"ఎస్ మిస్టర్ ఆదిత్యా! హర్ట్ కాకండి. మీకు కాని, ప్రొఫెసర్స్ కి కాని పూర్తిగా తెలీని జవాబులతో చూస్తున్నవాళ్ళని మిస్ లీడ్ చేయడంతోబాటు పూర్ ప్రబంధపైన విజయం సాధించేశారు."    
    
    "నిరూపించగలరా?" ఉద్విగ్నతని నొక్కిపెడుతూ అడిగాడు.
    
    "నిరూపిస్తే?" ప్రణయలో చిలిపితనం లేదు. స్థిరంగా అంది- "దేనికి సిద్దపడతారు? చెప్పండి."
    
    ఆదిత్యలో అలజడి ఉధృతం కాసాగింది.
    
    "పందెం మాట అటుంచండి" తనను తాను నిగ్రహించుకుంటూ అడిగాడు. "ఏ ప్రశ్నలతో నేను అందర్నీ మిస్ లీడ్ చేశానో చెప్పండి."
    
    కారాపింది ఇంజనీరింగ్ కాలేజీ సమీపిస్తుండగా "ముందు నేనడిగిందానికి జవాబు చెప్పండి" అంది ప్రణయ.
    
    "చివరగా మీరో ప్రశ్న అడిగారు గుర్తుందా?"
    
    "ఉంది."
    
    "ప్రాణహాని కలిగించే స్థితిలో సంపర్కానికి సిద్దపడే ప్రాణి ఏదీ అన్నారు....పైగా ఆ ప్రాణికి వాత్స్యాయనుడి కామసూత్రాల గురించి తెలీవంతూ సర్కాస్టిక్ గా ఓ వాక్యాన్ని సంధించి తన జాతి వృద్దికి  సిద్దపడే ఆ ప్రాణి ఏదీ అంటూ ప్రబంధని ఇరకాటంలో పెట్టారు... తన విషానికి తానే ఇమ్యూన్ కాని 'తేలు' ఆ ప్రాణి అని ప్రబంధ జవాబు చెప్పలేకపోయింది సరే....కాని..."
    
    ప్రణయని ఆసక్తిగా చూస్తున్నాడు ఆదిత్య.
    
    "వాత్స్యాయనుడి కామసూత్రాలు అంటూ మీరు మెన్షన్ చేయడంలో ఉద్దేశ్యం ప్రబంధ తను మిమ్మల్ని కామసూత్రాలకి సంబంధించే మీరు జవాబు చెప్పలేని ఓ ప్రశ్న అడిగిందీ అన్న ఉక్రోషమే కదూ? ప్రబంధ తెలివైనదే కాని అణువంత అహంకారంగల యువతి సరే. మరి మీరెందుకు ఆ క్షణంలో బాలెన్స్ కోల్పోయినట్టు ప్రవర్తించారు? ఇలా ఎందుకంటున్నానూ అంటే అసలు ముందునుండి మీ అప్రోచ్ చాలా డిఫరెంట్ గా వుంది ఆదిత్యా! ఇప్పటి స్టూడెంట్ జనరేషన్ లో మీరు ఎక్సెప్షన్ అనుకున్నాను కాని మీరూ ఆకతాయి అబ్బాయిలానే ప్రవర్తించారు చివర. కదూ?"
    
    ఏమని జవాబు చెప్పగలడు? నిజమే...! ఓడిపోతానన్న భయం, ఓడించాలన్న తమకం ఆ క్షణంలో తనను చాలా నియంత్రించి అలా మాట్లాడించింది.
    
    ప్రణయ గెలుపు, ఓటమి గురించికాక ఆ క్షణంలో తన వ్యక్తిత్వాన్ని అంచనావేయాలని ప్రయత్నించి నిజంగా సఫలీకృతురాలైంది.
    
    "ఎస్! నిజమే! కాని అలా బాలెన్స్ కోల్పోయేట్లు చేసింది ప్రబంధ."
    
    "అదేమిటి?"
    
    "అవును మిస్ ప్రణయా...! ఒక వయసులో వున్న అమ్మాయి వాత్స్యాయనుడి కామసూత్రాలలోని రెండో అధికరణం సాంప్రయోగికంలోని పదకొండో అధ్యాయం అంశాల గురించి ఐక్యూ టెస్ట్ లో నన్నడగడంతో రెచ్చిపోయాను."
    
    "వయసులో వున్న అమ్మాయి వాత్స్యాయనుడి కామసూత్రాల గురించి మాట్లాడకూడదా?"
    
    "అదికాదు అలాంటి ప్రశ్న నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు."
    
    "ఎక్స్ పెక్ట్ చేసేదే అయితే అది పరీక్ష ఎలా అవుతుంది? పైగా ఫలానా ప్రశ్నలు మాత్రమే అడగాలని మీరేం నియమం పెట్టుకోలేదుగా?"
    
    "కావచ్చు కాని అడగకూడని ప్రశ్నలూ కొన్ని వున్నాయి.
    
