"నేను...నేను ఇదివరకే ఒకర్ని లవ్ చేశాను...కాలేజీలో" అని ఆగి అతనివేపు చూశాను. అతని కళ్ళల్లో రియాక్షన్ పట్టుకోవడం కష్టం!

 

    "నీ అంత అందమైన పిల్లని ప్రేమించకుండా ఎవరుండగలరు? అతను ఇంకా ప్రేమిస్తున్నాడా?"

 

    "ఉహూ! అతను అసలు ఎప్పుడూ ప్రేమించలేదు...జస్ట్ టైం పాస్ కి..." కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను.

 

    "పద..." సిద్దార్థ నా చెయ్యి పట్టుకుని లేవదీశాడు.

 

    ఇద్దరం బయటికి వచ్చాకా "ఆ విషయాలన్నీ మర్చిపో...నేను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అసలు ఇన్నాళ్ళూ నువ్వు లేకుండా నేను ఎలా ఉన్నానో అర్థంకావడంలేదు" అన్నాడు.

 

    లోకంలో ఇటువంటి మగాళ్ళుకూడా ఉంటారా! అన్నట్లు అతనివేపు చూశాను. "మేం చాలా బీదవాళ్ళం...నన్ను పెళ్ళి చేసుకుంటారా?" అని అడిగాను.

 

    సిద్దార్థ నవ్వుతూ నా నడుముచుట్టూ చెయ్యివేసి నన్ను దగ్గరికి తీసుకుని "నాకు చాలా డబ్బుంది. నువ్వు బీదదానివి యెలా అవుతావు?" అన్నాడు.

 

    నామీద పన్నీరు వర్షం కురుస్తున్నట్లుగా అనిపించింది. సన్నటి జల్లు గిలిగింతలు పెట్టి నవ్వించింది.

 

    "పద...కార్లో కూర్చుందాం" అన్నాడు.

 

    సిద్దార్థ నా మొహాన్ని చేతుల్లోకి తీసుకోగానే నాకు అప్రయత్నంగా సందీప్ గుర్తొచ్చాడు.

 

    "ఇప్పుడు కాదు" అన్నాను.

 

    "ఇంకా మన మధ్య దూరం ఏమిటీ?" అన్నాడు.

 

    "నేను మిమ్మల్ని కలిసింది నిన్నేగా!" అన్నాను.

 

    "కానీ మనది జన్మ జన్మల అనుబంధం అనిపించడంలేదూ!" అన్నాడు సిద్దార్థ.

 

    ఏమో... ఏం చెప్పగలనూ? ఒకసారి దెబ్బతిని ఉన్నాను.

 

    సిద్దార్థ తన వేలికున్న ఉంగరం నా వేలికి తొడిగి "గాంధర్వ వివాహం... ఇప్పుడు ముద్దుపెట్టుకోవచ్చా"

 

    "అయినా ఆగాలి" దూరం జరిగాను. నా శరీరం మనసుకి ఎదురు తిరగడం తెలుస్తూనే వుంది.

 

    సందీప్ అయితే ఎంత ఇరిటేట్ అయి ఉండేవాడో! సిద్దార్థ మాత్రం నవ్వి "ఓ.కే...ఈ రాత్రి నిద్రపడితే సరే...లేకపోతే రేపు నువ్వే వచ్చి ఇస్తావు" అన్నాడు.

 

    ఆ మాటలు ఎంతవిన్నా వినాలపిస్తున్నాయి.

 

    చాలాసేపు తిరిగాకా, నన్ను ఇంటిదగ్గర దింపాడు.

 

    నా వేళ్ళని ముద్దుపెట్టుకుంటూ "రేపు ప్రమోషన్ ఇస్తావనుకుంటున్నాను" అన్నాడు ఆశగా.

 

    నేను నవ్వి "గుడ్ బై" అని లోపలికి నడిచాను.

 

    "ఇంతసేపు ఎక్కడ తిరిగొస్తున్నావు? పుస్తకాలు తీసి చదివినట్లే నాకు కనబడదే?" కోప్పడింది చిన్నక్క.

