జీవాత్మ
    
    అర్ధరాత్రి సురద్విషుడు నిద్ర లేచిన వేళ!
    
    లోకం నల్లటి దుప్పటి కప్పుకున్నట్టు అంతటా గాడాంధకారం.... ఒంటిని ఒణికిస్తూ చల్లటి గాలులు..... కీచురాళ్ళ ధ్వనితో ఆ నిశిరాత్రి మారుమ్రోగుతోంది..... ఉత్తరం వైపు నుంచి నల్లటి మేఘం మదించైనా ఏనుగుల గుంపులా దూసుకొస్తోంది...
    
    అదే సమయంలో కుడిచేతిలో చిన్న తోలుసంచీ, ఎడమచేతిలో తలకిందులుగా వేలాడుతున్న కోడితో - రాళ్ళూ, రప్పలు నిండిన సన్నని కాలిబాటపై ముందుకు సాగిపోతోందో ఆకారం.
    
    కన్ను పొడుచుకున్నా ఏమీ కానరాని ఆ దట్టమైన చీకటిలో అతడు సునాయాసంగా సాగిపోతున్నాడు. ఎండిన ఆకులు అతడి కాలికింద నలిగి ఆ నిశీధిలో అదో రకం గుబులు పుట్టిస్తున్నాయి.    
    
    ఇంతలో ఓ తీతువు భయంకరంగా అరుస్తూ అతని నెత్తిమీదుగా ఎగిరిపోయింది. ఆ నిశిరాత్రిలో.... ఆ భయంకర వాతావరణంలో మరొకరయితే గుండె లవిసిపోయి మూర్చిల్లిపోతారు. మరీ పిరికివాళ్ళయితే గుండాగి ఛస్తారు. కాని అతడు ఏమీ జరగనట్టే ముందుకు సాగిపోతున్నాడు.
    
    శంకరావాసమైన శ్మశానం దగ్గరయిందన్నట్టు శవాలు కాలిన కవురు కంపు అతని నాసికకి తగిలింది.
    
    ఇంతలో సర్... ర్...ర్....మనే సవ్వడికి తన కాలివైపు వంగి చూసుకున్నాడతను.
    
    బారెడు పొడవున్న కాలనాగు మెలికలు తిరుగుతూ తుప్పల్లోకి జారిపోయింది.
    
    అతడు స్మశానం నడిబొడ్డుకి చేరుకున్నాడు. భూమిలోంచి పైకి పొడుచుకు వచ్చిన ఎముకలు, మానవకంకాళాలు దాటుకుని ముందుకు నడిచాడు.
    
    అతడికి స్వాగతం పలుకుతున్నట్లు సమాధుల వెనుక నుంచి నక్కఒకటి ఊళబెట్టింది. ఎదురుచూస్తున్న అతిథి రానే వచ్చినట్లు గుబురు కొమ్మల్లోంచి గుడ్లగూబొకటి అతన్నే చూస్తోంది.
    
    శ్మశానం దాదాపు ఒక మైలు విస్తీర్ణం వుంది. ఆ తరువాత తుప్పలు, చెట్లు..... మరొకవైపు నిరంతరం పారే నీరు.... దానిమీద ఎప్పుడో బ్రిటీష్ కాలంనాటి శిధిలమైపోయిన వంతెన...
    
    అతడు సంచీలోంచి నాలుగు మేకులు తీసి, సంచీని, కోడినీ ఓ చెట్టుకింద పెట్టాడు. క్షుద్రశక్తులు ఆవహించి వుండే వస్తువుల్లో ఇనుము ఒకటని తంత్రశాస్త్రం చెబుతుంది! ఆ మేకులని శుభ్రపరచి పూజించాలి! తర్వాత క్రతువు నిర్వహించే స్థలంలో నాలుగువేపులా వాటిని పాతాలి! దాంతో తాంత్రికుడి సాధన సమయంలో ఏ విఘ్నమూ ఏర్పడకుండా రురుడు, కాలుడు, భైరవుడు, బేతాళుడు నాలుగు దిక్కుల్నుంచీ కాపు కాస్తారు.
    
    అతడా మేకుల్ని పట్టుకుని మంత్రాలు పఠిస్తూ ముందుగా దక్షిణం వైపు నడిచి అక్కడ నేలలో పాతాడు. అదే సమయంలో ఎవరో రోధిస్తున్న సన్నని ధ్వని అతడదేం పట్టించుకోకుండా పడమర వైపు నడిచాడు. నేలమీద కూర్చొని రాయితో మేకుని కొట్టసాగాడు. 'హి...హి....హి....' అంటూ మరో వేళాకోళంగా నవ్వుతున్న సవ్వడి.
    
    అతడు ఈశాన్యం వైపు సాగాడు. మేకుని నేలలో కొట్టి లేవ బోతుండగా- 'టప్' మని అతని మీద ఏదో పడింది. చలించలేదతను. ఏమిటాని చూశాడు. చచ్చిన ఓ గబ్బిలం దాన్ని తీసి విసిరేశాడు.
    
    ఇక మిగిలింది ఉత్తర దిక్కు అటు నడుస్తున్నాడతను.... లీలగా అందెల చప్పుడు... అతడొక్క క్షణం ఆగాడు. అందెల చప్పుడు కూడా ఆగిపోయింది. అతడు తిరిగి నడిచాడు. మళ్ళీ అందెల చప్పుడు కూడా ఆగిపోయింది. అతడు తిరిగి నడిచాడు. మళ్ళీ అందెల చప్పుడు మొదలైంది. అయినా అతను ముందుకే సాగిపోయాడు. అందెల చప్పుడూ ఆగకుండా వినిపించసాగింది.... దగ్గరగా.... మరింతగా దగ్గరగా!
    
    అతడు మేకు కొట్టటానికి నేలమీదకి వంగేటప్పటికి అందెల చప్పుడు కాస్తా భీకరమైన హోరులా కర్ణభేరి పగిలిపోయేంతగా మోగసాగింది.
    
    "ఖెటి-భవన్నిఖిల ఖేటీ-కదంబ వనవాటీ" బిగ్గరగా మంత్రాలు పఠిస్తూ ఆఖరి మేకుని కూడా నేలలో పాతేశాడతను. చిత్రంగా ఆ హోరు ఆగిపోయింది. సాధకుడ్ని క్షుద్రదేవతలు ఎన్నో పరీక్షలకి గురిచేస్తాయి! భీతి కలిగిస్తాయి! అవన్నీ జయించిన వాడికే సిద్ది ప్రాప్తించి క్షుద్ర గుణాలు అతడి అధీనంలోకి వస్తాయి! ఆ సంగతి తెలుసతనికి!
    
    క్రతువుకి రంగం సిద్దమయింది - నలువైపులా చూశాడతను. ఎటు చూసినా గాడాంధకారమే. చెట్టు తొర్రల్లో భయంతో మరింతగా ముణగరించు కున్న పక్షుల కువకువలు తప్ప అంతటా నిశ్శబ్దం. మనిషిని భయపెట్టేంత నీరవ నిశ్శబ్దం.
    
    గాలి స్తంభించిపోయింది.... ఆకాశమూ, పృథ్వీ, చెట్లూ, చేమలూ...చేష్టలు దక్కి జరుగబోయే తంతు గమనిస్తున్నాయి. చీకటి మరింత చిక్కనవుతోంది.