"ఓ.కే."
    
    చిత్రమైన పోటీ ప్రారంభమైపోయింది.
    
    ముందు ప్రారంభించింది ప్రణయ. "నా మొదటి ప్రశ్న. యూ సీ మిస్టర్ ఆదిత్య, ఆరోగ్యవంతుడయిన మనిషి ఇరవై నాలుగు గంటల్లో ఎన్నిసార్లు గాలి పీలుస్తాడు?"
    
    "23,000 సార్లు" టక్కున చెప్పాడు.
    
    "నయామీస్ ట్విన్స్" గురించి చెప్పగలరా?"
    
    "చాంగ్, ఎంగ్ బంకర్ అన్న కవలలు నయామీస్ ట్విన్స్, ప్రపంచ చరిత్రలో విచిత్రసోదరులుగా గుర్తింపు పొందిన ఈ కవలలు, పుట్టిన దగ్గర్నుంచీ ఛాతీ ప్రాంతంలో శరీరాలు అతుక్కుని వుండటంతో అలాగే 63 సంవత్సరాలు కలిసి బ్రతికారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ళను పెళ్ళిచేసుకున్నారు. క్రీ.శ. 1874 జనవరిలో చనిపోయారు మూడు గంటల వ్యవధిలో."
    
    "గుడ్!" ప్రసన్నంగా నవ్వింది. "స్త్రీలు తప్పనిసరిగా మిలటరీ శిక్షణ పొందాలని నియమం వున్న దేశం?"
    
    "ఇజ్రేల్."
    
    "మన చేతి గోళ్ళలో ఏ వేలి గోరు వేగంగా పెరుగుతుంది?"
    
    "మధ్య వేలిగోరు వేగంగా పెరిగితే, బొటనవేలి గోరు అన్నిటికన్నా స్లోగా పెరుగుతుంది."
    
    ప్రపంచంలోని దేశాల సంఖ్య?"
    
    "రెండు వందల పన్నెండు."
    
    "పురుషుడికి ప్రేమన్నది అతడి జీవితంలో ఓ భాగమైతే, స్త్రీకి ప్రేమే జీవితం అన్న పాశ్చాత్య రచయిత పేరు?"
    
    క్షణం ఆగి అన్నాడు- "లార్డ్ బైరన్."
    
    నవ్వేసింది.
    
    "ఏం కరెక్ట్ కాదా?"
    
    "అదికాదు ఇంతవరకూ ఆరు ప్రశ్నలు అడిగాను. ఎక్కడా తత్తరపడని మీరు ప్రేమగురించి కొటేషన్ చెప్పొచ్చేసరికి కాస్త సందిగ్ధంగా ఆగారు."
    
    "మరేం లేదు. అలా అన్నది షేక్ స్పియరా లేక లార్డ్ బైరనా అని చిన్న సందేహం వచ్చింది."
    
    "అలాగా... అయితే షేక్ స్పియర్ ప్రేమ గురించి చెప్పిన ఓ కొటేషన్ని ఇప్పుడు మీరు చెప్పాలి."
    
    "తప్పదా?"
    
    "తప్పదంతే!"
    
    "ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు గొంతు స్థాయి తగ్గించాలి."
    
    "నేనేం అరవలేదే!"
    
    "మరి?"
    
    "నేను ఇప్పుడు చెప్పింది షేక్ స్పియర్ కొటేషన్."
    
    "వ్వాట్?" అర్ధం కానట్టు చూసింది.
    
    "ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు గొంతు స్థాయి తగ్గించాలి అన్నది షేక్ స్పియర్ 'మచ్ అడో అబౌట్ నథింగ్'లో వాడిన కొటేషన్."
    
    అవాక్కయి చూసింది క్షణంపాటు ఓ పప్పుసుద్దలా కనిపించే అబ్బాయి అపారంగా చదివాడని ఎప్పుడో తెలుసుకుంది కాని, ఇంత అసాధారణంగా చదివాడని ఊహించలేకపోయింది. ఒక ఇంజనీర్ స్టూడెంట్ షేక్ స్పియర్ ని అంత లోతుగా చదవడమూ ఆమెని ఆశ్చర్యపరిచిన విషయమే.
    
    "లాభంలేదు" అంది రెప్పవాల్చకుండా చూస్తూ "ప్రతి ప్రశ్నకీ మీరు జవాబు చెప్పేయగలుగుతున్నారూ అంటే సబ్జెక్ట్ మార్చేయాలి."
    
    "వెల్ కం!"
    
    "నా ఎనిమిదో ప్రశ్న..." సాలోచనగా అడిగింది. "ద క్విక్ బ్రౌగ్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ వాక్యం విన్నారుగా...? ఈ వాక్యంలో ప్రత్యేకత వుంది. అది చెప్పాలి."
    
    అవాక్కయ్యాడు ఆదిత్య.
    
    మరోసారి రిపీట్ చేసింది.
    
    "ప్రత్యేకత అంటే?"
    
    "అవును....ఈ వాక్యానికి ఇంగ్లీషు భాషలో ఓ అరుదైన ప్రత్యేకత వుంది. అదీ ఆ భాషకి సంబంధించిందే. అదేమిటో చెప్పగలగాలి."
    
    "తెలియదు."
    
    ఉత్సాహంగా చప్పట్లు కొట్టింది. "సో మీరు ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయారు."
    
    "ఒప్పుకుంటున్నాను మీరు చెప్పండి."
    
    "ఈరోజు కాదు."
    
    "ఇప్పుడే చెప్పాలి."
    
    "రేపు."
    
    "అదేం" కుదరదన్నట్టుగా చూశాడు. "ఇది దారుణం."
    
    "నేను అడిగిన ప్రశ్న అర్ధంలేనిదేం కాదు ఆదిత్యా! అది రేపు అర్ధమవుతుంది మీకే."
    
    ఉక్రోషంగా అన్నాడు "సరే! కంటిన్యూ చేయండి."
    
    "అమెరికా దేశానికి ఆ పేరెలా వచ్చింది?"
    
    "క్రీస్తుశకం 1499లో అమెరికా ముఖ్య భూభాగాన్ని డిస్కవర్ చేసింది ఇటలీ దేశానికి చెందిన 'అమెరిగో వెసుపకి" అతడి పేరు మీదుగా అమెరికా అనే పేరు స్థిరమైంది."
    
    "ముద్దు అంటే?"
    
    అర్ధం కానట్టు చూశాడు.
    
    "సారీ! కిస్ అనే ప్రక్రియకి వైద్యశాస్త్రం అందించే నిర్వచనం ఏమిటి?" రెట్టించింది ప్రణయ అదే ప్రశ్నని.
    
    "ది అనటామికల్ జూక్ట్సా పొజిషన్ ఆఫ్ టూ ఆర్టిక్యులర్స్ ఆగిస్ మజిల్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కాంట్రాక్షన్. అంటే శరీరంలో రెండు వృత్తాల్లాంటి పెదవులు కలిసిన వేళ సంకోచ కండరాలలో జరిగిన ప్రక్రియ."