"మహానుభావా! ఇక చాలు నీ భావ కవితా పటిమ. ముందు నన్ను హాస్టల్ దగ్గర దించు..." అందామె.
    
    "అదేమిటి? నేనింకా ఈరోజంతా మనం అలా షికారు కొట్టొచ్చని ప్లాన్ వేసుకుంటే?" ఆశ్చర్యంగా అన్నాడు.
    
    "నాకు బడలికగా వుంది. పోనీ సాయంత్రం మా హాస్టల్ రోడ్డుచివరిలో వెయిట్ చెయ్యి వస్తాను" సూట్ కేస్ పట్టుకుని బైక్ మీద కూర్చుని అందామె.
    
    వెంటనే స్టేషన్ పరిసరాల్ని వదిలి ముందుకు దూసుకుపోయిందది.
    
    "సాయంత్రం ఎన్నింటికి?" అడిగాడతను.
    
    "అయిదు గంటలకి" బదులిచ్చిందామె.
    
    "ఎక్కడికెళదాం?"
    
    "నీ యిష్టం!"
    
    మాటల్లోనే మనస్విని హాస్టల్ వచ్చేసింది.
    
    "ఇక్కడాపు మరింత ముందుకు తీసుకెళ్ళకు?" అంది మనస్విని.
    
    "ఏం అన్నాడు" మహదేవ్.
    
    "హాస్టల్లో వాళ్ళెవరయినా చూస్తే బాగుండదు. నీకెన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేం...." లోగొంతుకతో చిరుకోపంగా అందామె.
    
    అతను బైకాపాడు. ఆమె దిగి "బై" అంటూ ముందుకు నడిచింది.
    
    "అయిదు గంటలకి మర్చిపోకు" అంటూ తిరిగి వెనక్కి వెళ్ళి పోయాడు మహదేవ్.
    
                                                           *    *    *    *    *
    
    సాయంత్రం అయిదుగంటలు!
    
    మహదేవ్ హాస్టల్ రోడ్డులో వున్న ఓ చెట్టుకింద తన బైకాపి ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయతనికి. ఏమీ తోచక ఆకాశంలోకి చూశాడతను. నిశ్శబ్దంగా సాగిపోతున్న జంట మేఘాలు...తనూ మనస్వినిలా.... తన ఆలోచనకి తనకే నవ్వొచ్చిందతనికి, ఇంతలో మనస్విని వస్తూ కన్పించింది. ఆమె కదిలి వస్తుంటే పాపికొండల నడుమ సాగే ఒయ్యారాల గోదారిలా, గ్రీష్మారంభపు ప్రత్యూషంలా, నిండార విచ్చుకున్న అడవి మల్లెలా తోచింది అతడికి.
    
    "త్వరగా స్టార్ట్ చెయ్!" ఆమె మాటలతో ఇహ లోకంలోకి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు.
    
    ఆమె అతని వెనక కూర్చుంది. బైక్ పుష్పక విమానంలా ముందుకు సాగిపోయింది.
    
    "ఎక్కడికెళుతున్నాం?" అడిగిందామె.
    
    "బిర్లామందిర్" చెప్పాడతను.
    
    "ఉదయం నుంచీ ఏం చేశావ్" అడిగిందామె.
    
    "నువ్వీ రోజు వస్తున్నానని ఉత్తరం రాశావ్ కదా! అందుకని ఈరోజు పూర్తిగా సెలవ్ పెట్టేశాను. అయితే ఊర్నుంచి వచ్చి కూడా నాతో బయటకి రాకుండా హేండ్ యిచ్చేశావ్.
    
    చేసేదేం లేక ఇంటికెళ్ళి శుభ్రంగా పడుకున్నాను. అదీ ఒకందుకు మంచిదే అయిందిలే..."    
    
    "ఏం" అన్నది మనస్విని.
    
    "బాగా నిద్రపోయి లేవటంతో గ్లామర్ పెరిగింది చూడు నావంక" అన్నాడు మహదేవ్.
    
    "చూశానులే! జాగ్రత్తగా డ్రైవ్ చేయి లేకపోతే ఏ వాహనమో గుద్దేసి వున్న గ్లామర్ కాస్త డీ గ్లామరైపోతుంది" అతన్ని ఉడికిస్తూ అందామె.
    
