ఆ రాత్రంతా ఆ డైరీని చదవాలనుకుంది. తనలో తానే గడపాలనుకుంది.

 

    రేపటి నుంచి వేరే జీవితం గడపబోతోంది.

 

    శ్రీధర్ ప్లస్ మాళవిక మైనస్ పూజ ఫ్లస్ అపర్ణ...

 

    ఆమె లా ఆలోచిస్తున్నంతలో.

 

    లైట్లు పోయాయి. ముందు తన గదిలోని బల్బ్ పోయిందనుకుంది. తర్వాత తెలిసింది. మొత్తం అపార్టుమెంట్స్ లో కరెంట్ పోయిందని. అపార్టుమెంట్స్ ఆఫీసుకి ఫోన్ చేసి కనుక్కుంది.

 

    బహుశా ఆ రాత్రంతా కరెంట్ లేకుండా వుండాల్సి వస్తుందేమో అనుకుంది. రేపన్న మాట తనలో కొత్త ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

 

    ఈ రాత్రికి నేను కేండిల్ లైట్ వెలుగులో నా డైరీ చదువుతాను. అవి ఆరిపోయేసరికి నేను నిద్రపోయి వుంటాను. తెల్లవారితే మాళవికనయిపోతాను.


                                                   *    *    *    *


    "ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడ్నిగా మమ్మీ! ఏమిటంత హడావుడిగా వచ్చావు?" అడిగాడు శ్రీధర్.

 

    "ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు-నిన్న రాత్రి సరిగ్గా ఎనిమిదిన్నరకి నువ్వేం చేస్తున్నావ్?" తిరిగి అడిగింది మదర్ మాథ్యూస్.

 

    "ఒక పావుగంట పూజతో మాట్లాడాను. నీకు ఆమెతో మాట్లాడుతున్నట్లు సిగ్నల్ యిద్దామనే పూలకుండీని ఇటునుంచి అటు జరిపాను. అది నువ్వు గమనించావో లేదో నాకు తెలీదు. ఈ లోపు ఆమె ఫోన్ పెట్టేసింది."

 

    "అప్పుడు వాచీ చూసుకున్నావా?"

 

    "చూసుకున్నాను. సరిగ్గా ఎనిమిదిన్నర అయింది.

 

    "చివరి సమయంలో ఫోన్ లో నీకేదయినా సౌండ్ వినిపించిందా?"

 

    "అపశృతుల హార్మోనియం శబ్దాలు విన్పించాయి."

 

    "ఆ శబ్దాలు కాకుండా ఠంగ్... ఠంగ్ మంటూ ఏవైనా శబ్దాలు వినిపించాయా?"

 

    "అవును వినిపించాయి."

 

    "వెరీగుడ్! ఠంగ్...ఠంగ్ మనే శబ్దాలు అపశృతుల హార్మోనియం శబ్దాలకు ముందు విన్పించాయా? చివరిలోనా?"

 

    "జస్ట్ వాటికి ముందు."   

 

    "అంటే అప్పుడు టైమ్ 8.22, 8.23, 8.24 అనుకోవచ్చా?"

 

    "ఎస్."

 

    "ఎస్! ఐ గాటిట్" ఆ వయసులో సైతం ఎంతో గట్టిగా వుద్వేగానికి లోనవుతూ అంది మదర్ మాథ్యూస్.

 

    శ్రీధర్, యోగి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి.

 

    మరో ఐదు నిమిషాలకు ముగ్గురూ అక్కడినుంచి వేగంగా క్రిందకెళ్ళిపోయారు.


                                                    *    *    *    *


    పూజ ఓ పక్క చిప్స్ తింటూ, సామాన్లన్నీ ప్యాక్ చెయ్యసాగింది.

 

    మధ్య మధ్యలో శ్రీధర్ ఫ్లాట్ కేసి చూస్తూనే వుంది.

 

    కానీ శ్రీధర్ ఫ్లాట్ కర్టెన్స్ పూర్తిగా వేసున్నాయి. పూజ పాత్రమీద కోపంతో కర్టెన్స్ వేసుండవచ్చని భావించింది. అదే తనకీ కావాల్సింది.

 

    అంతవరకే అనుకుంది తప్ప, వాళ్ళు మూసిన కర్టెన్స్ ని అడ్డంపెట్టుకుని, తన ఆచూకీ కేసి వేగంగా కదిలి వస్తున్నట్లు వూహించలేకపోయింది.

 

    ఆ ఒక్కరాత్రి గడిపేస్తే... పూజ పాత్రకి గుడ్ బై... అని అనుకుందామె.


