"ముందా రంజన్ గాడెవడో రమ్మను... ఆడి సంగతి కూడా తెల్చేస్తాను" షర్టు చేతుల్ని పైకి మడుస్తూ అన్నాడు కాశీబాబు.

 

    "మా భుజంగరావు గారు ఏ మాట మాట్లాడినా, ముప్ఫై నలభై సంవత్సరాల క్రితం విషయం మాట్లాడతారు. ఆ రంజన్ ముఫ్పై ఏళ్ళ క్రితం తమిళ యాక్టర్ గానీ... కాశీబాబూ నువ్వు కంగారు పడకు... చూడండి భుజంగరావు గారూ... అంతా బాగానే వుంది గానీ, నన్ను మచ్చిక చేస్తున్నానని వాడారు... తప్పండి... నేనేమైనా జంతువునా... తప్పండి..." బాధపడుతూ అన్నాడు జిగురుమూర్తి.

 

    "నువ్వు జంతువ్వే, బుర్రలేని జంతువ్వి. అందుకే ఈ జంతువుని ఇక్కడకు తీసికొచ్చావ్..." కోపంగా అన్నాడు భుజంగరావు.

 

    "ఇగో పెద్దమనిషీ... మాటలు జాగ్రత్తగా రానీ, కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. బాంబు పేల్చేస్తాను. అస్సలు నాపేరేం పేరనుకున్నావ్... కాశీబాంబు... మా వూళ్ళో బాంబులు పడినప్పుడు, పుట్టినోడ్ని అర్ధమైందా... నేను చెప్పినట్టూ వినకపోతే, బాంబు లెయ్యడం ఖాయం... ముందా కేడీగాళ్ళ దగ్గర్నించి ఆ ఫోటోని తీసుకుని ఇయ్యి... తర్వాత... ఆ ఇంట్లో వున్న అమ్మాయిని చూపించు. నేను టెస్ట్ చెయ్యాలి."

 

    ఆ మాటకు చిర్రెత్తుకొచ్చింది భుజంగరావుకి.

 

    "ఏందోయ్... ఫోటో ఉన్నా నీకివ్వనయ్యా... ఆ అమ్మాయి వున్నా నీకు చూపించనయ్యా. అడ్డమైన ప్రతివోడూ నా ఇంటికొచ్చెయ్యడం ఆ ఫోటో చూపించు.. ఆ అమ్మాయిని చూపించు, మీ ఆవిడ్ని చూపించూ అడిగేవోడే... ఒరే గూర్ఖా... వీడిని అర్జంటుగా బైటకు గెంటెయ్..." కోపంగా దూరంగా గేటు దగ్గరున్న గూర్ఖాని పిలిచాడు భుజంగరావు.

 

    "ఏవోయ్ పెద్దమనిషీ... తప్పుగా మాట్లాడకు... మీ ఆవిడ్ని చూపించమని అడిగానా నేను... ఛీ... ఎంతమాటనీ సేవయ్య నువ్వు... పోనీలే...గానీ... పెద్దమనిషీ... ఆ పిల్లని మాత్రం చూపించు... అంతే..." అని మెట్లమీద మఠం వేసుకొని కూర్చోబోయి...

 

    ఏదో శబ్దం రావటంతో ప్రక్కకి తిరిగి చూశాడు కాశీబాంబు. చూస్తూనే బాంబు మీద కాలేసినట్లు అదిరిపడ్డాడు.

 

    ఎదురుగా తరణి.

 

    కాశీబాంబు కనురెప్పల్ని నమ్మలేనట్లుగా టపటప లాడించాడు. తన అదృష్టం అంత త్వరగా బయటపడుతుందనుకోలేదు కాశీబాంబు. ఈలోపు కాశీబాంబుని చూసిన తరణి పరుగులాంటి నడకతో ఔట్ హౌస్ లోకి దూరిపోయింది.

 

    "మిలేగయా... ఇక ఫోటో వద్దు... పిల్లే కనిపించింది గదా!" అన్నాడు కాశీబాంబు రాజనాలలా నవ్వుతూ.

 

    "వీడికిగాని పిచ్చి పట్టేసిందేటి? ఫోటో అంటాడు... పిల్లంటాడు... మిలేగయా అని కిరస్తానీ భాష మాట్లాడతాడు... అసలా ఉల్లిపొరలా లాల్చీ ఏంటి? దాని క్రింద బనీను, క్రింద పంచె, ఆ పంచెపై బెల్టు, చేతిలో గొడుగు కళ్ళకి నల్లటి కళ్ళజోడు, మేకలా అస్తమానం దవడలు కదిలించటం, వీడ్ని చూస్తుంటేనే ఏదోలా ఉంది. ఇక వీడి మాటలు మరీ ఏదోలా ఉన్నాయి..." కసురుకున్నాడు భుజంగరావు.

