"అత్తయ్యా! నేను గొప్పవాడినై మీ అందర్నీ విమానాల్లో తిప్పుతాను. ఇప్పుడు చీదరించుకున్నవాళ్ళే.... అప్పుడు గణపతి మా ఊరిపిల్లాడూ.... మా బడిలో చదివాడూ .... మా ఇంట్లో తిరిగాడూ...... మా చెట్లెక్కి ఆడాడూ .... మా కాలవలో .... ఎందుకులే ... అలా చెప్పుకుని గొప్పగా ఫీలవుతారు!" అన్నాడు.
    
    ఆ మాటలకి ఆనందంతో మొహం విప్పారంగా పార్వతమ్మ "అంతగొప్పగా ఏం చేస్తావురా అబ్బీ?" అని అడిగింది.
    
    "ఇంకాస్త అన్నం పెట్టి, పులుసెయ్యి చెప్తాను!" అన్నాడు.
    
    ఆమె పులుసు వేశాక, "ఒక్క ఐదు వేలియ్యి అత్తా! హైదరబాదెళ్ళి సినిమాల్లో చేరతాను!" అన్నాడు వేళ్ళు నాక్కుంటూ గణపతి.
    
    "సినిమాల్లో చేరతావా?" ఆమె ఆశ్చర్యంగా నోరు తెరిచేసింది.
    
    "ఔనత్తా! అన్నం పెట్టు....!" అన్నాడు.
    
    ఆమె అన్నం వడ్డిస్తూ "అలా వెళ్ళగానే చేర్చుకుంటార్రా?" అంది.
    
    "ఊఁహు, కష్టమే! బాగా ట్రై చెయ్యాలి. గంగరాజుగారి మేనల్లుడి స్నేహితుడు ఓ పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంటు డైరెక్టరట! నే హైదరాబాదు వెళతానంటే, అతని అడ్రస్ ఇస్తానన్నాడు వెళ్ళి పట్టుకోవాలి!"
    
    "అందాకా ఎక్కడుంటావు మరి?
    
    "అందుకేగా నిన్ను ఐదువేలియ్యమన్నదీ!"
    
    "అమ్మో! మీ మావయ్యకి తెలిస్తే చంపెయ్యరూ!" ఆమె గుండెల మీద చెయ్యేసుకుంది.
    
    "చెప్పి ఇస్తేనేగా చంపేదీ!" అన్నాడు పెరుగుగిన్నె ముందుకు లాక్కుని వడ్డించుకుంటూ.

    "చెప్పకుండా ఎట్లాగురా ఇచ్చేదీ? నేనెప్పుడూ ఆయన్ని అడక్కుండా ఏ పనీ చెయ్యలేదు!" అంది పార్వతి.
    
    "అమ్మ సత్తెకాలపుదీ, చాదస్తందీ కాబట్టి అట్లా ఏడుస్తోంది! నువ్వు అర్ధం చేసుకుంటావనుకున్నాను!" అన్నాడు కాస్త అలకగా.
    
    ఆమె మరి కాస్త పెరుగు వడ్డిస్తూ, ఉప్పు కావాలా?" అడిగింది.
    
    "మీ ఉప్పు తిని తినీ ఇప్పటికే చాలా రుణపడిపోయాన్లే ఇంకా ఎందుకు వేస్తావు?" కోపంగా అన్నాడు.
    
    "అవేం మాటల్రా? మావయ్యతో చెప్పకుండా ఇవ్వలేను అన్నాను గానీ ఇవ్వననలేదుగా!" అంది.
    
    "మావయ్యతో చెప్తావా ఏమిటి కొంపదీసి? చిన్నప్పుడు నులకతాడుతో కొట్టిన వాతలు ఇంకా వీపుమీద అలానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త వాతలు వేస్తాడు!" అన్నాడు భయంగా.
    
    "మరి అట్లాంటి పనులు మనకెందుకురా?" అంది.
    
    "పైకొచ్చిన హీరోలంతా ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళే తెలుసా? ఇప్పుడు వాళ్ళ అమ్మా, నాన్నలూ, మేనత్తలూ, మేనమామలూ.....వేలువిడిచిన బంధువులూ, కాలువిడిచిన స్నేహితులు అందరూ బెల్లంచుట్టూ ఈగల్లా చేరి బ్రహ్మరథం పట్టడంలేదూ!" అన్నాడు.
    