    బిర్లామందిర్ చేరుకొని. బైక లాక్ చేసి మెట్లెక్కి లోపలకు నడిచారు. ఆ రోజు జనం పెద్దగా లేరు ఇద్దరూ ఓ మూల మెట్ల దగ్గర కూర్చున్నారు.
    
    "ఊఁ.... చెప్పు ఈ పదిహేనురోజుల విశేషాలు."
    
    "ఏమున్నాయి నథింగ్. తినటం ఆఫీసుకి పోవటం, తిరిగిరావటం, మళ్ళీ తినటం, పడుకోవటం..... మనసు మాత్రం సముద్ర కెరటాలతో పోటీ పడుతూ నా హృదయంలో నీ జ్ఞాపకాలని కెలికేవి. రాత్రుళ్ళు నిద్రపట్టక బిల్డింగ్ ప్లాన్స్ గీద్దామనుకుంటే కళ్ళ ముందు నువ్వే కనిపించేదానివి. నీ సాన్నిహిత్యపు వెచ్చదనం అనుభవంలోకి వచ్చీ రాకముందే నువు లేవన్న నిజం శీతల నీటిని గడ్డ కట్టించేసినట్టు నా మనసును ఘనీభవించేసిపోయేది. దాంతో గుబులు రేగి నీమీద చెప్పలేనంత కోపం వచ్చేది. అయినా తమాయించుకునేవాడిని. ఎందుకంటే నువ్వే నేను కదా!"
    
    అతని మాటలకి సంతోషించినా పైకి మాత్రం "మాటలు బాగా నేర్చావ్" అందంగా కోప్పడింది.
    
    "ఈ పదిహేను రోజులలోనూ నీకు నేను గుర్తురాలేదా?" ఆర్తిగా ఆమెని అడిగాడతను.
    
    "అదేం ప్రశ్న?"
    
    "మరి నేను ఇన్ని చెబుతున్నా నువ్వొక్క మాట మాట్లాడవేం?" నిష్టూరంగా అన్నాడతను.
    
    "ఎందుకు గుర్తురావు? అసలు మరచిపోతే కదా గుర్తు రావటం, రాక పోవటాల గురించి చెప్పగలం"
    
    "అంటే?" అన్నాడు మహదేవ్.
    
    "అంటే.... ప్రతీ క్షణం గుర్తున్నావని అర్ధం మనం జీవించి వున్నంత కాలం ఉచ్చ్వాస, నిశ్వాసలు ఆగక ఎలా సాగుతామో అలాగే నిర్విరామంగా నీ తలపులు నా మది గదిలో కదలాడుతూనే వుంటాయి" అన్నది మనస్విని.
    
    ఆమె మాటలకి అతని కళ్ళల్లో గ్రీష్మారంభపు సూర్యుని కాంతులు.
    
    "మనస్విని!"
    
    "ఊఁ.....!"
    
    "నువ్వు....నువ్వంటే నాకు ప్రాణం! ఎందుకని?" అడిగాడు మహదేవ్.
    
    'నువ్వే చెప్పు' అన్నట్టుగా చూసింది ఆమె.
    
    "ఏం చెప్పను? ఆర్తితో అనురాగాన్ని పంచావనా? ప్రేమగా నా తలలోకి వేళ్ళు జొనిపి లాలించావనా? నా ఆనంద విషాదాలలో పాలు పంచు కుంటావనా? నాలో ఆద్యంతాలు నువ్వే అవుతావనా?
    
    ఏమో.....నీ పైనా ఈ ఇష్టానికి కారణం నాకే తెలియదు. కానీ నువ్వంటే ప్రాణం. నాలో సగభాగం అంతే...."
    
    ఆమె మౌనంగా అతని మాటలు వింటూ అందులోని అనురాగపు వెచ్చదనంలో చలికాచుకుంటున్నట్టు సంతోషాన్ని అనుభవించసాగింది.
    
    అలా ఎంతసేపున్నారో వాళ్ళకే తెలియలేదు. ఆ ఇద్దరిలో ముందుగా బాహ్య ప్రపంచంలోకి వచ్చింది మనస్వినే!