"జనధూళి అంటారే - నాలాంటి కఠినురాలికి కూడా భరించటం కష్టంగా వుంది. ఆ వాతావరణం ఎలర్జీగా వుంది. మరో ఉద్యోగం దొరికేలా వుంది."

    "ఎక్కడ?"

    "ఒక ఆనాథశరణాలయంలో. మేట్రస్ పని. మాలీ! నేను చిన్నప్పుడు ఆనాథ శరణాలయంలోనే పెరిగానన్న సంగతి నీకు తెలుసనుకుంటాను. అందుకో మరి నా పరిశీలనలోని లోటుపాటుల వల్లో అనాధలంటే నాకు ఎనలేని ప్రీతి. అక్కడ ఎన్నో జీవితాలను, అర్ధంలేకుండా బలైపోయిన జీవితాలను చూస్తాను. పేదరికం, పెద్దవాళ్ళు అసమర్ధత, తోటివాళ్ళ క్రూరత్వం, నిస్సహాయత, అమాయకత్వం, విధివల్ల ఏర్పడిన దౌర్భాగ్యం, వివిధ ఫలితాలను అనుభవించే అభాగినులు అక్కడ నాకు కనిపిస్తారు. లోకానికి తెలియని, లోకం గమనించిన, లోకం పట్టించుకోని హృదయవిదారక యాదార్ధగాధలు అక్కడ నాకు కనిపిస్తాయి. ఎప్పుడూ ఎటువంటి పరిస్థితులలోనూ చలించని నాకు వాళ్ళని చూస్తే కళ్ళనీళ్ళు తిరుగుతాయి......"

    ఆ మాటలు వింటుంటే మాలతికి కూడా గుండె బరువెక్కి పోయినట్లనపించింది.

    "భానూ! ఇహ చెప్పవద్దు...." అంది తడబడే గొంతుతో.

                                          * * *

    తర్వాత రెండురోజులకే భానుమతి ఆ క్రొత్త ఉద్యోగానికి వెళ్ళిపోయింది.

    వెళ్ళేముందు "మాలీ! ప్రపంచంలో నువ్వు నాకందరికన్నా ఆప్తురాలివి.నువ్వేం చేస్తావో, చెందుతావోనని మనసులో అనుక్షణం ఎంతో బాధ. నే వెళ్ళేచోట నీకెప్పుడూ చోటువుంటుంది. యు ఆర్ వెల్ కమ్. ఈ ఇల్లు మనక్రింద ఇంకో పదిరోజులు వుంటుంది. ఈ లోపల నీ భవిష్యత్తుని గురించి ఆలోచించి నిర్ణయించుకో. ఉద్యోగం చేద్దామనివుంటే ప్రయత్నిద్దాం. ఎక్కడో ఓ చోట దొరక్కపోదు. లేదా నే వుండేచోట నీకెప్పుడు స్థానం వుంటుంది. నువ్వు రా! వస్తావు కదూ?" అంది.

    మాలతి స్నేహితురాలిని కౌగిలించుకుని, ఏడ్చేసింది.

    భానుమతి వెళ్లిపోయింది.

                                         * * *

    ఏం చెయ్యాలి? ఎలా బ్రతకాలి?

    అర్ధంకావటంలేదు. ఒంటరితనం భయంకరంగా వుంది. ఆమెకు పిచ్చెక్కిపోతుంది. గదిలో పడుకుంటుంది . వెక్కివెక్కి ఏడుస్తుంది. రాత్రిళ్ళు నిద్రరాదు. ఏ క్షణమో పట్టినా, అందులో గుండెల్ని నలిపేసే పీడకలలు.

    ఎంత చీకటి?

    "ఇంక అనవసరం" అనుకుంది. అవునూ. బ్రతకటం ఇంకా అనవసరం. ఇంత నరకం అనుభవిస్తూ బ్రతకటం ఇహ తనవల్ల కాదు.

    ఓ సాయంత్రం చీకటిపడేవేళకు గదికి తాళం పెట్టి బయల్దేరింది.

    అంతిమ నిర్ణయం చేసుకుంది. కానీ ఒక్కసారి అతన్ని చూడాలి. వీలయితే అతనితో మాట్లాడాలి. అతను తిరస్కారంగా మాట్లాడనీ, తనకు భయమేముంది? జీవితంనుంచి ఏదయినా ఆశించేవాళ్ళకి భయం. తనకెందుకు?

    చీకట్లో నడుస్తుంది.