                             *    *    *    *


    "ఏమిటి మదర్...నువ్వు చెప్పేది? పూజ వుండేది 'సి" బ్లాక్ లోని ప్లాట్ నెంబర్ 79లోనా?" పెను వుద్వేగానికి లోనవుతూ అన్నాడు శ్రీధర్.

 

    "ఎస్...పక్కా...నో డౌట్" స్థిరంగా అంది మాథ్యూస్.

 

    "మరెందుకు లేట్? వెళదాం పదండి" అన్నాడు యోగి ఆతృతని అణుచుకోలేక.

 

    "నాకా మాత్రం తెలీదనుకోకు కుర్రకుంక. ఆమె ఫ్లాట్ కి వెళ్ళి తలుపు కొట్టటం బాగోదు. ఏం చేయాలనేదీ యిప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను" అందామె 'సి' బ్లాక్ కేసి నడుస్తూ.

 

    బెల్ మోగితే పూజ వెళ్ళి తలుపు తీసింది.

 

    ఎదురుగా నిర్మల.

 

    "సామాన్లు సర్దేస్తున్నావా?" అడిగింది నిర్మల-అక్కడ కన్పిస్తున్న వాతావరణాన్ని చూస్తూ.

 

    "ఈ రాత్రితో పూజ పాత్రకి, ఈ ఫ్లాట్ కి గుడ్ బై చెప్పేస్తున్నాను" అంది పూజ హేపీగా.

 

    "నాకు ఫోన్ చేస్తే నేనూ వచ్చి హెల్ప్ చేసేదాన్నిగా?" అంది నిర్మల నిష్టూరంగా.

 

    "ఇప్పుడు చెయ్యి" అంది పూజ నవ్వుతూ.

 

    ఇద్దరూ కలిసి సామాన్లు ప్యాక్ చేయటం ఆరంభించారు.


                                                    *    *    *    *


    ముగ్గురూ మదర్ మాథ్యూస్ ప్లాట్ కి చేరుకున్నారు.

 

    శ్రీధర్ కర్టెన్ విండో దగ్గరికి వెళ్ళి కర్టెన్ తీశాడు. అక్కడినుండి పూజ ఫ్లాట్ 79 బాల్కనీ స్పష్టంగా కన్పిస్తోంది. అంటే నిర్మలగారి ఫ్లాట్ కి సరిగ్గా పైన వున్న ఫ్లాటే టెలిఫోన్ అమ్మాయిదన్నమాట. ఈ రెండు బ్లాక్స్ లోని ఫ్లాట్స్, తన ఫ్లాట్ ఎత్తులు సరిగ్గా లేనందువలన తన లెక్క తప్పిందని శ్రీధర్ తెలుసుకున్నాడు.

 

    'సి' బ్లాక్ లోని 79 ఫ్లాట్ లోనే పూజ వుంటోంది. తను ఇక ఎప్పుడయినా వెళ్ళొచ్చు. తనలా వెళితే పూజ అరిచి, గోల చెయ్యదుకదా? పోలీసులకి ఫోన్ చేస్తే? తను మాళవిక వేపు మొగ్గు చూపుతున్న విషయం ఆమెలో అసూయ పుట్టించి వుండవచ్చు. ఆ అసూయ ఎక్కడికయినా దారి తీయవచ్చు. ఇదంతా జరగకూడదనుకుంటే, ఆమె తనను గుర్తుపట్టకూడదు. దానికి చీకటి కావాలి. అతనికి వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది. 79 ఫ్లాట్ ఫ్యూజ్ తీసేస్తే సరిపోతుందని అనుకున్నాడు.

 

    గతంలో తన ఫ్లాట్ లో కరెంట్ పోతే, ఫ్లాట్స్ బేస్ మెంట్ లోకి వెళ్ళాడు. అక్కడ అన్ని ఫ్లాట్స్ కి సంబంధించిన మెయిన్ ఫ్యూజ్ బాక్స్ వుందనే విషయం అప్పుడే తనకి తెలిసింది.

 

    ఆ ఆలోచన వస్తూనే శ్రీధర్ మరిక ఆలస్యం చేయదలుచుకోలేదు.

 

    అదే విషయాన్ని మదర్ మాథ్యూస్ కి, యోగికి చెప్పాడు.

 

    వాళ్ళు ఒక్కక్షణం ఆలోచనల్లో పడిపోయారు.


                              *    *    *    *


    రాత్రి తొమ్మిదిన్నరకి పూజ ఫ్లాట్ లోని సామాను సర్దటం పూర్తయింది.

 

    "మార్నింగ్ ఆరులోపు ఆటో తెచ్చేస్తే, కొత్త ఫ్లాట్ లోకి వెళ్ళిపోవచ్చు" అంది పూజ చేతులు కడుక్కుని నేప్ కిన్ తో చేతులు తుడుచుకుంటూ.