కాసేపు అర్థనిమీలిత నేత్రాలతో అలాగే ఒదిగి ఉండి "అక్కా!" అని పిలిచింది సీత మెల్లగా.

 

    "ఏమమ్మా?"

 

    "ఈ మండుటెండలో మీ తోట తరుచ్చాయలతో చల్లగా, హాయిగా ఉంటుంది. అలా తోటలో తిరిగి వద్దామా?"

 

    "అదేమంత భాగ్యమమ్మా! నిజమే, తోటలో తిరిగితే మనసు ఉల్లాసంగా ఉంటుంది పద."

 

    నిర్మల హృదయంతో ఒకరు, భీషణ ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయ్యే హృదయంతో ఒకరు. యువతులిద్దరూ లేచి నిలబడ్డారు. బయటకు వచ్చారు.

 

    పూల మొక్కలేగాక తోటంతా రకరకాల ఫలవృక్షాలు కూడా ఉన్నాయి. మామిడి చెట్లనిండా కాయలు వ్రేళ్ళాడిపోతున్నాయి. అవిగాక జామ, కమలా, నారింజ చెట్లు కనులపండువుగా పెరిగి ఉన్నాయి. కొంతసేపు ఇద్దరూ చెట్టాపట్టా లేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తిరిగారు. పూర్తిగా వికసించని మొగ్గలవలె కనిపిస్తూ, పసిపిల్లల్లా కాసేపు తోటంతా కలసితిరిగారు.

 

    "ఆ కోనేటి గట్టున చాలా చల్లగా ఉన్నట్లుంది. కొంచెంసేపు అక్కడ కూర్చుందాం రా అక్కా!" అన్నది సీత చేయెత్తి చూపిస్తూ.

 

    ఆ మాట నిజమే, కోనేరు ఉపరితలమంతా నలువైపులా ఉన్న వివిధ తరుచ్ఛాయలతో, క్రింద నీడ పరిచినట్లు చల్లగా ఉంది.

 

    ఇద్దరూ వెళ్ళి కోనేటిగట్టుకు సమీపంగా నిలబడ్డారు. "గట్టుమీద వద్దు, నాకైతే అలవాటేగాని, నీకు కళ్లు తిరుగుతాయి. మెట్లుమీద కూర్చుందాం" అంది వేదిత.

 

    "ఉహుఁ నాకేం భయంలేదు. మెట్లుమీద దుమ్ము ఎలా ఉందో చూడండి. ఇక్కడే కూర్చుందాం."

 

    వేదిత నవ్వి "నువ్వు చాలా పెంకిదానివే సుమా చెల్లీ!" అంటూ ఆమె చేయి పట్టుకుని గట్టుమీద పదిలంగా కూర్చోబెట్టి తానామె ప్రక్కన చతికిలబడింది.

 

    సీత కాళ్ళు నీటివైపు పెట్టి కదిలిస్తోంది. "జాగ్రత్తమ్మా! నీ నిర్లక్ష్యం చూస్తుంటే నాకు భయమేస్తోంది?" అంది వేదిత ఆతృతగా.

 

    సీత నవ్వి "నా ప్రాణానికేం భయంలేదక్కా! అవునుగాని, ఈ కోనేటి లోతు ఎంత ఉంటుందంటావు?" అని ప్రశ్నించింది.

 

    "అబ్బో! చాలా లోతు ఉంటుంది."

 

    "సాధారణంగా గుళ్ళోకి వచ్చినవాళ్ళంతా యిందులోకి దిగి కాళ్ళు కడుక్కుంటారు కదా! మరి కాలుజారి ఇంతవరకూ ఎవరూ పడలేదా?"

 

    "ఉహుఁ ఇంతవరకూ ఈ కోనేరు ఎవర్నీ బలికోరలేదు."

 

    సీత రెండు క్షణాలూరుకుని "అక్కా! మీరు అందరిలాగా భోజనం చేయరనీ, కాయలూ, పళ్ళూ తిని, పాలు త్రాగి కడుపు నింపుకుంటారనీ ప్రజలు చెప్పుకుంటారు. నిజమేనా?" అని అడిగింది.

 

    "నిజమే కావచ్చు. ఏం?"

