలో ధ్వనించిన నిర్లిప్తతకు సామంత్ మనస్సు బాధగా మూలిగింది.

 

    "నేనింతవరకు ఎవర్ని మోసం చేయలేదు బాబూ! నిన్నూ చేయాలనుకోలేదు. కాలం, ఖర్మం నాకు ఎదురు తిరిగాయి. శాఖోపశాఖాలుగా మహావృక్షంలా ఎదిగిపోతున్నాననుకున్నానేగాని కాలి క్రింద భూమి కదిలిపోతోందని ఊహించలేదు. ఆరిపోతున్న దీపం వెలుగులో నీలాంటి విద్యావంతుణ్ని, సంస్కారవంతుణ్ని అల్లుడిగా తెచ్చుకొనే ముందు నా పరిస్థితి కొద్దిగానైనా చెప్పకపోవటం నా స్వార్థంగా మాత్రమే భావిస్తావని ఆశిస్తున్నాను" కురుక్షేత్ర సంగ్రామంలో ఓడిపోయి కర్ణుడు రథచక్రాన్ని ఎత్తే ఆఖరి ప్రయత్నం కూడా చేసి, ఫలితం లభించక ఓటమిని చూసి నిస్తేజంలో మిగిలిపోయినట్లుగా ఉంది నాగమ్మ పరిస్థితి.

 

    ఏదో అనబోతుండగా భుజం మీద ఎవరిదో చేయి పడటంతో వెనుదిరిగి చూసాడు సామంత్.

 

    అక్కడ నాయకి నించుని ఉంది.

 

    ఆమె కళ్ళలో చిప్పిల్లిన నీళ్ళు కళ్ళ చివరలకు చేరుకొని చుక్కలుగా మారుతున్న స్థితిలో ఉందామె.

 

    సామంత్ గుండెను పిండినట్లుగా విలవిల్లాడాడో క్షణం. అంతలోనే తేరుకొని కళ్ళతోనే భార్యకి ధైర్యం చెప్పి నాగమ్మకేసి తిరిగాడు.

 

    అంతకాలం కేవలం అర్జున్ రావు బృందాన్ని చావుదెబ్బ కొట్టడం గురించే ఆలోచించాడు తప్ప, ముంచుకు వస్తున్న ఆపద గురించి, బజారున పడనున్న ఆ కుటుంబపు పరువు గురించిగాని ఆలోచించలేక పోయాననుకున్నాడు సామంత్. అతనిలో పట్టుదల పెరిగింది- పౌరుషం రెట్టింపయింది.  

 

    "నేనూ మీకు మనవడ్నే. మీ పరువు బజారున పడబోతుంటే మీ విషయాలన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదని నిలదీసే సాడిజం నాలో లేదు. మీ ఇద్దరూ సంతోషంగా, సుఖంగా ఉండాలనే నేనెన్నో..." ఎవరో ఆపినట్లుగా ఆపైన మాట్లాడలేకపోయాడు.

 

    అతను మాటల్ని మధ్యలోనే త్రుంచేసినట్లు ఆ ఇద్దరూ గమనించలేదు.

 

    "ఈ విషయాలన్నీ మీరు నాకు ముందే చెప్పలేదని మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా ఉండాలంటే - మీరు ధైర్యంగా లేచి తిరగాలి. మన కుటుంబపు పరువు బజారు కెక్కదు. ఎలా ఏమిటని నన్నడగవద్దు మీరు చూస్తూ ఉండండి! అంతే... నన్ను నమ్మగలిగితేనే సుమా..."

 

    సామంత్ మాటల్లో తొంగిచూసిన కాన్ఫిడెన్స్ ని వాళ్ళు గుర్తించారు.

 

    "రండి, లేవండి!" అంటూ సామంత్ నాగమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె భుజాల్ని పట్టుకొని లేపి నించోబెట్టి, పసిపిల్లను నడిపించినట్లుగా నడిపిస్తూ తన ఆసరాతో గది బయటకు తీసుకువచ్చాడు.

 

    ఆ దృశ్యాన్ని చూసిన నాయకి కళ్ళు కృతజ్ఞతతో చెమ్మగిల్లాయి.