    "ఏమో బాబూ! నాకంతగా ఈ విషయాలు తెలియవు. రేపు ఓసారి మీ చిన్నమావయ్యతో మాట్లాడతాను!" అంది గణపతి కంగారుగా "అంతపని చెయ్యకు! ఈయన సాక్షాత్తూ లక్ష్మణస్వామివారు. వెంటనే వెళ్ళి అన్నగారితో విన్నవించుకుంటారు. రేపట్నుంచీ ఈ తినే ముద్దకూడా ఉండదు!" అంటూ లేచాడు.
    
    పార్వతి కంచం తీసి శుద్ది పెట్టి వంటిల్లు బట్టపెట్టి తుడిచి ఇవతల పడేసరికి ఆవలింతలొచ్చేశాయి. నిద్రతో కళ్ళు మూసుకునిపోతుంటే.... అలా జోగుతూనే గదిలోకి నడిచింది.
    
    సుబ్బారాయుడు ఎప్పటిలాగే నిద్రపోతున్నాడు.
    
    అతని గుండెలమీద పడుకున్న గోపిగాడ్ని తీయబోతుంటే అతను కళ్ళు విప్పాడు. ఎదురుగా మొహంలో మొహంపెట్టి భార్య కనిపించింది.
    
    "పార్వతీ! నీతో మాట్లాడాలి" అన్నాడు.
    
    ఆమె గోపిగాడ్ని పక్కన పడుకోబెడుతూ, "ఇప్పుడా? మళ్ళీ పొద్దుటే లేవాలి! పడుకోండి" అంది.
    
    సుబ్బారాయుడు లేచి కూర్చుని, "ఊహుఁ, రెండురోజులనుంచీ ప్రయత్నిస్తున్నాను. ఇవాళ నీకు చెప్పి తీరాలి" అన్నాడు.
    
    ఆవలింతలొస్తుంటే నోటికి చెయ్యి అడ్డుగా పెట్టుకుంటూ, "అయితే త్వరగా చెప్పండి" అంది.
    
    సుబ్బారాయుడు హుషారుగా "పార్వతీ..... ఇలా పగలల్లా వండుతూ వార్చుతూ.... రాత్రి అయ్యేసరికి అలసిపోతూ.... ఏ మార్పూ లేని ఈ జీవితం నీకు విసుగ్గా లేదూ" అన్నాడు.
    
    "ఊఁ ..." కళ్ళు మూసుకుపోతుండగా అంది.
    
    "మన రాధకి పోరూ పొందూ ..... లేని పట్నం సంబంధం ఇచ్చి చెయ్యాలని నీకు లేదూ?" అన్నాడు.
    
    "ఊఁ". అంది మత్తుగా.
    
    సుబ్బారాయుడు ఇంకా ఉత్సాహంగా, "మా కేశవుడి కొడుకు రాజకుమారుడిలా లేడూ!" అన్నాడు.
    
    "ఉ...న్నా...డు.....!" మగతగా అంది.
    
    "మన రాధ రాజకుమార్తెలానే ఉంటుందిగా ఆ ఇద్దరికీ జోడీ.....! సీతారాముల జంటలా ముచ్చటగా ఉండదూ!"
    
    భార్య నుండి జవాబు రాలేదు.
    
    "మాట్లాడవేం? ఆనందంతో మాట రావడంలేదు కదూ! అని భార్య వైపు చూసేసరికి ఆమె గుర్రుపెట్టి నిద్రపోతూ కనిపించింది.
    
    "పార్వతీ! పార్వతీ!" అని కుదిపి చూశాడు. లాభం లేకపోయింది ఆమె ఎప్పుడో నిద్రపోయింది.
    
    "అందుకే నేనీ నిర్ణయం తీసుకున్నది. పట్నం వెళ్ళి కేశవుడితో మాట్లాడతాను' తనకు తానే గట్టిగా చెప్పుకుని పడుకున్నాడు సుబ్బారాయుడు.
    
                                                              * * *
    
    www.Com., రేపల్లెలో రాధ...
    
    కిటికీ అవతల ఉన్న జాజిమల్లీ...
    
    మది లోగిల్లో ఉన్న కీట్సూ షెల్లీ
    
    మనసుని దాగుండనీయవూ ... నన్ను ఉండనీయవూ.....!
    
    భావుకత్వం ఒక శాపం పంచుకునే మనసుంటే అదే ఒక వరం.
    
    గ్రీష్మం - ఎంత అందంగా తన ప్రతాపాన్ని చూపుతోందీ.