 

    "ఈ వయస్సులో ఇంత కఠోర నియమాలు ఆచరించి, నీ జీవితాదర్శాన్ని సాధించాలంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతూందక్కా! నీ జీవితమే ఒక సిద్ధాంతం. ఒక మంచి ఉపమానం. మేమంతా సంసారం, స్వార్ధం అనే బంధాలలోపడి కూరుకుపోతున్నాం. ఈ తాపత్రయం నీకు లేదుకదా. భగవంతుడే నీ సర్వస్వం! రాగద్వేషాలు నిన్ను స్పృశించవు. స్వార్థం,అసూయలు నిన్ను పీడించవు. నువ్వు కఠోర దీక్షాపరురాలవు. మా బోటి అల్పమానవుల కుండే బలహీనతలు నీకు లేవు. నువ్వు నిర్మల హృదయంతో నవ్వగలవు. చిత్త శుద్ధితో, ఏకాగ్రతతో దేవుడ్ని ప్రార్థించగలవు. అతని కృపా వీక్షణాలు నీపైన ప్రసరించబడేటట్లు చేసుకోగలవు. నీవు వంటరివి. ఈ యేకాంత ప్రదేశంలో మనోవికాసంతో నడయాడే దేవకాంతవు. అక్కా! నీ గొప్పతనం అందరికంటే నేను బాగా ఎరుగుదును. నీ తలపు, నీ భావన నాకు ఆదేశంతో కూడిన దుఃఖాన్ని కలిగిస్తాయి. అక్కా! నువ్వు...నువ్వు... ధన్యజీవివి."

 

    భావావేశంతో, రుద్ధకంఠంతో సీత చెప్పుకుపోతోంది. కన్నీరు ఆమె చెక్కిళ్ళమీదుగా జారిపోతోంది. వేదిత చలించిపోయింది. చప్పున ఆమెకు దగ్గరగా జరిగి భుజంచుట్టూ చెయ్యివేసి గట్టిగా కౌగలించుకుంది. పొంగిపొరలే ప్రేమతో తన పమిట చెంగుతో ఆమె కన్నీరు తుడిచింది.

 

    "చెల్లీ! ఎందుకు నీకింత ఆవేశం."

 

    "అక్కా! నన్ను ఎందుకు కౌగలించుకుంటావు? నేను చాలా పాపిని."

 

    "పాపమా? లలిత సుకుమారమైన నీ హృదయంలో పాపమా?" "సీత ఆమె ముఖంలోకి నిదానించి చూసింది. తన అంతరంగంలో ఏ కోర్కె ప్రథమంగా నాటుకునిపోయి ఉందో ఆ అమాయకురాలికేమి తెలుసు? ఆమె పవిత్రురాలే కావచ్చు. చీమకయినా బాధ కలిగించని దయామయి కావచ్చు. కాని ఆమె మహా సౌందర్యవతి. ఆ సౌందర్యంవల్లే తనకు అనర్థం జరిగింది. తన భర్త తనకు హృదయంలో చోటు ఇవ్వక పోతే పోనీగాక, తను అలవాటు పడగలదు. బ్రతగ్గలదు అలానే, కాని తన భర్త ఆమె ప్రలోభంలోపడి ఆమెకు అపకారం తలపెడితే సర్వనాశనం జరుగుతుందని తన అంతరాత్మ పదేపదే ఘోషిస్తుంది. తనకు ఇప్పుడు ఎంత దగ్గర్లో ఉంది వేదిత? ముఖం ప్రక్కకి త్రిప్పి క్రిందికి చూసింది. కళ్ళు తిరిగాయి. ఆకుపచ్చని నీళ్ళు. ఈ సమయం మళ్ళీ రాదు. ఆమె తనకు చాలా అందుబాటులో ఉంది. ఒక్కతోపు తోస్తే తనపీడ... తనని బెదిరించే హాని విరగడయిపోతుంది. సీత తన చేతులు వేదిత భుజాలమీద వేసింది. ఆమె వ్రేళ్ళు వణుకుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. శరీరం వణుకుతున్నది. వేదిత లేత భుజాల మీద ఆమె చేతులు బిగుసుకుంటున్నాయి.

 

    "చెల్లీ! ఏమిటలా స్తబ్ధురాలిగా ఉండిపోయావు? నువ్వు పాపమా? ఎవరన్నా నవ్విపోతారు" అంటోంది వేదిత, ఏదో లోకం నుండి మాట్లాడుతున్నట్లు.

 

    "నేను పాపమే. నా జీవితమే ఓ పీడకల. ఈ దారుణమైన పరిసరాలూ,,నా పెళ్ళీ, నా ఉనికి నా రూపం, నా దురదృష్టం యిదంతా పాపం కాక మరేమిటి?"

 

    "చెల్లీ! ఎందుకలా వొణుకుతున్నావు? ఏం జరిగింది?"

 

    చివరకు సీత తెప్పరిల్లి మాట్లాడింది. "అక్కా! దీనికి సమాధానం చెప్పు. నీ గుండెలో ఎప్పుడూ ఎవరు నిద్రపోతారు?"

 

    దగ్గర్లో చిన్న జంతువేదో పరుగెత్తినట్లయింది. "నేను ఎవరి సేవలకై నియోగించబడ్డానో ఆ మనోహర రూపుడు."