 

    నాయకిని కూడా దగ్గరకు రమ్మని ఇద్దర్నీ తనకు చెరోవేపు పొదవుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ మీదకు తీసుకువెళ్ళాడు.

 

    సరిగ్గా అప్పుడే తనుండే ప్లాట్ లోంచి బయటకు వచ్చిన అర్జున్ రావు, ఆ దృశ్యాన్ని చూసి పళ్ళు పట పటా కొరికాడు.

 

    అప్పటివరకు తనలో గూడు కట్టుకున్న నిర్లప్తత అదృశ్యమయిపోయింది. నీరసం నీరుగారిపోయింది. నిస్తేజం మటుమాయమై పోయింది. మనస్సు నిండా నింపుకున్న విశ్వాసంతో, కళ్ళ నిండా నింపుకున్న ఆనందంతో తనివిదీరా ఆ ఇద్దర్ని చూసుకుంది నాగమ్మ.

 

    మరికొంతసేపటికి నాగమ్మ పూర్తిగా తేరుకుంది.

 

    "మనం ఎవరికైతే బకాయి పడ్డామో వార్ని మరికొంతకాలం ఆపే ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నంలో నేను విజయం సాధించగలనన్న నమ్మకం నాకుంది. ఒకవేళ అది జరగక, ఆస్తులు వేలం కావలసి వస్తే, నాగమ్మగారు ఎవ్వరికీ బాకీ లేకుండా చేసుకున్నారనే గౌరవాన్ని అయినా దక్కించుకోగలం. ఒకర్ని మోసం చేస్తేనో, ముంచివేస్తేనో, దోచుకుంటేనో సిగ్గుపడాలి. లేనప్పుడు ఇట్సాల్ ఏ గేమ్ అనుకుందాం. అంతే కాని మాకేదో మిగల్చలేకపోయానే అనే బాధతో మీరు కృంగిపోవటం మాకు మనస్తాపాన్ని కలిగిస్తుంది.

 

    The winner is always sees an answer in every problem.

 

    The loser sees a problem in every answer.

 

    మనం విన్నర్స్ మనే నా నమ్మకం" అన్నాడు సామంత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో.

 

    ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా కోటాను కోట్లు ఆస్తులున్న వ్యక్తి భర్తగా దొరకవచ్చు. అత్యున్నత అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తి భర్తగా లభించవచ్చు. అపార విజ్ఞానాన్ని తన సొంతం చేసుకున్న మేధావి కూడా భర్తగా దొరకటం మాత్రం ఒన్... ఇన్... మిలియన్... అది తను కావటం తన అర్హతలకు లభించిన పురస్కారం కాకపోవచ్చు. తన అదృష్టమే తన భర్త రూపాన్ని సంతరించుకుందేమో... నాగమ్మ అక్కడుందని ఆగిపోయింది కాని- లేదంటే సామంత్ కి ఓ మధురమయిన అనుభూతిని, అనుభవాన్ని ఆ క్షణానే అందించేది నాయకి.


                                                     *    *    *    *


    "ఏమిటి వాడి ధైర్యం? బలమయిన సాక్ష్యాలు మన దగ్గరున్నాయని తెలిసినా లెక్క చేయనట్లుగా వెళ్ళిపోయాడు. ఆస్తుల వేలాన్ని కూడా ఆపించేవాడిలా కనిపిస్తున్నాడు. గెలవబోతున్నామన్న ఆనందాన్ని తిరిగి సందిగ్ధంలో పడవేసాడే? అసలు ఎవడయ్యా వీడు?" తల పట్టుకున్నాడు అర్జున్ రావు.

 

    "ఇంకా మీరు వ్యవహారాన్ని నాన్చితే మనం దారుణంగా ఓడిపోవటం ఖాయం" పీటర్ ఆవేశంగా అన్నాడు.

 

    "ఏం చేయమంటావ్?"

 

    "మరి కాసేపటికి పొందికగా పేర్చిన ఫోటోల ఆల్బమ్ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ గా నాగమ్మ గారికి ఇచ్చి వేయండి"

 

    "అలాగే చేస్తాను" మరో ఆలోచనకు తావివ్వకుండా అన్నాడు అర్జున్ రావు.

 

    "ఆక్షన్ వేయాలనుకొనేవాళ్ళ మధ్యలో జారిపోరుగా?"