 

    "పిచ్చ ఎవరికన్నది తరువాత తెలుస్తాది? ముందా పిల్లెవరో చెప్పు" అన్నాడు కాశీబాంబు.

 

    "నేన్జెప్పాను గదరా మొగడా... తరణి... ఆంజనేయులి పెళ్ళాం" అన్నాడు జిగురుమూర్తి అసహనంగా.  

 

    "కాదు..." అన్నాడు కాశీబాంబు ఒక్కసారి.

 

    "మరెవరు?" భుజంగరావు ఆసక్తిగా అడిగాడు.

 

    "నా మేనకోడలు... ఇంకా పెళ్ళికాలేదు. ఆంజనేయులి పెళ్ళాం కాదు..." అన్నాడు కాశీబాంబు ఎదురుగా వున్న బల్ల చరుస్తూ.

 

    భుజంగరావు సడన్ గా లేచి పెద్దగా నవ్వుతూ కాశీబాంబు వీపు మీద అభినందనంగా చరిచాడు.

 

    దాన్ని ఊహించని కాశీబాంబు కూచున్న బెంచీమీంచి జారి క్రిందపడ్డాడు.

 

    "ఎంత శుభవార్తా...? నా నెత్తిన పాలు పోశావ్ నిజం చెప్పి..." అన్నాడు భుజంగరావు కాశీబాంబుని పైకి లేపుతూ.

 

    కాశీబాంబు ఒక్కక్షణం భుజంగరావు కేసి దెయ్యం పట్టిన వాడిలా చూశాడు. అభినందించటానికి అంతలా చరవాలా?

 

    జిగురుమూర్తి పిచ్చిచూపులు చూస్తూ గోడకు అతుక్కుపోయాడు.

 

    "వాళ్ళిద్దరికి పెళ్ళి కాలేదని నమ్ముతున్నారు. మరి వాళ్ళు కలిసి కాపురం చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు?" దెబ్బ నుంచి తేరుకుంటూ అడిగాడు కాశీబాంబు.

 

    "కలిసి వుంటున్నారు మా ఆవిడ కోసం. కాపురం చేయటం లేదు నా కోసం" అన్నాడు భుజంగరావు అనాలోచితంగా.

 

    "ఒక్క ముక్క అర్ధమయితే చెప్పుచ్చుకు కొట్టండి. కలిసి ఉండేది మీ ఆవిడ కోసమా? కలిసి ఉన్నా కాపురం చేయంది మీ కోసమా? ఏంటో... అంతా తిరకాసుగా వుంది. అయినా వయస్సులో వున్నవాళ్ళు, అదీ ఈ కాలం పిల్లలు కలిసి ఉంటూ కాపురం చేయకుండా ఉంటారా?"

 

    "నీలాంటి జూ జాతికి చెందిన వాళ్ళయితే చేస్తారు. ఆ పిల్ల, ఆంజనేయులు అలాంటివాళ్ళు కాదు."

 

    "నా మాట వినండి... ఆ పిల్లని నాతో పంపించండి" అర్ధించాడు కాశీబాంబు.

 

    "గూర్ఖా..." అంటూ కేకేశాడు భుజంగరావు సడన్ గా. పెద్ద పెద్ద మీసాల గూర్ఖా రుద్రమూర్తిలా వస్తుండటం చూసి జిగురుమూర్తే కాశీ బాంబుని బయటకు లాక్కెళ్ళిపోయాడు.

 

    "ఓరి నీయమ్మకడుపు మాడా... ఇలా దూడని లాక్కొచ్చినట్లు లాక్కొస్తావేమయ్య... ఆ పిల్ల నా మేనకోడలు... దాని వెనుక యాభై లక్షలు ఆస్తి ఉందయ్యా... ఇలాగే వదిలేస్తే ఆ ఆస్తీ కాస్తా ఆ ఆంజనేయులు గాడికి పోతుందయ్యా..." ఏడుపు మొహం పెట్టేసి అన్నాడు కాశీబాంబు.

 

    "వ్వాట్... యాభై లక్షలా...?!" అదిరిపడ్డాడు జిగురుమూర్తి.

 

    "మరే... ఆ పిల్లకి పెళ్ళి కాకూడదు... అయితే యాభై లక్షలు పోతాయి..." అంటూ భోరున ఏడ్చేశాడు.

 

    షాక్ నుంచి తేరుకున్న జిగురుమూర్తికి కాశీబాంబు మాటల మీద గురి కుదిరింది.

 

    "అది నీకొస్తే, అందులో నాక్కొంత వాటా ఇస్తానంటే మరో మార్గం చెబుతా" అన్నాడు జిగురుమూర్తి.

 

    "బాబ్బాబు చెప్పు... నీకు ఐదు లక్షలు ఇస్తా" అన్నాడు కాశీబాంబు.

 

    "ఐదా...!" అంటూ కుప్పలా కూలిపోయాడు జిగురుమూర్తి ఆ ఆనందాన్ని తట్టుకోలేక.