 

    నేను మనసులో చిన్నగా నవ్వుకుంటూ "త్వరలో నీకంటే ముందే నా పెళ్ళయిపోతుంది...ఇంకా చదువేంటీ?" అనుకున్నాను.

 

    ఆ రాత్రి సిద్దార్థ చెప్పిన మాటలు నిజమయ్యాయి! నిద్ర రాలేదు. తెల్లవారుఝామున కళ్ళుమూశాను.


                                                         *  *  *


    ఎదురుగా ఉన్న అద్దంలో పచ్చని నాదేహం మెరుస్తూ కనిపిస్తోంది. "నాకు భయం వేస్తోంది!" ఆ మాట నేను అప్పటికి పదోసారి అనడం.

 

    "ఎందుకూ? అసలు నువ్వు డిగ్రీ చదువుతున్న అమ్మాయివేనా? నిజం చెప్పు... సిటీలో అమ్మాయిలు ఎంత ఫాస్టుగా ఉంటారో తెలుసా?"

 

    నా జుట్టులో తన ముఖం దాచుకుంటూ, తన చేతులతో నా మెడ క్రింద రాస్తూ అన్నాడు సిద్దార్థ. అప్పటికే ఓణీ నా నుండి దూరం అయింది.

 

    ఆ రూంలో ఏ.సి. శబ్దం తప్ప ఏమీ వినిపించడంలేదు. అతని బెడ్ రూం చాలా బావుంది!

 

    "ట్రీట్ ఇస్తానని ఇక్కడికి తీసుకొచ్చి ఇదంతా ఏవిటి?" కోపంగా అన్నాను అతని చేతుల్ని తప్పిస్తూ.

 

    "ఇది మాత్రం ట్రీట్ కాదా?" నన్ను రెండు చేతులతో పైకెత్తుతూ అడిగాడు.

 

    "ఒద్దు... ఒదిలెయ్...వెళ్ళిపోదాం" గింజుకున్నాను.

 

    అతను "అలాగే!" అంటూ నన్ను మంచం మీద వదిలేశాడు. ఆ తర్వాత జరగబోయేది ఊహించాను. కళ్ళు రెండూ గట్టిగా మూసుకున్నాను.

 

    సిద్ధార్థ ఉచ్చ్వాష నిస్వాశాలూ, నా మీదకి వంగడం నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి!

 

    ఒకటి...రెండు...మూడు సెకన్లు గడుస్తున్నాయి. అతను ఇంకా రాడేమిటా అని కళ్ళుతెరిచి చూశాను. అతడు సీసా ఎత్తి డ్రింక్ చేస్తూ కనపడ్డాను.

 

    "నువ్వు డ్రింక్ చేస్తావా?" అంటూ మొహం అదో విధంగా వెగటుగా పెడ్తూ అడిగాను.

 

    ఇంతలో ఫోన్ మ్రోగింది.

 

    సిద్ధార్థ వచ్చేలోపే నేను లిఫ్ట్ చేశాను.

 

    "హలో..." అన్నాను.

 

    "హలో... రేవతీ సిద్ధార్థా దిస్ సైడ్...మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్!" స్వచ్చమైన ఇంగ్లీషు ఉచ్ఛారణలో వినిపించింది.

 

    "మీరు...మీరు, సిద్ధార్థగారికి..." ఆగిపోయాను.

 

    "ఐ యామ్ మిసెస్ సిద్ధార్థ! మీరెవరు?" విసుగ్గా వినపడింది. సిద్ధార్థ ఒక్క అంగలో మంచం చుట్టివచ్చి ఫోన్ అందుకున్నాడు.

 

    "రేవతీ...హాయ్! హౌ ఆర్ యూ! ఆ అమ్మాయా? కొత్త పనిపిల్ల...ఆ...అవును... సరదాకి తీసిందిలే... చెప్పు...బాబీ ఎలా వున్నాడూ? నువ్వు ఎప్పుడు బయల్దేరుతున్నావు?...అబ్బా... ఇంకా వారమా? నో... త్వరగా రాకూడదూ!" అంటున్నాడు.