"అంటే?"
    
    "పరాయి ఆడదానిలో అందం కాదు మగాడు చూసేది. ఆకర్షణ! అది శారీరకం కూడా కానక్కర్లేదు. కేవలం పరాయి అన్న ఫీలింగ్ చాలు! పక్కమీదకి రాగానే నిన్నటి గురించి, రేపటి గురించి, చింతలూ, వంతలూ చెప్పడు. అతన్ని రేపు కూడా వచ్చేటట్లు ఎలా చేద్దామా అని మాత్రమే ఆలోచిస్తుంది. అదే అతనికి కావల్సింది."
    
    నాకు ఆ నిజం జీర్ణం కావడానికి చాలా సమయం పట్టింది. దీపూ ఒక డాక్టర్ రోగాన్ని గురించి ఎనలైజ్ చేసినట్లుగా చెప్పేశాడు.
    
    "నేనిప్పుడేం చెయ్యాలి?" అడిగాను.
    
    "మీ జీవితం ఎలా వుంటే బావుంటుందని మీరు అనుకుంటున్నారో అలా వుండండి" అన్నాడు.

    "నాకు రఘు కావాలి!" గట్టిగా అన్నాను.
    
    "ఒక చిన్నపిల్ల దగ్గర ఇరవై బొమ్మలున్నాయనుకోండి. అందులో ఒక బొమ్మని పోగొట్టుకున్నా ఏడుస్తూ కూర్చుంటుందే కాని, ఇంకా పంతొమ్మిది వున్నాయి కదా అని సమాధానపడదు. ఆ బొమ్మని వెతుక్కుంటూ ఈ పంతొమ్మిది బొమ్మలతో ఆడుకునే ఆనందాన్ని త్యాగం చేసేస్తుంది! అలాంటిదే మీ స్థితీనూ మీ సంగీతం .... పునీతా... స్నేహం.... సరదాలూ అన్నీ ఒక మనిషి కోసం వదిలేసుకుని ఏడుస్తూ కూర్చుంటారా? దాన్ని ఏమనుకోమంటారూ? మూర్ఖత్వం కాకపోతేనూ" కాస్త విసుగ్గా అన్నాడు.
    
    "కాదు ప్రేమ!" అన్నాను కాస్త ఏడుపు కూడా వచ్చింది.
    
    "ప్రేమ అని మాత్రం అనకండి. ఇదంతా అతడ్ని సాధించాను అనే ఈగో శాటిస్ ఫాక్షన్ కోసం పడే పాట్లు! ప్రేమ అనేది వుంటే అతని ఆనందానికి ఇలా అడ్డుపడి బలవంతంగా మీవైపు తిప్పుకోవాలనుకోరు" అన్నాడు.
    
    "దీపూ! అంత ఘోరంగా మాట్లాడకు" అన్నాను.
    
    "నిజం దగ్గర వాళ్ళతో తప్ప మాట్లాడను!" అన్నాడు.
    
    అవును! అతను నిజాలు చెప్తాడు కాబట్టే నాకిష్టం. అవి చేదు నిజాలు! అయినా ఫరవాలేదు నాలో నిద్రిస్తున్న అంతర్నేత్రమేధో తెరుచుకుంటుంది. నాకు కన్నీళ్ళు వస్తాయి. బహుశ అతను చెప్పేవి ఫాక్ట్స్ కాబట్టేమో!
    
    "నేను అన్నీ అతనిక్సోం వదులుకున్నాను. అతను నన్ను వదులుకుని అన్నీ కావాలనుకుంటున్నాడు" అన్నాను.
    
    "అతను మీకు దూరం అవబట్టి అతని విలువ నీకు తెలుస్తోంది. అలాగే మీ విలువా అతనికి తెలియాలి" అన్నాడు.
    
    అతను తన అన్న గురించీ వదిన గురించీ మాట్లాడుతున్నట్లుగా ఎప్పుడూ మాట్లాడడు. అందరూ నాకు సమానమే అన్నట్లుగా వ్యవహరిస్తాడు!    

    అందుకు చాలా ప్రాక్టీస్ కావాలి. మనం పరాయి వాళ్ళ విషయాల్లో ఇచ్చే కరెక్ట్ జడ్జిమెంట్ చాలాసార్లు దగ్గర వాళ్ళ విషయాల్లో ఇవ్వలేము.
    
    "అంటే నేను అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా?" అడిగాను.
    
    "వెళ్ళిపోవడం గొప్పకాదు! వెళ్ళిపోయి ఆ వెలితి అతను ఫీల్ అయ్యేట్లు చెయ్యడం గొప్ప!" అని లేచి నిలబడ్డాడు.
    
    "దీపూ.... నిన్ను ఇందాక డిస్టర్బ్ చేసినట్లున్నాను సారీ!" అన్నాను. అతను ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు వినిపించిన ఆడ గొంతు నేను మరిచిపోలేదు!
    
    "దగ్గరవాళ్ళు తలుచుకుంటే కూడా డిస్టర్బెన్స్ చేసినట్లున్నాను సారీ!" అన్నాను. అతను ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు వినిపించిన ఆడ గొంతు నేను మరిచిపోలేదు!
    
    "దగ్గరవాళ్ళు తలుచుకుంటే కూడా డిస్టర్బెన్స్ అనుకునేవాడు బ్రతకడం దండగ!" అన్నాడు.
    
    "నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోనంటావో నాకు అర్ధమైంది..." అన్నాను.
    
