ఫుడ్‌ అలెర్జీ ఉన్న పిల్లలకి డిప్రెషన్‌ కూడా వస్తుంది!

 

ఫుడ్‌ అలెర్జీ- ఈ మాట గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. వేరుశనగపప్పు, పాలు, గోధుమలు... ఆఖరికి బియ్యం దాకా కొన్ని ఆహారపదార్థాలు సరిపడకపోవడాన్నే ఫుడ్‌ అలెర్జీగా పేర్కొంటాం. ఈ అలెర్జీ కలిగించే ఆహారాన్ని తీసుకోగానే శరీరం మీద దద్దుర్లు దగ్గర్నుంచీ విరేచనాలా దాకా చాలా సమస్యలు వచ్చేస్తాయి. కొన్ని సందర్భాలలో ఇది మరణానికి కూడా దారితీయవచ్చు.


ఫుడ్‌ అలెర్జీ చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అలెర్జీ బారిన పడ్డ పిల్లల్లో మానసిక సమస్యలు కూడా ఏమన్నా వస్తాయేమో చూడాలనుకున్నారు పరిశోధకులు. అందుకోసం ఓ 80 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 4 నుంచి 12 ఏళ్ల వయసు లోపువారే! వీరిలో కొందరు పిల్లలకి ఫుడ్ అలెర్జీ ఉంటే మరికొందరికి ఆ సమస్యే లేదు!


ఈ 80 మంది పిల్లల్లోనూ డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు ఎవరిలో ఉన్నాయో గమనించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా ఫుడ్‌ అలెర్జీ ఉన్న పిల్లలలో డిప్రెషన్ వచ్చే ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫుడ్‌ అలెర్జీతో బాధపడే పిల్లలలో దాదాపు 60 శాతం మందిలో డిప్రెషన్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ పరిశోధనతో డిప్రెషన్‌కు, ఫుడ్‌ అలెర్జీకీ సంబంధం స్పష్టమైపోయింది. దాంతో ఈ సంబంధానికి వెనుక కారణాలను కూడా వెతికే ప్రయత్నం మొదలుపెట్టారు.


అలెర్జీని మన శరీరం ఒక ప్రమాదంగా భావిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అది ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది. అది ఒక తెలియని ఉద్వేగంగా మారే ప్రమాదం ఉంది. పైగా అలెర్జీ ఉన్న పిల్లలకి, తాము ఇతరులకంటే భిన్నం అన్న అభిప్రాయం కలుగుతుంది. తమ తోటి పిల్లలతో పోలిస్తే తమలో ఏదో లోపం ఉందన్న న్యూనత ఏర్పడుతుంది. అది క్రమేపీ డిప్రెషన్‌కు దారితీస్తుంది.


ఫుడ్ అలెర్జీ వచ్చిన వెంటనే కంగారుపడి వైద్యం కోసం పరుగులుతీసేకంటే... అది రాకుండా జాగ్రత్తపడటమే మేలంటున్నారు శాస్త్రవేత్తలు. తమ పిల్లలలో ఎలాంటి ఆహారం అలెర్జీని కలిగిస్తుందో కనిపెట్టి, ఆ పదార్థాన్ని వారికి దూరంగా ఉంచమంటున్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ ఫుడ్‌ అలెర్జీల మీద అవగాహన తక్కువ. పైగా పిల్లలకు సరిపడే ఆహారాన్ని కొనలేని దుస్థితి. ఒకవేళ పిల్లవాడికి తేడా చేస్తే వైద్యం చేయించలేని దైన్యం. కాబట్టి బడిలో కూడా పిల్లలకి ఫుడ్‌ అలెర్జీల మీదా, దాని నుంచి తప్పించుకునే అవకాశాల మీద తగిన అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. దాంతో పిల్లవాడి శరీరమూ, మనసు కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

 

- నిర్జర.