    "తర్కశాస్త్రంలో అసాధారణమయిన మేధని ప్రదర్శించిన శంకరాచార్య ఓ యువతితో కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నకి జవాబు చెప్పలేని స్థితిని ఎదుర్కొన్నాడు. కారణం బ్రహ్మచారి కాబట్టి. ఆ శాస్త్రానికి సంబంధించి అనుభవంతో తెలుసుకోవాలని కొన్నిరోజుల వ్యవధి అడిగారు. అలా అని మీరూ వాత్స్యాయనుడిని ఔపోసన పట్టేదాకా వ్యవధి అడగాల్సిందే అనడంలేదు. తెలీని మరో అంశం మిగిలిపోయింది అన్న వాస్తవాన్ని గ్రహించి పాజిటివ్ గా రియాక్ట్ కావాల్సిందీ అంటున్నాను."
    
    జీవితంకన్నా పుస్తక పరిజ్ఞానాన్ని చాలా ఎక్కువగా జీర్ణించుకున్న ఆదిత్య ఇదిగో, ఇప్పుడో విచిత్రమయిన వ్యక్తిని గమనిస్తున్నాడు. నిజమే.
    
    ప్రణయ అతడికో ప్రత్యేకయిన వ్యక్తిత్వంగల ఆడపిల్లగా కనిపిస్తోందిప్పుడు.
    
    "మనకున్న కొద్దిపాటి పరిచయంలో ఇంత చనువు తీసుకుని మాట్లాడుతున్నందుకు మరోలా అనుకోకండి ఆదిత్యా! మేధకి వ్యక్తిత్వం తోడయితే మీరింకా ఆకర్షణీయంగా కనిపిస్తారు."
    
    ఆమె చూపులనుంచి తప్పించుకోవడానికన్నట్లు నీ దృష్టి మరల్చుకుంటూ అన్నాడు. "ఇందాక నేనేదో ప్రశ్నలతో మిస్ లీడ్ చేశానన్నారు?"
    
    "నెపోలియన్ ఎక్కడ ఎప్పుడు ఎలా చనిపోయాడు అని మీరు ప్రశ్న అడిగారు- గుర్తుంది కదూ?"
    
    "అవును 1821 లో సెంట్ హెలెనా దీవిలో తన యాభయ్యవ ఏట ఆర్స్ నిక్ విషం పూసిన వాల్ పేపర్స్ వేపర్స్ మూలంగా చనిపోయాడని ప్రబంధ చెప్పింది."
    
    "మీరు సరేనన్నారు."
    
    ఆదిత్య భ్రుకుటి ముడిపడింది- "కాదా?"
    
    "అది చరిత్రకారులు అప్పుడెప్పుడో నెపోలియన్ శవం గోళ్ళని, జుట్టుని, వెంట్రుకలనిబట్టి తేల్చి చెప్పిన విషయం మిస్టర్ ఆదిత్యా! కాని ఆ తర్వాత అది నిజంకాదని కాంట్రాడిక్ట్ చేశారు."
    
    నివ్వెరపోయినట్లు చూశాడు. "ఐ డోంట్ థింక్ సో..."
    
    నవ్వేసింది మృదువుగా. "చరిత్ర అన్నది మీ థింకింగ్ తో మారిపోదు. నిజమే! ప్రారంభంలో నెపోలియన్ మరణానికి క్యాన్సర్ కారణమన్నారు. ఆ తర్వాత ఆర్సెనిక్ విషం అన్నారు కాని 1982లో యునైటెడ్ స్టేట్స్ స్పెషలిస్ట్ డాక్టర్ రాబర్ట్ గ్రీన్ బ్లాబ్ న్యూ డయాగ్నిసిస్ లో పూర్వపు స్టేట్ మెంట్స్ ని కాంట్రాడిక్ట్ చేశాడు. మొదటి భార్య జోసెఫిన్ని అమితంగా ఆరాధించిన నెపోలియన్ 1810లో మరో యువతి మేరేలోసీని పెళ్ళి చేసుకున్నాడు. కాని దాంపత్య జీవితాన్ని సవ్యంగా కొనసాగించలేకపోతున్నానని మానసికంగా మధనపడుతూ తన పర్సనల్ డాక్టర్ దగ్గర చెప్పేవాడట. దానికి కారణం నెపోలియన్ క్రమంగా స్త్రీగా మారిపోవడం.
    
    అర్ధంకానట్టు చూశాడు ఆదిత్య.
    
    "అప్పటికి ఆ జబ్బు ఏమిటో అర్ధంకాకపోయినా, నెపోలియన్ మరణించే సరికి అతడి గుండెలపైన పెరిగిన గుండ్రటి స్థనాల్నీ, సున్నితమైన శరీరావయవాల్నీ, జుట్టు వూడిపోవడాన్ని బట్టి గ్రంథులకి సంబంధించిన జబ్బు 'జోలింగర్ ఎల్లిసన్ సిండ్రోమ్' గా తేల్చి చెప్పాడు డాక్టర్ రాబర్ట్ గ్రీన్."