    ఎంత చిత్రం! తన ప్రమేయం లేకుండా ఎన్ని సంఘటనలు జరిగి పోయాయి? ఈ లోకంలో ఇంతమంది ఎలా బ్రతుకుతున్నారు? ఎన్ని ప్రళయాలు దాచుకుని, అగ్ని పర్వతాలు బ్రద్దలుకాకుండా అణగద్రొక్కుకుంటూ, అవమానాలు భరిస్తూ, దు;ఖాన్ని దిగమ్రింగుతూ బ్రతుకుతున్నారు.

    ఎందరిలా అలమటిస్తున్నారో!

    తప్పించుకుందామన్నావీలులేని ప్రమాదాలు మీదపడి పరపర నరికేస్తుంటే, ఆ రక్తంతో, గాయాలతో విలవిలలాడుతూ, విధిలేక బ్రతికేస్తున్నారో?

    ఆ ఇంటి ముందు ఆగింది.

    గోపయ్య కనిపించలేదు. లోపలనుంచి ఏవో మాటలు, చిన్నచిన్న శబ్దాలు వినిపిస్తున్నాయి. వీధిలో జనసంచారం అంతగాలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయింది.

    ఇంతలో బయటికెవరో వస్తున్నట్లు అలికిడి అయింది. చప్పున గోడవారికి తప్పుకుంది.

    ఎవరో ఇద్దరు బాగా త్రాగినట్లున్నారు. "గుడ్ బై బ్రదర్! రేపు మళ్ళీ కలుద్దాం!" తడబడే గొంతుతో అంటూ బయటకివచ్చి తూలుకుంటూ నడుస్తూ చీకట్లో కలిసిపోయారు.

    ఓ నిముషం తటపటాయించి మాలతి లోపలకు నడిచింది.

    హాల్లో సోఫాలో శేఖర్ కూర్చునివున్నాడు. ముందున్న టేబిల్ మీద ఖాళీ చేసిన గ్లాసులు, సీసా, మిగిలిపోయిన తినుబండారాలూ పడివున్నాయి. అతని చేతిలో ఇంకా నిండుగా వున్న గ్లాసువుంది.

    "గోపయ్యా! గోపయ్యా!" అని పిలిచాడు.

    జవాబు లేదు.

    "ఎప్పుడు పిలిచినా ఇంట్లో వుండడు. సరే!" ఒక్కొక్క గుక్కా త్రాగుతున్నాడు.

    ఆ స్థితిలో అతన్ని చూస్తూంటే మాలతికి బావురమని ఏడ్చేయాలని వుంది. కష్టంమీద నిగ్రహించుకుంటూ, హఠాత్తుగా ఎవరయినా వస్తారన్న అనుమానంతో సోఫావెనక్కి వెళ్ళి నిలబడింది.

    "మాలతీ!"

    మాలతి తృళ్ళిపడింది.

    "నువ్వు నా వెనకే వున్నావని నాకు తెలుసు."

    ఆమెకి ఏం చెయ్యాలో పాలుపోక, నిర్ఘాంతపోతూ అలాగే నిలబడి పోయింది.

    "నువ్వెక్కడున్నా, నా వెనకే వుంటావనీ, నా ప్రతిచర్యా గమనిస్తూ వుంటావనీ నాకు తెలుసు. కానీ నువ్వు నన్నాపలేవు మాలతీ! నన్నాపలేవు" గబగబ రెండు గుక్కలు త్రాగాడు. "నీమీద కోపంతో నేను చెడిపోలేదు. ద్వేషానికి లొంగిపోయి చెడిపోయాను. బ్రతుకు చివరకి వచ్చేద్దామని చెడిపోయాను మాలతీ! నేనన్నది చాలా చిత్రమైన అవస్థ. నిన్నెంతగానో ప్రేమించాను. అందుకనే అంత అసహ్యంగా అసూయపడుతున్నాను. ఎందుకంటే..... ఎందుకంటే......ఎక్కడ ప్రేమవుందో అక్కడ అసూయ వుంది. నేనెంత సంఘర్షణకు గురవుతున్నానో నీకు తెలీదు మాలతీ! దానికి అతీతంగా వుండాలనే ఇది...."

    గ్లాసెత్తి గడగడా త్రాగేశాడు. మనిషి వణికిపోతున్నాడు. మనిషి ఏదోలా వున్నాడు.

     పెద్ద దగ్గుతెర వచ్చింది. గుక్క త్రిప్పుకోలేక మెలికలు తిరిగిపోతున్నాడు. వెనక మాలతి ఈ దృశ్యాన్ని చూస్తూ బాధతో నలిగిపోతున్నది. మెరుపులా వెళ్ళి అతన్ని పట్టుకోవాలనీ, దగ్గరకు తీసుకోవాలనీ తహతహలాడిపోతున్నది.