    "అవును! మరో అహల్య నాకోసం ఏడుస్తూ ఇంటి దగ్గర ఎదురు చూడకూడదని" అన్నాడు.
    
    "ఏం ఒక్క అహల్య మీకు చాలదా?" కోపంగా అడిగాను.
    
    "ఆ అహల్య అలా కట్టిపడేయగలిగితే నాకు ఓ.కే!" అని నవ్వి - "నాతో మందుకొట్టి, నాతో కార్డ్స్ ఆడి, ఆతో కలిసి రగ్ బీ జోక్స్ బుక్ చదివి ఎంజాయ్ చేసి, కాసేపు పాలిటిక్స్ చర్చించి ఆ తరవాత కలిసి వండుకుని తిని, కంప్లీట్ ఎకెస్టెనీలో సెక్స్ ఎంజాయ్ చేసే పార్ట్నర్ దొరికితే ఇవన్నీ విడివిడిగా చేసే ఇందరెందుకూ? గాట్ మై పాయింట్!" అన్నాడు.
    
    "ఇవన్నీ పెళ్ళి ఎగ్గొట్టడానికి నువ్వు చెప్పే కబుర్లు" అన్నాను.
    
    "ఈ ఇంటి కోడలు ఎవరూ సుఖంగా లేరు" అన్నాడు.
    
    "సెంటిమెంటా?" ఆశ్చర్యంగా అన్నాను.
    
    అతను నవ్వేశాడు.
    
    "ఇంత ప్రాక్టికల్ గా మాట్లాడే నీలోనూ సెంటిమెంట్స్ ఉన్నాయా?" అనుకోకుండా లోపలికి రఘు వచ్చాడు.
    
    దీపూ లేచి నిలబడి "హాయ్ అన్నయ్యా..." అన్నాడు.
    
    "హౌ ఆర్ యూ?" రఘు అతని పక్కన వెళ్ళి మీద చెయ్యేసి పలకరించాడు.
    
    "ఫెస్టిసైడ్స్ ఫ్యాక్టరీ మొదలెట్టాక బాగా బిజీ అయిపోయావు అన్నయ్యా.....డై చెయ్యకూడదూ.....జుట్టు చెంపలదగ్గర నెరుస్తోంది!" రఘు చెంపల మీద చెయ్యివేసి చూపిస్తూ అన్నాడు దీపూ.
    
    "టైం లేదురా!" రఘు నవ్వేశాడు.
    
    దీపూ అన్నగారితో ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడుతున్నాడు.
    
    నేను బెడ్ రూంలోకి వెళ్ళిపోయాను.
    
    రఘు దీపూ మాటలకి పెద్దగా నవ్వడం నాకు వినిపిస్తోంది. కంపార్ట్ మెంటలిజం అంటే ఏమిటో దీపూని చూస్తే తెలుస్తుంది.
    
    ధీరజ్ ద్వారా నాకు ఇంకా చాలా విషయాలు తెలిసాయి!
    
    ధీరజ్ ఒక చిన్న ఏక్సిడెంట్ ద్వారా ఏక్సిడెంటల్ గా పరిచయం అయ్యాడు.
    
    పునీత బర్త్ డే కి బట్టలు కొనడానికి వెళ్ళిన నేను కారు రివర్స్ చేస్తుండగా ఆ ఏక్సిడెంట్ జరిగింది. వెనకనున్న అతని కారు బాగానే దెబ్బతింది. ఏదో ఆలోచనలో వున్న నేను చూసుకోలేదు.
    
    కారు దిగి వేగంగా అతని కారువైపు వెళ్ళి "సారీ.....ఐయామ్ ఎక్స్ ట్రీమ్ లీ సారీ..." అంటూ ఇంకా ఏదో చెప్పబోయాను.
    
    ధీరజ్ కారు దిగుతూ ఎక్స్ టైడ్ గా "హో! మీరు అహల్య కదూ! నైస్ మీటింగ్ యూ! వెధవ కారుదేవుందిలెండి. ఈ రోజు భలే మంచిరోజు" అని ఆపకుండా మాట్లాడాడు.
    
    ఆ రోజు అతని బలవంతంమీద అతనితో కాఫీ పబ్ కెళ్ళాల్సొచ్చింది.
    
    "నేను పదిహేడు సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడిపోయాను. మా అమ్మాయి నాగావళి పెళ్ళికని వచ్చాను. తనిక్కడే పెరిగింది వాళ్ళ నానమ్మ తాతయ్యల దగ్గర..." అన్నాడు.
    
    "నాగావళి! మీ టేస్టా.... మీ శ్రీమతి టేస్టా?" అడిగాను.
    
    "నా శ్రీమతి నాగా పుట్టిన ఆర్నెల్లకే ఏదో వాతం వచ్చిపోయింది. నేనే ఆ పేరుపెట్టాను. ఆ తర్వాత విరక్తితో స్టేట్స్ వెళ్ళిపోయాను!" అన్నాడు.
        
    అతనికి నేను పాడడం, నా రికార్డ్ కి అమ్మకాల జోరు వుండడం మాత్రమే తెలుసు! ఆ తర్వాత నా జీవితం ఎంత రసహీనం అయిందో తెలియదు.
    
    "మీ రికార్డ్స్ నా దగ్గర కలెక్షన్ వున్నాయి. కొత్తగా ఏమైనా వచ్చాయా?" అడిగాడు.
        
    నేను నవ్వి టూకీగా నా గురించి చెప్పాను.
    
    "నేను క్షమించలేను మీ ఆయన్ని" అన్నాడు.